logo

డబ్బులిస్తేనే మస్తరు!

గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పట్టెడన్నం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది.

Updated : 07 Jun 2023 05:20 IST

ఉపాధి హామీ పథకంలో అవినీతి
కూలీల నుంచి సొమ్ము వసూలు
ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పట్టెడన్నం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. కంచే చేను మేసిన చందంగా ఏలూరు జిల్లాలో నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) మండల స్థాయి  అధికారులు, క్షేత్ర, సాంకేతిక సహాయకులు కొందరు కూలీల నుంచి సొమ్ము వసూలుచేస్తూ పథకాన్ని నీరుగారుస్తున్నారు. 

పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో క్షేత్ర సహాయకులకు బదులుగా గ్రామ వాలంటీర్లు మస్తరు వేస్తున్నారనే అభియోగం ఉంది.

బుట్టాయగూడెం మండలంలో ఏపీవో కనుసన్నల్లో అవినీతికి పాల్పడిన ఘటనలు బయట పడినా జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు.

మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో క్షేత్ర సహాయకుల అవినీతి చర్యలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. వీరికి స్థానిక నాయకుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.

చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లో కూలీల నుంచి ఏపీవోలు మస్తర్‌ షీటు, పని పుస్తకం ముద్రణ, రవాణా ఖర్చుల కోసం క్షేత్ర సహాయకుల ద్వారా రూ.100 నుంచి రూ.150 వరకు కూలీల నుంచి వసూలు చేశారు.

కూలీలు డబ్బులిస్తేనే మస్తరు వేస్తామంటూ కొంతమంది అధికారులు (ఏపీవోలు) అవినీతికి  పాల్పడుతున్నారు. జిల్లాలోని పెదవేగి, దెందులూరు, లింగపాలెం, ద్వారకాతిరుమల తదితర మండలాల్లో   అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ అధికారుల కనుసన్నల్లో కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులందాయి. ఆ మేరకు డ్వామా ఏపీడీలతో కొన్ని గ్రామాల్లో విచారణ చేయించారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో కూలీల నుంచి ఏపీవోలు సొమ్ము వసూలు చేస్తున్నట్లు తేలింది. వీరిపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరికొన్ని ఘటనలు ఇలా..

జిల్లాలో ఉపాధి పనులు చేసే కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం నెలకొంటోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కూలీలకు మరోచోట పని కావాలంటే ఏపీవోలు, క్షేత్ర, సాంకేతిక సహాయకులకు ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న కూలీల విషయంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మూలిగే నక్కపై తాటిపండు అన్నచందంగా తయారైంది. పనులు యంత్రాలతో నిర్వహించి వాటిని పథకంలో నమోదు చేస్తున్న వైనంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్‌ చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న మండల స్థాయి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

మధ్యవర్తులుగా క్షేత్ర సహాయకులు

ఉపాధి పనులు జరిగే గ్రామాల్లో కూలీలకు, ఏపీవోలకు మధ్యవర్తులుగా క్షేత్ర సహాయకులు వ్యవహరిస్తున్నారు. అనేక గ్రామాల్లో వీరి వ్యవహారశైలి కూలీలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మస్తరు షీటు, పని పుస్తకాల ముద్రణకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా కూలీల నుంచి ఏపీవోలు, క్షేత్ర సహాయకులు సొమ్ము వసూలు చేస్తున్నారు.

యంత్రాలతో పనులు

ఉపాధి హామీ పనులను కూలీలతో మాత్రమే చేయించాలనేది నిబంధన. దీన్ని విస్మరించి కొన్ని గ్రామాల్లో యంత్రాలతో పనులు చేయిస్తూ వాటిని ఉపాధి పథకం కింద నమోదు చేస్తున్నారు. పెదవేగి, నూజివీడు, దెందులూరు, ముసునూరు, బుట్టాయగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో పొక్లెయిన్లతో మట్టి తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇదంతా స్థానిక రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది.

విచారణ చేయిస్తాం

జిల్లాలో ఉపాధి పనుల్లో కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై తగిన విచారణ చేయిస్తామని డ్వామా పీడీ ఎ.రాము తెలిపారు. తాను కూడా కొన్ని గ్రామాలకు స్వయంగా వెళ్లి విచారణ నిర్వహిస్తానన్నారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, చింతలపూడి, టి.నరసాపురం మండలాల్లో ఏపీడీలతో విచారణ చేయిస్తామన్నారు. అవినీతి ఎక్కువగా జరుగుతోందని ఫిర్యాదులు అందిన మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తామని తెలిపారు. కూలీల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న వారిపై, యంత్రాలతో పనులు చేయించి వాటిని ఉపాధి పనులుగా నమోదు చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని