logo

ఈ పాపం ఎవరిది?

నవమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన చిన్నారులకు ప్రేమను పంచే బదులు మృత్యుఒడిలోకి విసిరేస్తున్నారు కొంతమంది కర్కశులు. మరికొంత మంది ముళ్లకంచెలు, చెత్తకుప్పలు, నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేస్తున్నారు.

Published : 23 Mar 2023 04:38 IST

ఆడపిల్ల పుడితే వదిలించుకుంటున్న వైనం
కానరాని ‘ఊయల’ కార్యక్రమం
ఏలూరు వన్‌టౌన్‌, జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే

* ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రం ఏలూరు పాతబస్టాండ్‌ సమీపంలోని కృష్ణా కాలువలో ఆడ శిశువు మృతదేహం కొట్టుకొచ్చింది.  మృతి చెందిన తర్వాత ఇలా పడేశారా లేక ఆడబిడ్డ అని విసిరేశారా అన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


* గతేడాది శనివారపుపేట కాజ్‌వే వద్ద రోజులు వయసు ఉన్న చిన్నారిని నీటిలో పడేశారు. కాలువలో మృతదేహం కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.


* జంగారెడ్డిగూడెం పట్టణం కొత్తబస్టాండ్‌ ఎదురు రోడ్డులోని ఓ శిథిల భవనంలోని వంట గది సింక్‌లో గుర్తుపట్టేందుకు వీల్లేని స్థితిలో నవజాత శిశువు మృతదేహాన్ని గుర్తించారు. ఆడ శిశువేనని అంతా భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

‘ఊయల’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉన్నతాధికారులు (పాత చిత్రం)

వమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన చిన్నారులకు ప్రేమను పంచే బదులు మృత్యుఒడిలోకి విసిరేస్తున్నారు కొంతమంది కర్కశులు. మరికొంత మంది ముళ్లకంచెలు, చెత్తకుప్పలు, నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. కన్నబంధాన్ని ఎంతో సునాయసంగా తెంచేసుకుంటున్నారు. కళ్లు  తెరవకుండానే ఆ పసిప్రాణాలు శాశ్వత నిద్రలోకి జారిపోతున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ తరహా విషాద ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆడపిల్లకు ఎంతో భద్రత కల్పించాలని, భ్రూణ హత్యలు నిరోధించాలని ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్నా ఫలితం లేకపోవడం ఆధునిక సమాజానికి అవమానకరమే. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నెరవేరని లక్ష్యం..

పెంచలేని పరిస్థితులు, అనుకోని సంఘటనలు తదితర కారణాలతో పిల్లలను కనిపెంచలేనివారు పిల్లలను ఎక్కడిపడితే అక్కడ వదిలేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగాయో గుర్తించి అక్కడ ఊయలల ఏర్పాటుకు గత ప్రభుత్వం హయాంలో ఐసీడీఎస్‌ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇలా చేయడం వల్ల కొంతమంది చిన్నారులనైనా కాపాడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అప్పట్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్‌ వద్ద, తడికలపూడి ప్రాంగణం, కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ హాలు, కొత్త రైల్వేస్టేషన్‌, పాతబస్టాండ్‌, ఐసీడీఎస్‌ కార్యాలయం, పెదపాడు ఐసీడీఎస్‌ కార్యాలయాలు, కండ్రీగూడెం  తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కొరవడి కాలక్రమంలో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వైకాపా హయాంలో గతేడాది ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ‘అభాగ్యులకు అమ్మ ఒడి’ పేరుతో మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీనిపై అధికారులు దృష్టిసారిస్తే కనీసం కొన్ని పసిప్రాణాలనైనా కాపాడవచ్చని ప్రజలు కోరుతున్నారు.


వివరాలు గోప్యంగా ఉంచుతాం..

-   సూర్యచక్రవేణి, జిల్లా బాలల సంరక్షణాధికారి

పిల్లలను పెంచుకోలేని స్థితిలో ఉండి ప్రసవించిన తర్వాత వారి ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా తమకు సమాచారం ఇస్తే సంరక్షిస్తాం. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అనధికారికంగా పిల్లలను దత్తత తెచ్చినా, ఇచ్చినా గరిష్ఠంగా మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది.


శిశుగృహంలో అప్పగించొచ్చు..

- పద్మావతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారక అధికారి

నవజాత శిశువుల ప్రాణాలు తీసే అధికారం ఎవరికీ లేదు. పిల్లలను వద్దుకునే వారు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఊయలలో లేదా శిశుగృహంలో అప్పగించాలి. ఆయా చిన్నారులను చట్ట ప్రకారం దత్తత ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని