logo

ఈసారి.. తూడు పనులతో సరి

సాగు, మురుగు కాలువలపై వేసవిలో ప్రతిపాదించిన నిర్వహణ పనులకు సంబంధించిన టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది. ప్రతిపాదించిన ఓఅండ్‌ఎం పనులకు పరిపాలన అనుమతులు ఈనెల మొదటి వారానికి గానీ రాలేదు. తరువాత

Published : 28 May 2022 04:47 IST

పూడికతీతపై గుత్తేదారుల విముఖత

కోపల్లె వంతెన వద్ద గుర్రపుడెక్కతో నిండిన బొండాడ డ్రెయిన్‌

ఉండి, న్యూస్‌టుడే: సాగు, మురుగు కాలువలపై వేసవిలో ప్రతిపాదించిన నిర్వహణ పనులకు సంబంధించిన టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది. ప్రతిపాదించిన ఓఅండ్‌ఎం పనులకు పరిపాలన అనుమతులు ఈనెల మొదటి వారానికి గానీ రాలేదు. తరువాత టెండర్లు పిలిచి వర్కు ఆర్డర్స్‌ జారీ వంటి ప్రక్రియ పూర్తయ్యే పుణ్యకాలం గడిచిపోయింది. ముందుగా ప్రకటించిట్లు జూన్‌ 1న నీరొదిలితే ప్రధాన కాలువల శివారు పల్లెల్లో మినహా ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పనులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

జిల్లాలో సాగునీటి కాలువల పరిధిలో మట్టి పూడికతీత, గేట్ల మరమ్మతులు తదితర 60 పనులకు టెండర్లు పిలిచారు. వాటిలో కేవలం 20 పనులకు మాత్రమే గుత్తేదారులు ముందుకొచ్చారు. అత్యధిక చోట్ల మట్టి పూడికతీత పనులకు టెండర్లు వేయడానికి కూడా గుత్తేదారులు ఆసక్తి చూపలేదు. డ్రెయినేజీ శాఖ పరిధిలో రూ.5 కోట్ల విలువైన 27 పనులకు ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించారు. ఇటీవల టెండర్లు తెరవగా కేవలం రూ.73 లక్షల విలువైన 8 పనులకే మాత్రమే స్పందన లభించింది. మరోపక్క సాగు, మురుగు కాలువల పరిధిలో ప్రతిపాదించిన తూడు, గుర్రపుడెక్క పనులపై గుత్తేదారులు కొంత ఆసక్తి కనబరిచారు. తక్కువ వ్యవధిలో ఈ పనులు చేపట్టే అవకాశాలుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పనులైనా వర్షాలు వచ్చే లోపు పూర్తిచేస్తేనే సత్ఫలితాలుంటాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.

పనులపై రోజు వారీ నివేదిక

పంట, మురుగు కాలువలపై వివిధ ప్రాంతాల్లో నిర్వహణ పనులు ప్రారంభమయ్యాయి. వాటి ప్రగతిపై రోజు వారీ నివేదికను కలెక్టర్‌ కార్యాలయానికి పంపుతున్నాం. నీరొచ్చేలోపు తూడు తొలగింపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల మట్టిపూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. - నాగార్జునరావు, జిల్లా అధికారి, జలవనరుల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని