logo

ఈ నెలా నిరీక్షణే!

ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారీ జీతాల కోసం నిరీక్షణే మిగిలింది. ఐదు నెలలుగా 1వ తేదీని ఉద్యోగులు మరిచిపోయారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీ వస్తుందంటే చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు వేతనం కోసం చూస్తుంటారు.

Published : 06 Feb 2023 05:36 IST

కొన్ని శాఖల ఉద్యోగుల ఖాతాల్లో జమకాని వేతనాలు

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారీ జీతాల కోసం నిరీక్షణే మిగిలింది. ఐదు నెలలుగా 1వ తేదీని ఉద్యోగులు మరిచిపోయారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీ వస్తుందంటే చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు వేతనం కోసం చూస్తుంటారు. ఈఎంఐలు, అద్దెలు, నెలవారీ సరకులు, వైద్యం, మందులు తదితర ఖర్చులకు జీతమే ఆధారం. ఈ నెల 5వ తేదీ దాటినా వేతనం జమ కాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఉపఖజానా కార్యాలయాల పరిధిలో సుమారు 40 శాఖలకు సంబంధించి 30 వేల మంది ఉద్యోగులు, 25 వేల మంది పింఛనుదారులున్నారు. ప్రతి నెలా 15 నుంచి 25లోగా సంబంధిత డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌ అధికారుల (డీడీవో) నుంచి ఎస్టీవో కార్యాలయాలకు జీతాల బిల్లు అప్‌లోడ్‌ చేస్తారు. 26వ తేదీ నుంచి 30లోగా ఎస్టీవోలు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిర్దేశిత గడువులోగా చేస్తారు. ప్రస్తుతం ఉప ఖజానా కార్యాలయాల్లో ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేదు. కానీ నెల ప్రారంభమై ఐదు రోజులైనా వేతనాల చెల్లింపులు జరగలేదు.

కొందరికే.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు జమ కాలేదు. సచివాలయ ఉద్యోగులకు ఒకటో తేదీనే బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేశారు. ఆర్థిక శాఖ పరిధిలోని  ఉప ఖజానా, పోలీసు, ఏపీజీఎల్‌ఐ, ఆడిట్‌, పే, అకౌంట్స్‌, జలవనరులు, అబ్కారీ శాఖల వారికి వేతనాలందాయి.


ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు.. పదవీ విరమణ తర్వాత ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పింఛన్లో సగానికి పైగా మందులకే ఖర్చు పెడుతున్నారు. చాలా మంది మందుల దుకాణంలో అరువు తీసుకొని పింఛను వచ్చిన తరువాత డబ్బు  చెల్లిస్తున్నారు. ఇప్పుడు వారికి మందులకు కష్టంగా మారింది. ఐదు నెలల నుంచి   పింఛను సకాలంలో రావడం లేదు. విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు సరిగా లేదు.    

జి.జేమ్స్‌, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు  


* సకాలంలో ఇవ్వడం లేదు.. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌ డబ్బులు, ఏపీజీఎల్‌ఐ, పదవీ విరమణకు రావాల్సిన బకాయిలు,  జీతాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. నెలనెలా చెల్లించాల్సిన జీతాలను కూడా కక్ష కట్టి సకాలంలో చెల్లించడం లేదు. కొన్ని శాఖలకు సకాలంలో చెల్లించినా మరికొన్ని శాఖల్లో నిరీక్షణ తప్పడం లేదు.

గుత్తుల శ్రీనివాస్‌, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని