logo

అంతస్తు మెలిక.. పనులు నత్తనడక!

వచ్చే నెల 5న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనుల్లో భాగంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అది కూడా చాలా తక్కువ చోట్ల ఆయా పనులు జరుగుతున్నాయి. రెండో దశ అదనపు తరగతి గదుల

Published : 29 Jun 2022 04:27 IST

నాడు-నేడు రెండో దశ నిర్మాణాల్లో తీవ్ర జాప్యం

చింతలపూడి, న్యూస్‌టుడే: వచ్చే నెల 5న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనుల్లో భాగంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అది కూడా చాలా తక్కువ చోట్ల ఆయా పనులు జరుగుతున్నాయి. రెండో దశ అదనపు తరగతి గదుల నిర్మాణానికి కొత్త మెలిక పెట్టారు. గతంలో పాఠశాల ఆవరణలోని స్థలంలో గదులు నిర్మించే వారు. తాజాగా మంజూరైన నిధులతో ఇప్పటికే ఉన్న పాత భవనాలపై రెండు, మూడు అంతస్తులుగా నిర్మించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ పునాదుల్లో గట్టితనం లేకుండా గదులు నిర్మిస్తే ప్రమాదకరమని ప్రధానోపాధ్యాయులు, పీఎంసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇది చింతలపూడి సుబ్బరాజు జడ్పీ ఉన్నత పాఠశాల. ఇక్కడ 650 మంది విద్యార్థులుంటే విలీనంలో భాగంగా 3, 4, 5 తరగతులకి చెందిన 169 మంది గతేడాది వచ్చి చేరారు. ప్రస్తుతం 815 మంది చదువుతున్నారు. కొత్తగా నలుగురు ఉపాధ్యాయులు వచ్చారు. 800 మంది విద్యార్థులకు ఒక్కరే హిందీ ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ సబ్జెక్టుకు సంబంధించి అదనంగా ఇద్దరు కావాలి. ఇంతకు ముందు 15 సెక్షన్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 19కి చేరింది. ఒక్కో దానిలో 40 మంది మాత్రమే ఉండాలి. ఉపాధ్యాయులు 28 మంది అవసరమైతే 24 మందే ఉన్నారు. ఇంకా 16 గదులు అవసరం ఉంది. ఆయా పనులు ప్రారంభమే కాలేదు.


పొంతన లేని ధరలు

మరోవైపు మార్కెట్లో సిమెంట్‌, ఇనుము ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధరల ప్రకారం ఒక్క ఇటుకలు మాత్రమే కొనుగోలు చేయవచ్చని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. మిగిలిన వాటి ధరలు పొంతన లేకపోవడంతో పనులు చేపట్టాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వం ఇనుము, ఇసుక ఇస్తామని చెబుతున్నా.. అరకొరగా మాత్రమే సరఫరా చేస్తోంది.

వేగవంతం చేస్తున్నాం

నాడు-నేడు పనులను వేగవంతం చేస్తున్నాం. పై అంతస్తులో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపడుతున్నాం. ఒకవేళ పాఠశాల గ్రౌండ్‌ ఫ్లోర్‌ పునాదులు బలంగా లేవని భావిస్తే పీఎంసీలు సమావేశమై తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపి అనుమతులు పొందాలి. ఇంజినీరింగ్‌ నిపుణుల సూచనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నాం’అని సమగ్ర శిక్షా అభియాన్‌ ఏలూరు ఏపీసీ శ్యాంసుందర్‌ తెలిపారు.

అదనపు తరగతుల కోసం సేకరించిన ఇటుక

* ఒక్కో గది నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున రూ.142 కోట్లు మంజూరయ్యాయి. పనుల ప్రారంభం, శంకుస్థాపన, గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణాలకు ఇప్పటికే కొంత మేర నిధులు విడుదల చేశారు. కొన్ని చోట్ల పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో పునాదులు తవ్వి అదనపు గదుల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారులతో ప్రారంభిస్తున్నారు. తాజాగా ఆ గదులను గ్రౌండ్‌ ఫ్లోర్‌గా కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలపై రెండు, మూడు అంతస్తులుగా నిర్మించాలని, ఫలితంగా పాఠశాల స్థలం వృథా కాదని ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే ఉన్న భవనాలు పురాతనమైనవి కావడం, వాటి సామర్థ్యం ఎంత మేర ఉందో తెలియదు. పైగా మొదటి అంతస్తులో తరగతి గదులకు వెళ్లడం విద్యార్థులు, ఉపాధ్యాయులకు అసౌకర్యంగా ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతస్తుల్లో తరగతుల నిర్వహణతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. చాలా పాఠశాలల్లో సరిపడా స్థలం ఉన్నా కూడా అంతస్తులు నిర్మించాలని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని