logo

పదిలో 16వ స్థానం

రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది..

Published : 01 May 2024 06:17 IST

పడిపోయిన ఉత్తీర్ణత శాతం

పరీక్షకు హాజరైన పదో తరగతి విద్యార్థులు(పాత చిత్రం)

భూపాలపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. 2022-23లో ఉత్తీర్ణత శాతం 94.63 శాతం నమోదు కాగా.. ఈ సారి 92.31 శాతానికి తగ్గింది.. ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. గణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే.. వారిని అధికారులు డిబార్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ముగ్గురు ఇన్విజిలేటర్లు సస్పెన్షన్‌కు గురికాగా, ఆ పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారిపై చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్జేడీకి నివేదిక పంపించారు. ఈ విద్యా సంవత్సరం(2023-24)లో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను సీసీ కెమెరాల నీడలో చాలా పకడ్బందీగా  నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69, కేజీబీవీలు 11, ఆదర్శ పాఠశాలలు 6, ప్రభుత్వ ఆశ్రమ, గురుకుల పాఠశాలలు 10, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు 27 వరకు.. మొత్తం 123 వరకు పాఠశాలలున్నాయి. గత మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా బాలురు 1,782, బాలికలు 1,755 మంది, మొత్తం విద్యార్థులు 3,537 మంది పరీక్ష రాయగా, ఇందులో బాలురు 1,645, బాలికలు 1,643 మంది పాస్‌ అయ్యారు. జిల్లాలో మొత్తం 3,288 మంది ఉత్తీర్ణులయ్యారు.

బాలురదే పైచేయి

ఈ ఏడాదిలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో బాలికల కంటే బాలురు ఇద్దరు ఎక్కువగా ఉన్నారు. గణపురం మండలం గాంధీనగర్‌ మహాత్మా జ్యోతిబా ఫులే(లింగాల క్రాస్‌) విద్యాలయంలో మొత్తం 76 మంది బాలికలు పరీక్ష రాయగా, వంద శాతం పాసయ్యారు. ఇందులో ఇద్దరు బాలికలు 10 జీపీఏ సాధించారు. అదేవిధంగా పెద్దాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకరు, కేజీబీవీ చిట్యాలలో ఒకరు, మొత్తం నలుగురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.  పలు ప్రైవేటు పాఠశాలల్లో 42 మంది విద్యార్థులు 10 జీపీఏలతో మెరిశారు.

మండలాల వారీగా..: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం చిట్యాల మండలం విద్యార్థులు సాధించారు. 97.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అతి తక్కువగా మహదేవపూర్‌ మండలం 83.64 ఉత్తీర్ణత శాతం సాధించింది. మండలాల వారీగా వివరాలు ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని