logo

అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం

మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. గాలిదుమారంతో మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి.

Updated : 08 May 2024 06:28 IST

నెహ్రూసెంటర్‌, కొత్తగూడ, గార్ల , దంతాలపల్లి, గూడూరు, కురవి: తొర్రూరు, పెద్దవంగర, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. గాలిదుమారంతో మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మార్కెట్‌లో కాంటాలు వేసిన వందల బస్తాలు తడిశాయి. వర్షపు నీరు ధాన్యం రాశుల కిందకు చేరింది. గాలి వాన బీభత్సంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మహబూబాబాద్‌- చిన్నగూడూరు రహదారిలోని దూద్యతండా, కుమ్మరి కుంట్లతండా సమీపంలో రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. పెట్రోలింగ్‌కు వెళ్లిన రూరల్‌ ఎస్సై దీపికారెడ్డి స్థానికుల సహాయంతో చెట్ల కొమ్మలను తొలగింపు చర్యలు చేపట్టారు.  కొత్తగూడలో వర్షం కురిసి పలుచోట్ల ధాన్యం తడిసినట్లు పలువురు రైతులు పేర్కొన్నారు. గార్ల మండలం మంగళితండాలో ఎన్‌.లాలు, కవితకు చెందిన రేకుల ఇల్లు దెబ్బతిన్నది.   వేములపల్లిలో ప్రధాన రహదారిపై భారీ వేప చెట్టు కూలిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బీరిశెట్టిగూడెంలో ఓ వ్యక్తికి చెందిన మరుగుదొడ్డి పైకప్పు ఎగిరిపోయింది. గూడూరులో శివాలయం రహదారి సమీపంలో వృక్షం నేల కూలింది. ఎదురుగా ఉన్న విద్యుత్తు తీగలపై పడడంతో అవి తెగిపోయాయి. అదే సమయంలో రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బండారి సిద్ధుపై పడడంతో తలకు గాయాలయ్యాయి. స్థానికులు సీహెచ్‌సీలో చేర్పించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన కౌసల్యకు చెందిన గేదే ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కురవి మండలంలో పలుచోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. రామచంద్రాపురంలో మారపల్లి రాములు, తట్టుపల్లిలో సతీశ్‌ అనే వ్యక్తి ఇంటిపై ఉన్న రేకులు కింద పడి ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు