logo

బడిబువ్వకు బాలల డుమ్మా!

ఏడాదికోసారి మెనూ మార్చినా తరచూ అధికారులు తనిఖీలు చేపట్టినా మధ్యాహ్న భోజన పథకం ఫలితాల్లో మాత్రం నిరాశే ఎదురవుతోంది.

Published : 03 Feb 2023 02:17 IST

ఉమ్మడి జిల్లాలో 9 వేలకు పైగా దూరం
మెనూ మార్చినా ఫలితాల్లో నిరాశే
పాలకొల్లు, న్యూస్‌టుడే

ఏడాదికోసారి మెనూ మార్చినా తరచూ అధికారులు తనిఖీలు చేపట్టినా మధ్యాహ్న భోజన పథకం ఫలితాల్లో మాత్రం నిరాశే ఎదురవుతోంది. గతంలో ప్రతి గురువారం వండిపెట్టే కిచిడీని జిల్లాలోని విద్యార్థులు తినేవారు కాదు. దీనిపై చాలాసార్లు సమావేశాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నవంబరులో కిచిడీ స్థానే సాంబారు అన్నం పెట్టాలని మెనూలో మార్పులు చేశారు. గతంలో శనివారం తెల్ల అన్నం, సాంబారు వడ్డించేవారు. ప్రస్తుతం అది కాస్తా ఆకుకూరలతో అన్నంగా మార్చారు. ఇది వండిన రోజు కూడా విద్యార్థులు మొహం చాటేస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

అంతంత మాత్రమే

కలిదిండి, న్యూస్‌టుడే:  కోరుకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి వరకు 583 మంది విద్యార్థులకు 462 మంది హాజరు కాగా, 326 మంది మాత్రమే భోజనం చేశారు. అన్నం, సాంబారు విడివిడిగా వండి.. రెండింటిని కలిపి వడ్డించారు. గుడ్డు పెట్టారు. కూరల్లో నాణ్యత లేని కారణంగా తాము పాఠశాలలో భోజనం చేయడం లేదని అక్కడ తినని విద్యార్థులు తెలిపారు.

ఉంగుటూరు, న్యూస్‌టుడే: కైకరం ఉన్నత పాఠశాలలో గురువారం సాంబారు, అన్నం విడివిడిగా వడ్డించారు. మొత్తం 603 మంది విద్యార్థులకు 475 మంది హాజరవగా.. 426 మంది మధ్యాహ్న భోజనం చేశారు. కొందరు ఇళ్ల నుంచి బాక్సుల్లో భోజనం తెచ్చుకున్నారు. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్వో ప్లాంట్‌   మరమ్మతుకు గురైంది. దాతలు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

వండే పద్ధతే వేరు..

మధ్యాహ్న భోజనం మెనూలో ఇచ్చిన వంటలు, వాటిని వండే తీరు ప్రభుత్వం సూచించింది ఒకలా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరోలా ఉన్నట్లు ‘న్యూస్‌టుడే’ పరిశీలనలో తేలింది. ఎందుకంటే సాంబారు అన్నం అంటే అన్నం పెట్టి దానిలో సాంబారు పోయడం కాదని అది వండే పద్ధతి వేరుగా ఉంటుందని గ్రహించినవారు చాలా తక్కువగా ఉన్నారు. పద్ధతి ప్రకారం సాంబారు మరగకాచి దానిలో కడిగిన బియ్యం వేసి ఉడికించడం లేదా కాస్త పలుకుండేలా ఉడికిన అన్నాన్ని వేసి తయారయ్యేవరకూ వండి దానికి తాలింపు పెట్టాలి. సాంబారు బాత్‌లో వెన్న లేక నెయ్యి వేయాల్సి ఉంది. మెనూలోనూ అలానే పొందుపరిచారు. ఒక్క పాఠశాలలోనూ నెయ్యి వాసన  తగలడం లేదు. శనివారం ఆకుకూరలతో అన్నం అంటే ఫ్రైడ్‌ రైస్‌ తరహాలో చేయాలి. కానీ ఆకుకూరలు ఉడకబెట్టి మిక్సీలో మెత్తగా చేసి దానిని తెల్ల అన్నంలో కలిపేస్తున్నారు. ఇది చేదుగా ఉంటోందని విద్యార్థులు చెబుతున్నారు. మెనూలో చేసిన మార్పుల ప్రకారం క్షేత్రస్థాయిలో వంట నిర్వాహకులకు చేయడం వచ్చో లేదోనన్న విషయాన్ని విస్మరించడం కూడా పథకం నీరుగారడానికి కారణమవుతోంది.


పులిహోరతో సరిపెట్టారు

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: రామన్నపాలెం  ప్రాథమిక పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. గురువారం సాంబారు  అన్నం పెట్టాల్సి ఉండగా.. వంట సిబ్బంది పులిహోర పెట్టారు. మొత్తం 112 మంది విద్యార్థులకు 105 మంది పాఠశాలకు హాజరై భోజనం చేశారు. సాంబారు బాత్‌ ఎవరూ తినడం లేదని అందుకే పులిహోర చేశామని సిబ్బంది చెప్పారు.

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 588 మంది విద్యార్థులకు గురువారం 420 మంది హాజరవగా 398 మంది మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం సాంబారు అన్నం, గుడ్డు పెట్టాల్సి ఉండగా.. అన్నం, సాంబారు వేర్వేరుగా వడ్డించి గుడ్డు వేశారు.

ఫలితం లేని తనిఖీలు

ఉమ్మడి జిల్లాలో మంగళవారం గణాంకాలను పరిశీలించగా 76,135 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవగా 66,410 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేశారు. ఇదే గురువారం నమోదైన గణాంకాలను పరిశీలించినా సరాసరి 9 వేల మందికి పైగా బడిబువ్వకు డుమ్మా కొట్టినట్లు స్పష్టమవుతోంది. పశ్చిమలో 39,411 మంది విద్యార్థులు గురువారం హాజరవగా 34,859 మంది మాత్రమే పాఠశాలల్లో భోజనం చేశారు. పథకం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినా గ్రామ సచివాలయాల నుంచి తల్లిదండ్రుల కమిటీల వరకు తనిఖీలు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.


* ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెడితే పిల్లలు తినడం లేదని చాలా పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, ఉపాధ్యాయుల ఒప్పందం మేరకు సొంత మెనూలను అమలు చేస్తున్నారు.


* దీనిపై మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్‌  కె.కృష్ణరావును చరవాణిలో సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని