logo

కొలువులంటూ.. కొల్లగొట్టి!

కొలువుల కోసం కొండంత ఆశతో నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని దళారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. మాయమాటలతో నమ్మించి రూ.లక్షలు కాజేసి జారుకుంటున్నారు.

Published : 07 Jun 2023 04:17 IST

దళారుల మాయాజాలం
‘స్పందన’లో తరచూ ఫిర్యాదులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కొలువుల కోసం కొండంత ఆశతో నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని దళారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. మాయమాటలతో నమ్మించి రూ.లక్షలు కాజేసి జారుకుంటున్నారు. ఇలాంటి వారి వలలో చిక్కి మోసపోయిన బాధితులు ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రముఖుల పేరు చెప్పి..

రైల్వేలో గ్యాంగ్‌మెన్లు, టీసీ కొలువులు ఇప్పిస్తానంటూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల వసూళ్ల పర్వానికి తెరతీశాడు. రాజకీయ ప్రముఖులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఒడిశా ప్రాంతంలో ఉద్యోగానికి పరీక్ష రాయక్కర్లేదని, కొంత సొమ్ము చెల్లిస్తే కాల్‌లెటర్లు పంపిస్తానని నమ్మబలికాడు. దీనిని నమ్మిన కొందరు రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించారు. ఈ వ్యవహారంలో మోసపోయిన బాధితులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

మధ్యవర్తులతో..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగులను నమ్మించాడు. పలు పట్టణాల్లో ఏజెంట్లను నియమించుకొని యువత నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేయించాడు. సొమ్ము చెల్లించినా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. ఈ ఒత్తిడి భరించలేక భీమవరానికి చెందిన ఓ ఏజెంటు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఫిర్యాదు చేసేవారు తక్కువే

ఇలా మోసపోతున్నవారిలో 99 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడంలేదు. పెద్దల సమక్షంలో రాజీ చేసుకుంటే ఎంతో కొంత సొమ్ము దక్కుతుందని భావిస్తున్నారు. ఏటా వందల్లో బాధితులు ఉంటుంటే ఉమ్మడి జిల్లాలో 25-30 వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి.

ఉదంతాలి వీ..

మంగళగిరి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌నని ప్రచారం చేసుకున్న ఓ వ్యక్తి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మి నరసాపురానికి చెందిన యువకుడు రూ.8.5 లక్షలు ఇచ్చాడు. ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న నగదు ఇవ్వలేదని బాధితుడు ‘స్పందన’ కార్యక్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ భీమవరం పట్టణానికి చెందిన మహిళ ఇటీవల ఫిర్యాదు చేశారు.

న్యాయస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు తీసుకున్న దళారీ తరువాత సమాధానం చెప్పడం లేదని వీరవాసరానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం జరిగిన ‘స్పందన’లో ఎస్పీ రవిప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు.


అవగాహన కల్పిస్తున్నాం

ఉద్యోగాలు ఇప్పిస్తామనగానే దళారుల పూర్తి వివరాలు కూడా తెలుసుకోకుండానే రూ. లక్షల కొద్దీ నగదు చెల్లిస్తున్నారు. దళారుల మాయమాటలు నమ్మవద్దని అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వారి వలలో చిక్కుకుంటున్నారు. గతంలో నమోదైన కేసులకు సంబంధించి కొందర్ని అరెస్టు చేశాం.

యు.రవిప్రకాశ్‌, ఎస్పీ, పశ్చిమగోదావరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని