logo

పదిలో 13వ స్థానం

రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది.

Published : 01 May 2024 06:08 IST

94.45 శాతం ఉత్తీర్ణత

వెంకటాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి 9.8 జీపీఏ సాధించి మండల టాపర్‌గా నిలిచిన అక్షితను అభినందిస్తున్న మంత్రి సీతక్క

ములుగు, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. జిల్లా పరిధిలో మొత్తం 3,081 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా, 2,910 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 1,494 మంది బాలురు, 1,416 బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలురు 92.52 శాతం, బాలికలు 96.52 శాతాన్ని నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 16 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా, ప్రైవేటులో కేవలం ఐదుగురు మాత్రమే 10/10 జీపీఏ సాధించారు.


31 పాఠశాలల్లో వందశాతం

  • జిల్లా పరిధిలో జడ్పీ పరిధిలోని 13 ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 13 ఆశ్రమ పాఠశాలలు, రెండు కస్తూర్బా బాలికల విద్యాలయాలు, రెండు ఎంజేపీ గురుకులాలు, తెలంగాణ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
  • బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.
  • జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల్లో వివిధ రకాల ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగుతున్న 31 పాఠశాలల్లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం.
  • ములుగు మండలం బండారుపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాలకు చెందిన దోపతి యశ్వంత్‌, కొత్తకొండ వరుణ్‌తేజ, చిందం రోహిత్‌, సాధు హర్షిత, కొలిపాక రాంచరణ్‌ విద్యార్థులు ఒకే పాఠశాల నుంచి 10/10 జీపీఏ సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు.
  • ఏటూరునాగారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు సీరం బింధు సాయిలత, కన్నాయిగూడెం కేజీబీవీ ఉన్నత పాఠశాలకు చెందిన కుందారపు శివాని, గోవిందరావుపేట మండలం చల్వాయి మోడల్‌ స్కూలుకు చెందిన గండ్రకోట అను, సుధిని అశ్మిత, ములుగు మండలం బండారుపల్లి మోడల్‌ స్కూలుకు చెందిన ఆంగోతు సాయి చందన, నూనె శ్రీచందన, 10/10 జీపీఏ సాధించారు.

సమన్వయంతో ఉత్తమ ఫలితాలు
- జి.పాణిని, డీఈవో, ములుగు

రాష్ట్రంలో 13వ స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని పాఠశాలల్లో చదివిన 16 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాం. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేశాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని