logo

మా కుమార్తెను చంపేశారు.. న్యాయం చేయండి

తమ కుమార్తెను భర్త, అత్తింటి వారు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని..  మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గురువారం  ఆందోళన చేపట్టారు.

Published : 24 Mar 2023 04:51 IST

ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: తమ కుమార్తెను భర్త, అత్తింటి వారు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని..  మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గురువారం  ఆందోళన చేపట్టారు. దెందులూరు మండలం సానిగూడెంలో 22న జంగం భువనేశ్వరి (24) ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తీసుకొచ్చారు. గురువారం మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అలుగులగూడేనికి చెందిన భువనేశ్వరి తల్లిదండ్రులు నాగరాజు, నీలకుమారి మాట్లాడుతూ రెండేళ్ల కిందట ఫణికుమార్‌ తమ కుమార్తెను ప్రేమ పెళ్లి చేసుకున్నాడని, అది అతని తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నారు. ఫణికుమార్‌, భువనేశ్వరి కొంతకాలంగా అలుగులగూడెంలోని తమ ఇంటి వద్దే ఉంటున్నారని, వారికి 10 నెలల బాబు ఉన్నాడన్నారు. తమ కుమార్తె మళ్లీ గర్భిణి అని తెలిపారు. ఈ క్రమంలో ఉగాది సందర్భంగా అల్లుడు భువనేశ్వరిని  సొంతింటికి తీసుకెళ్లాడని, ఆ సాయంత్రమే ‘మీ కుమార్తె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింద’ని చెప్పారన్నారు. అక్కడ ఏదో జరిగిందని.. భర్త, అత్తింటి వాళ్లు కలిసి చంపేసి ఉరేసుకుందని చెబుతున్నారని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులను కోరారు.


పిడుగు పడిందనే ఆందోళనతో వృద్ధురాలి మృతి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఉరుముల శబ్ధాలకు పిడుగుపడిందని కంగారుపడిన ఓ వృద్ధురాలి గుండె ఆగి మృతిచెందిన ఘటన ఇది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడాలికి చెందిన చలపాటి సుబ్బరావమ్మ (60) పలువురు కూలీలతో కలిసి పెదపాలపర్రులోని మినప తీతలకు వెళ్లింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ఇంటికెళ్లేందుకు వారు పొలం నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు రావడంతో పిడుగు పడిందని కంగారుపడిన సుబ్బరావమ్మ పరుగుపెడుతూ గుండెపోటుతో కుప్పకూలింది. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు.

ఉప్పుటేరులో జారిపడి మత్స్యకారుడి.. కలిదిండి, న్యూస్‌టుడే: ఉప్పుటేరులో వలకట్లు కడుతూ ప్రమాదవశాత్తూ జారిపడి మత్స్యకారుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం పంచాయతీ కొల్లేటికోట గ్రామానికి చెందిన ఘంటసాల సన్యాసిరావు (64) ఉప్పుటేరులో వలకట్లు కట్టి తద్వారా లభ్యమైన చేపలు, పీతలను కాళ్ల మండలం పాతాళమెరక పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వలకట్లు కడుతుండగా ప్రమాదవశాత్తు జారి ఉప్పుటేరులో గల్లంతయ్యారు. బంధు, మిత్రులు గాలింపు చర్యలు చేపట్టగా.. అతని మృతదేహం కలిదిండి మండలం కొండంగి పరిసరాల్లో లభించింది. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, ఇప్పటివరకు మృతుని కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్సై కుమార్‌ తెలిపారు.


భార్యాపిల్లలు కనిపించడంలేదని మనస్తాపంతో ఆత్మహత్య

పాలకోడేరు, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన జి.జగదీశ్‌(27)కు పాలకోడేరు మండలం పెన్నాడకు చెందిన మానసతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీశ్‌ ఉపాధి నిమిత్తం 13 నెలల క్రితం దుబాయ్‌ వెళ్ళాడు. అప్పటి నుంచి భార్య, పిల్లలు పెన్నాడలోని ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈనెల 21న మానస కుటుంబ సభ్యులు తల్లీ పిల్లలు కనిపించడం లేదంటూ పాలకోడేరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం బంధువుల ద్వారా దుబాయ్‌లో ఉన్న జగదీశ్‌కు తెలియడంతో వెంటనే వీడియో కాల్‌ ద్వారా పెన్నాడలోని బంధువులకు ఫోన్‌ చేశాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం తల్లీ పిల్లల ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని