logo

విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!

దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

Updated : 10 May 2024 05:51 IST

దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. అందుకే ఓటు చేసే మేలును గుర్తించిన కొన్ని దేశాలు దాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి చేస్తూ చట్టాలు చేశాయి.

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి,  దేవరుప్పుల, గోపాలపూర్‌, న్యూస్‌టుడే

బ్రెజిల్‌.. జరిమానా తప్పదు

ఓటు వేయని వారిపై కఠిన చర్యలుంటాయి. ఒకసారి ఓటు వేయకుంటే జరిమానాతో సరిపెడతారు. వరుసగా మూడుసార్లు ఓటింగ్‌లో పాల్గొనకపోతే ఉద్యోగ పోటీ పరీక్షలు రాయకుండా, బ్యాంకుల నుంచి రుణాలు, పాస్‌ పోర్టు పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తారు. ఆరు నెలల్లోగా జరిమానాలు చెల్లించకున్నా.. సరైన వివరణ ఇవ్వకపోయినా పైవాటిని రద్దు చేసే అవకాశం ఉంటుంది.

ఆస్ట్రేలియా.. కోర్టు విచారణ

ప్రపంచంలో అత్యధికంగా పోలింగ్‌ శాతం నమోదయ్యే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 2019లో జరిగిన ఫెడరల్‌ ఎన్నికల్లో 92 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌లో గైర్హాజరై తగిన కారణాన్ని చెప్పకపోతే జరిమానా విధిస్తారు. కోర్టు విచారణకు ఆదేశిస్తారు. కొన్ని సందర్భాల్లో జరిమానా చెల్లించని వారిపై కోర్టు ధిక్కారం కేసులో జైలు శిక్ష కూడా విధిస్తారు.

సింగపూర్‌.. జాబితా నుంచి తొలగిస్తారు

గైర్హాజరైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. తిరిగి జాబితాలో పేరు నమోదు చేయాలంటే సరైన కారణం చెప్పాలి. కారణాలు నమ్మశక్యంగా లేకపోతే ఓటు పునరుద్ధరణకు రిజిస్ట్రేషన్‌ అధికారికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
పెరూ.. ఓటు వేయని వారిని బ్యాంకింగ్‌, ఇతర ప్రజాపాలన వ్యవస్థలో లావాదేవీలు చేయకుండా పరిమితం చేస్తారు. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

నౌరు..

చట్టబద్ధమైన కారణం చెప్పకుంటే జరిమానా వేస్తారు.

బెల్జియంలో రూ.10 వేల వరకు జరిమానా..

బెల్జియంలో వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కు ఉండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఓటు హక్కు వినియోగంపై పౌరులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. ఇక్కడ 96 శాతం ఓటింగ్‌ నమోదవుతోంది.

గ్రీస్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు ఇవ్వరు..

గ్రీస్‌లో ఓటుకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఇక్కడ ఓటు వేయని వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాల పైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 96 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదవుతుంది.

థాయిలాండ్‌..

గైర్హాజరైన ఓటరు కొన్ని రాజకీయ పరమైన అర్హతలను కోల్పోవాల్సివస్తుంది. చట్టాలను ప్రతిపాదించే హక్కు, మంత్రులను అభిశంసించే హక్కు, రాజకీయ పదవులను పొందే హక్కును కోల్పోతారు.

బొలీవియా..

ఓటింగ్‌లో పాల్గొనని వారిని పోలింగ్‌ జరిగిన తర్వాత రోజు నుంచి మూడు నెలల పాటు బ్యాంకు లావాదేవీలు చేయకుండా చేస్తారు. ప్రతి ఎన్నికల సమయంలో జాతీయ ఎలక్టోరల్‌ కోర్టు వారికి జరిమానా విధిస్తుంది.

22 దేశాల్లో తప్పనిసరి

ప్రపంచంలో 22 దేశాలు ఓటు వినియోగం తప్పనిసరి చేస్తూ.. చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నాయి. ఇందులో థాయిలాండ్‌, సింగపూర్‌, ఉరుగ్వే, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బొలీవియా, బ్రెజిల్‌, మెక్సికో, నౌరు, పనామా, కాంగో, కోస్టారికా, లక్సెంబర్గ్‌,  పరాగ్వే, పెరూ, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వెడార్‌, ఈజిప్ట్‌, గ్రీస్‌, హోండురాస్‌, లెబనాన్‌ దేశాలున్నాయి. చాలా దేశాలు ఎన్నికల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాయి. ఓటు హక్కు పౌరుల బాధ్యత అని అవగాహన కల్పిస్తాయి.

మన వద్ద ఇలా..

మన వద్ద శిక్షలు, విచారణలు, జరిమానాలు లేవు. ఆంక్షలు అసలే ఉండవు. ఓటర్ల కోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు కల్పిస్తున్నా చాలా మంది పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లడం లేదు. మన దగ్గర తక్కువ పోలింగ్‌ శాతం నమోదవుతున్న నేపథ్యలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలనే డిమాండ్‌ వస్తోంది.


జరిమానా విధిస్తారు

తోటకూరి నరేశ్‌, దేవరుప్పుల (ఆస్ట్రేలియాలో ఉంటున్నారు)

ఆస్ట్రేలియాలో ఓటు వేయని వారిని అధికారులు వివరణ కోరుతారు. సరైన కారణం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోలేదని నిర్ధారిస్తే జరిమానా వేస్తారు. 28 రోజుల్లోగా జరిమానా చెల్లించకపోతే రుసుం మరింత పెరుగుతుంది. ఓటు వేయడానికే చాలా మంది ముందుంటారు.


పోలింగ్‌ రోజు పండగ వాతావరణం

ఎర్రమరెడ్డి శశిధర్‌రెడ్డి, దేవరుప్పుల (సింగపూర్‌లో ఉంటున్నారు)

మన దగ్గర పండగ నాడు ఎంత సందడిగా ఉంటుందో, సింగపూర్‌లో పోలింగ్‌ రోజున అదే వాతావరణం కనిపిస్తుంది. అందరూ సంతోషంగా పోలింగ్‌లో పాల్గొంటారు. ఓటు వేయకుంటే అవమానంగా భావిస్తారు. గైర్హాజరైతే ప్రభుత్వానికి సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ సహేతుకంగా లేకపోతే జరిమానా తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని