logo

నేర వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతికి ప్రేమ పాఠాలు వల్లించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించిన కానిస్టేబుల్‌పై ఆచంట పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదైంది.

Published : 01 Apr 2023 05:55 IST

యువతిని మోసగించిన కానిస్టేబుల్‌

అత్యాచారం కేసు నమోదు

ఆచంట, న్యూస్‌టుడే: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతికి ప్రేమ పాఠాలు వల్లించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించిన కానిస్టేబుల్‌పై ఆచంట పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదైంది. హెడ్‌కానిస్టేబుల్‌ గంగరాజు కథనం ప్రకారం... బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్‌కు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని లంక గ్రామానికి చెందిన ఒక యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో తారసపడింది. ఛాటింగ్‌తో మొదలైన పరిచయం కాస్త ప్రేమ వరకు నడిచింది. అప్పటికే కానిస్టేబుల్‌కు వివాహం కాగా ఆ విషయాన్ని యువతి వద్ద దాచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యాడు. ఈ వ్యవహారం కానిస్టేబుల్‌ భార్యకు తెలియడంతో ఇద్దరిపై అమలాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. యువతి, కానిస్టేబుల్‌ శారీరకంగా కలిసిన వీడియోలు, ఫొటోలను కూడా అతని భార్య సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి గురువారం రాత్రి ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్‌ అభిషేక్‌పై అత్యాచారం, మోసం కేసు నమోదు చేయడంతోపాటు అతని భార్య రమ్యపై కూడా ఐటీ యాక్టు ప్రకారం జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి జిల్లా ఎస్పీ యు.రవిప్రకాశ్‌ ఆదేశాల మేరకు అమలాపురం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు హెచ్‌సీ గంగరాజు తెలిపారు.


ఇంటికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు!

పంట కాలువలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థి

ఉండి, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పరీక్షలు ముగియడంతో రైలులో ఇంటికి బయలు దేరిన బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. ఉండి ప్రధాన పంట కాలువలో కలిసిపూడి వద్ద గురువారం లభ్యమైన మృతదేహం ఆ విద్యార్థిదేనని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. భీమవరం పట్టణ పరిధి మెంటేవారితోట ప్రాంతానికి చెందిన ముమ్మన అభిరామ్‌ (16) విజయవాడ గూడవల్లి కూడలిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. మార్చి 28న పరీక్షలు ముగియడంతో అదే రోజు సాయంత్రం స్నేహితులతో కలిసి విజయవాడలో రైలెక్కినట్లు అభిరామ్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి చెప్పాడు. రాత్రయినా అతడు ఇంటికి చేరలేదు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఉండి పంట కాలువలో కలిసిపూడి శివారులో గురువారం లభ్యమైన మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అది అభిరామ్‌దేనని గుర్తించారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచిన మృతదేహానికి వైద్యులు శుక్రవారం పోస్టుమార్టం చేశారు. అభిరామ్‌ మృతిపై అతడి స్నేహితులు పొంతన లేని సమాధానలిస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని తండ్రి విజయకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదుచేసి ఎస్సై కె.గంగాధరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
సందేహాలెన్నో.. రైలులో ఉండగా ముఖం కడుక్కొనేందుకు సింక్‌ దగ్గరకు వెళ్లిన అభిరామ్‌ ఆకివీడు రహదారిలో ఉన్న రైల్వే గేటు సమీపాన పంట కాలువలో పడిపోయినట్లు భావిస్తున్నారు. అతడ్ని రైల్లోంచి ఎవరైనా నెట్టేశారా..? లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క విజయవాడలో బయలుదేరే ముందు అభిరామ్‌తో కొందరు ఘర్షణ పడినట్లు సహచర విద్యార్థులు చెప్పడంతో విచారణ కోసం ఇక్కడి నుంచి పోలీసుల బృందం వెళ్లినట్లు సమాచారం.


రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

భీమడోలు, న్యూస్‌టుడే: భీమడోలు రైల్వే స్టేషన్‌ సమీపంలో సుమారు 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ ఆదినారాయణ తెలిపారు. మృతుడు తెల్లని చొక్కా, ఆకుపచ్చరంగు లుంగీ ధరించి ఉన్నాడు. అతని చొక్కా జేబులో గణపవరం, చేబ్రోలుకు చెందిన బస్సు టిక్కెట్లు ఉన్నాయి. మృతుడు గణపవరం, నిడమర్రు ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మృత దేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదినారాయణ పేర్కొన్నారు.


వివాహిత హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వివాహితను హతమార్చి నగలు కాజేసిన ఇద్దరు నిందితులకు ఏలూరులోని 8వ అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎం.సునీల్‌కుమార్‌ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. వివరాల్లోకెళితే.. ఏలూరు తూర్పువీధికి చెందిన గొల్లా లీలావతికి విజయవాడలో జాతకాలు చెప్పే ఐన శ్రీనివాసరావు పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో వాస్తు చూసేందుకు ఆమె ఇంటికి వచ్చిన అతడు గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎలాగైనా దొంగిలించాలని ఆలోచన చేశాడు. చింతలపూడి మండలం ఎర్రంపల్లికి చెందిన జగ్గవరపు హరికృష్ణరెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం రెడ్డి గణపవరానికి చెందిన ఏరువ రామకోటిరెడ్డిని కలిసి విషయం చెప్పాడు. ఆ తర్వాత అతడు ఓ పనిమీద కరీంనగర్‌ వెళ్లాడు. ఈ క్రమంలో 2012 ఆగస్టు 27న హరికృష్ణరెడ్డి, రామకోటిరెడ్డి ఏలూరు వచ్చి ఒంటరిగా ఉన్న లీలావతిని చంపి నగలు, డబ్బు దోచుకుపోయారు. ఈ సంఘటనపై అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి నేరం రుజువుకాడంతో నిందితులకు జీవిత ఖైదుతోపాటు రూ. 10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున వాణీబాయ్‌ వాదనలు వినిపించారు. ఇందుకు సహకరించిన ఏలూరు ఇన్‌ఛార్జి డీఎస్పీ పైడేశ్వరరావు, వన్‌టౌన్‌ సీఐ ఆదిప్రసాద్‌, ఎస్సైలు రామకృష్ణ, మదీనా బాషా, కోర్టు కానిస్టేబుళ్లు మల్లికార్జునరావు, సంగమయ్యలను ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ అభినందించారు.


ఉద్యోగాల పేరిట బురిడీ

మండపేట, న్యూస్‌టుడే: ఉద్యోగాల పేరుతో ముగ్గురు వ్యక్తులు మోసానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తాడేపల్లిగూడేనికి చెందిన వ్యక్తితోపాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన భార్యాభర్తలు రైల్వేలో ఉగ్యోగాలు ఇప్పిస్తామని కొందరు నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన యువతి సుమారు రూ.7 లక్షలు చెల్లించారు. కొందరిని నకిలీ ఐడీ కార్డులతో దిల్లీకి తీసుకెళ్లడంతో మోసపోయినట్లు తెలిసి తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో కొంత మొత్తం బాధితులకు చెల్లించినట్లు తెలుస్తోంది. మండపేటకు చెందిన యువతి ఈ విషయంలో స్థానికంగా ముగ్గురు మధ్యవర్తులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు నగదు ఇవ్వకపోవడంతో ఆమె పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఎస్సై ఎం.అశోక్‌ను వివరణ కోరగా, బాధిత యువతి నుంచి రెండు రోజుల క్రితం ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఆమె చెప్పిన వ్యక్తులకు ఫోను చేసి మాట్లాడేందుకు రావాలని సమాచారం ఇచ్చామన్నారు. బాధితురాలు మళ్లీ తమను సంప్రదించలేదన్నారు. మరిన్ని వివరాలు సేకరించి ఆధారాలు ధ్రువీకరించిన తరువాత కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని