logo

కార్పొరేషన్‌లో కాసుల వేట

చొదిమెళ్లలోని ఓ కాలనీలో నిర్మాణదారు మూడు నెలల క్రితం 200 గజాల స్థలం కొనుగోలు చేశారు. పంచాయతీలో 2022 జనవరిలో ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకున్నట్లు తప్పుడు పత్రం సృష్టించి ఇంటి నిర్మాణం చేపట్టారు.

Published : 07 Feb 2023 06:08 IST

ప్లాన్‌ అప్రూవల్‌ పేరిట మోసం
కార్పొరేటర్లు, అధికారులు కుమ్మక్కు
విలీన గ్రామాలు వేదికగా తంతు
ఈనాడు డిజిటల్‌, ఏలూరు

* చొదిమెళ్లలోని ఓ కాలనీలో నిర్మాణదారు మూడు నెలల క్రితం 200 గజాల స్థలం కొనుగోలు చేశారు. పంచాయతీలో 2022 జనవరిలో ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకున్నట్లు తప్పుడు పత్రం సృష్టించి ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పరిధిలోని కార్పొరేటర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అతనిపై దండెత్తారు. తప్పుడు పత్రంతో ఇల్లు ఎలా కడతావో చూస్తాం అంటూ బెదిరించారు. నిబంధనల ప్రకారం వెళితే రూ.3 లక్షలు కట్టాలి. మాకు రూ.2 లక్షలిస్తే ఆలోచిస్తాం అన్నారు. చివరికి అతను రూ.1.5 లక్షలిచ్చి దండం పెట్టాడు.


* తంగెళ్లమూడిలో ఓ బిల్డర్‌ నాలుగు నిర్మాణాలు చేపడుతున్నారు. 2022 జనవరిలో పంచాయతీలో ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకున్నట్లు ధ్రువపత్రం సృష్టించారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్‌ మీ అప్రూవల్‌ పనికి రాదు నిర్మాణాలు ఆపిస్తామంటూ బెదిరించారు. బిల్డర్‌ బతిమాలడంతో ఇంటికి రూ.50 వేలు చొప్పున రూ.2 లక్షలు వసూలు చేశారు. విషయం తెలుసుకున్న టౌన్‌  ప్లానింగ్‌ అధికారులు చుట్టుముట్టి  రూ.50వేలు తీసుకున్నారు.


ఏలూరు నగరపాలిక అక్రమాలకు అడ్డాగా మారింది. విలీన గ్రామాలే వేదికగా కార్పొరేటర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కొత్త దందాకు తెర తీశారు. టౌన్‌ ప్లానింగ్‌లో నిబంధనను అడ్డుపెట్టుకుని విలీనం కాకముందు ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మామూళ్లు పుచ్చుకుని మిన్నకుంటున్నారు. ఈ కథంతా అధికార పార్టీ కార్పొరేటర్లే నడిపిస్తున్నారు.

ఏలూరు చుట్టుపక్కల ఉన్న 7 పంచాయతీలను ప్రభుత్వం కార్పొరేషన్‌లో విలీనం చేసింది. 2022 ఏప్రిల్‌ నుంచి పరిపాలన మొత్తం కార్పొరేషన్‌ కేంద్రంగా సాగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేసేందుకు అప్రూవల్‌   తీసుకోవాలి. స్థలం ప్రభుత్వ విలువపై 14 శాతం చలానా కట్టాలి. నగదు చెల్లించాక నిర్మాణం మొదలుపెట్టేందుకు 2 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అంటే 2022 మార్చి లోపు పత్రాలు తీసుకుంటే 2024 మార్చి వరకూ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని బిల్డర్లు, నిర్మాణదారులు కార్పొరేషన్‌లో విలీనం కాక ముందే(2022 ఏప్రిల్‌) తాము పంచాయతీల నుంచి ప్లాన్‌ అప్రూవల్‌ తెచ్చుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. పంచాయతీలో అధికారులకు ముడుపులు ఇచ్చి గతంలోనే అనుమతులు ఇచ్చినట్లు తప్పుడు తేదీలు, సంతకాలు చేయించుకుంటున్నారు.  


మీకింత.. మాకింత!

విలీన పంచాయతీలైన తంగెళ్లమూడి, వెంకటాపురం, చొదిమెళ్ల, శనివారపుపేటల్లో చాలా వార్డుల్లో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. ప్లాన్‌ అప్రూవల్‌కు నగదు చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు... కార్పొరేటర్లతో కుమ్మక్కై వాటాలు వేసుకుంటున్నారు. ఆ విభాగంలో ఓ అధికారి ఈ తరహా నిర్మాణాలు వెతికి పట్టుకోవాలని కిందిస్థాయి ఉద్యోగులకు ఆదేశాలిచ్చారంటే వేట ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. గుర్తించిన నిర్మాణదారుల దగ్గరకు వెళ్లి బెదిరించి భయపెట్టి ఒక్కో ఇంటికి రూ.50వేల- రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నారు.


ప్రభుత్వ ఆదాయానికి గండి

కార్పొరేటర్లు, పట్టణప్రణాళిక అధికారులు కలిసి ప్రభుత్వ ఆదాయాన్ని మింగేస్తున్నారు. తంగెళ్లమూడిలో 200 గజాల స్థలం ప్రభుత్వ ధర ప్రకారం రూ.18లక్షలు. అంటే ప్లాన్‌ అప్రూవల్‌ కోసం 14 శాతం చొప్పున రూ.2.52 లక్షలు చెల్లించాలి. తప్పుడు పత్రాలు సృష్టించి నిర్మాణదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదు కట్టడం లేదు. విలీన పంచాయతీల్లో చలానా కట్టకుండా నిర్మిస్తున్న కట్టడాలు వందల్లో ఉన్నాయి. దీంతో రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.  ఈ అంశంపై కమిషనర్‌ వెంకటకృష్ణను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని