logo

పదిలో నాలుగో స్థానం..!

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

Published : 01 May 2024 06:22 IST

జనగామలోని సాంఘిక సంక్షేమ గురుకుల పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు (పాతచిత్రం)

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లావ్యాప్తంగా 6,692 మంది పరీక్షలకు హాజరు కాగా 6,569 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 3,152 బాలురలో 3,076 మంది ఉత్తీర్ణులు కాగా 3,540 బాలికల్లో 3,493 మంది పాసయ్యారు. 123 మంది బాలబాలికలు ఫెయిలయ్యారు. 98.16 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని 182 పాఠశాలలకు గాను 108 పాఠశాలలు ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. 133 మంది విద్యార్థులు 10/10జీపీఏ సాధించగా 101 మంది ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు కాగా, మిగతా 32 మంది ప్రభుత్వరంగ విద్యాసంస్థలకు చెందిన వారున్నారు. గతేడాది 91.90 ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, ప్రస్తుతం సాధించిన 98.16 ఉత్తీర్ణత జిల్లాలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

గతేడాదితో పోలిస్తే మెరుగ్గా..

గతేడాది ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచారు. జిల్లాలోని 102 జిల్లా పరిషత్‌ పాఠశాలలకు గాను 56 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ సెక్టార్‌లోని బీసీ సంక్షేమ-4, కేజీబీవీ-8, ఆదర్శ పాఠశాల-3, తెలంగాణ రెసిడెన్షియల్‌ గురుకుల, సాంఘిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ గురుకులాలు  ప్రతిభ కనబర్చాయి. జిల్లాలోని తెలంగాణ రెసిడెన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌లో 69 మందికి విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణులు కావడంతో వందశాతాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాలయాల్లో-99.72, గిరిజన సంక్షేమ-99.35, ప్రైవేటు-99.27, మైనారిటీ గురుకులం-99.05, ఆదర్శ పాఠశాల-98.80, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు-98.74, సాంఘిక సంక్షేమ-97.99, ప్రభుత్వ-97.65, జిల్లా పరిషత్‌-97, ఆశ్రమ-96.77, ఎయిడెడ్‌ పాఠశాలలు-90.63శాతం ఫలితాలను సాధించాయి.


మంచి ఫలితాలు సాధించాం..
 - రాము, డీఈవో

జిల్లా కలెక్టర్‌ సలహాలు, సూచనల మేరకు మంచి ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్లాం. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచాం. గతేడాదితో పోలిస్తే ఈ ఫలితాలు చాలా సంతృప్తినిచ్చాయి. అనుత్తీర్ణులైన విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దు. సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కొద్ది రోజులు శ్రమిస్తే ఉత్తీర్ణులు కావొచ్చు.


చాలా సంతోషంగా ఉంది..
- ఎండీ.యాసిన్‌, జడ్పీహెచ్‌ఎస్‌ (బాలికల) జనగామ

10జీపీఏ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను క్షుణ్నంగా చదివేవాడిని. ఈ గ్రేడ్‌ పాయింట్‌ సాధించడానికి ఉపాధ్యాయుల సూచనలు ఎంతో దోహదపడ్డాయి.


డీఈవోకు కలెక్టర్‌ అభినందనలు..

జనగామ అర్బన్‌: విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జనగామ జిల్లా రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలవడం అభినందనీయమని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. ఫలితాలు విడుదలైన సందర్భంగా మంగళవారం డీఈవో కె.రాము, విద్యాశాఖాధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన డీఈవోను, ఉపాధ్యాయ బృందాలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని