logo

సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్‌ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్‌  రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు.

Updated : 01 May 2024 06:42 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్‌ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్‌  రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. వారి నియోజకవర్గాల పరిధి, ఇతర ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు.

ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో ఎడమ నుంచి కుడికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అభ్యర్థి కడియం కావ్య, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, తదితరులు.


సభా ముచ్చట్లు

  • భాజపా తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని వివరిస్తూ సభ ముందు గుడ్డు ఆకృతిని ఏర్పాటు చేశారు.
  • దాహంతో ఉన్న వారికి నీళ్ల సీసాలను విసిరేయకుండా చేతికి అందించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సభా వేదిక నుంచి సిబ్బందికి సూచించారు.
  • ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు  స్టీల్‌ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు.
  • మంత్రి సీతక్క ప్రసంగిస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేదికపైకి వచ్చారు.
  • సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా వెనకాల కూర్చున్న ప్రజలు ఒక్కసారిగా నిల్చొని ప్రసంగాన్ని తిలకించారు.
  • రేవంత్‌రెడ్డి ప్రసంగం ముగించుకొని వెళ్తుండగా ఆయన పాటకు కార్యకర్తలు చిందులేశారు.
  • వేసవి కావడంతో దాహం తీర్చేందుకు వాటర్‌, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. దీంతో ప్రాంగణమంతా తాగి పడేసిన వాటర్‌ ప్యాకెట్లతో నిండిపోయింది.
  • రేగొండ మండల కేంద్రంలోని ఖాళీ ప్రదేశాలు వాహనాల పార్కింగ్‌గా మారాయి.
  • లారీల్లో సైతం ప్రజలు అత్యధికంగా తరలివచ్చారు.
  • సభ అనంతరం భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారి ప్రజలతో రద్దీగా మారింది. వాహనాలు రోడ్డుపై స్తంభించడంతో కొద్దిసేపు ఇబ్బందులు పడ్డారు.
  • సభకు వచ్చేవారికి తాగునీరు అందించడానికి సుమారు 1.5 లక్షల వాటర్‌ ప్యాకెట్లు,  80 వేల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.

భాజపా ఇచ్చింది ఇదీ అంటూ వినూత్నంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ  


పర్యటన ఇలా..

  • సాయంత్రం 5.06 గంటలకు సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి  హెలికాప్టర్‌లో చేరుకున్నారు.
  • 5.10:  వేదిక పైకి వచ్చారు.
  • 5.15: నేతలు.. ముఖ్యమంత్రికి కొడవటంచ లక్ష్మినరసింహస్వామి చిత్రపటాన్ని అందించి శాలువాతో సన్మానించారు.
  • 5.29 నుంచి 5.40 : ముఖ్యమంత్రి ప్రసంగం
  • 5.53: హెలికాప్టర్‌లో తిరుగు పయనమయ్యారు.

కేరింతలు కొడుతున్న ప్రజలు


భారీ బందోబస్తు

జనజాతర బహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరుగురు డీఎస్పీలు, 22 మంది సీఐలు, 66 మంది ఎస్సైలతో పాటు 600 మంది వరకు పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. బహిరంగ సభ జరిగే జాతీయ రహదారికి పొడవునా చెన్నాపురం క్రాస్‌ నుంచి నారాయణపురం గ్రామం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నుంచే సభకు వచ్చే వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.


మోదీవి ప్రజా వ్యతిరేక విధానాలు
- వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య

రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను పొట్టనబెట్టుకున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుంది. ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి. నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాను.


ఎమ్మెల్యేల మాట...

టేకుమట్ల, చిట్యాల, రేగొండ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రావడానికి ముందు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రసంగించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియ కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.


సోనియాగాంధీకి బహుమతిగా అందిద్దాం
- గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి

అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు నన్ను 53 వేల మెజారిటీతో గెలిపించారు. ప్రస్తుత ఎంపీ అభ్యర్థికి భూపాలపల్లి నుంచి 75 వేల మెజార్టీ అందించాలి. ఈ నెల 13 వరకు కార్యకర్తలు యుద్ధ సైనికుల్లా పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేయాలి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి గెలుపును బహుమతిగా అందించాలి.


రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలో కాంగ్రెస్‌ రావాలి
-  రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పరకాల

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకు రాష్ట్రంలో అధిక ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.


కుల, మతాలతో రాజకీయాలు సరికాదు
- కేఆర్‌ నాగరాజు, వర్ధన్నపేట

కులం, మతం పేరుతో భాజపా రాజకీయం చేస్తోంది. భాజపా, భారాస చీకటి మిత్రులు. ఇలాంటి దుష్టశక్తుల పార్టీలను తరిమికొట్టాలి. రాముడి పేరుతో భాజపా అసత్యపు బాణాలు వేస్తోంది. వాటిని కార్యకర్తలు తిప్పికొట్టాలి.


భాజపా తెలంగాణ వ్యతిరేక పార్టీ
-  కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్‌

భాజపా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమైన పార్టీ. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమి లేదు.


పదేళ్లలో తీసుకోని నిర్ణయాలు.. కాంగ్రెస్‌ నాలుగు నెలల్లోనే
-  నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ.

కడియం కావ్యను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. గత పదేళ్లలో భాజపా తీసుకోలేని నిర్ణయాలను నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ తీసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే మన ప్రాంతానికి రావాల్సిన నిధులు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని