logo

ఈఎస్‌ఐ.. పంపించేయ్‌..!

తణుకు పట్టణానికి చెందిన కార్మికుడు రామకృష్ణ ఛాతీ నొప్పితో తణుకు ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి వచ్చారు. ఇక్కడ కనీసం పరీక్షలు చేయకుండానే రాజమహేంద్రవరం ఆసుపత్రికి పంపారు.

Updated : 07 Jun 2023 05:22 IST

తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే

తణుకు ఈఎస్‌ఐ డిస్పెన్సరీ

తణుకు పట్టణానికి చెందిన కార్మికుడు రామకృష్ణ ఛాతీ నొప్పితో తణుకు ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి వచ్చారు. ఇక్కడ కనీసం పరీక్షలు చేయకుండానే రాజమహేంద్రవరం ఆసుపత్రికి పంపారు.

తణుకులోని ఓ పరిశ్రమలో పని చేస్తూ కార్మికుడు ఇటీవల గాయపడ్డారు. స్థానిక ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో మెరుగైన వైద్యం అందడం లేదని  రాజమహేంద్రవరం తీసుకెళ్లారు. ఇక్కడికొచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో అభివృద్ధి చెందుతున్న తణుకు పట్టణంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి లేక కార్మికులు వైద్యం కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో కాలం నుంచి కేవలం డిస్పెన్సరీకే పరిమితమైంది. ఈ కార్యాలయం పరిధిలో 15 స్పిన్పింగ్‌ పరిశ్రమలు, ఆంధ్రా సుగర్స్‌తో పాటు అట్టలు, పేపర్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో సుమారు 15 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సుమారు ఎనిమిది వేల మందికి ఈఎస్‌ఐ కార్డులు ఉన్నాయి. ఆసుపత్రి లేకపోవడంతో మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారు. డిస్పెన్సరీ మాత్రమే ఉండటంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

అరకొర  సౌకర్యాలతో..

తణుకు డిస్పెన్సరీలో కనీస సదుపాయాలు కరవయ్యాయి. ఇరుకు గదులు, వసతుల లేమి మధ్య వీటిని నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనంలో నడుపుతూ నెలకు రూ.19,845 అద్దె చెల్లిస్తున్నారు. రోజూ ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవలందిస్తున్నారు.
ఇద్దరు వైద్యులతో పాటు 13 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక వైద్యుడు వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. తొమ్మిది మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇక్కడ కొన్ని రకాల రక్త పరీక్షలను వారానికి మూడు రోజులు చేస్తున్నారు. మధుమేహం, మలేరియా, టైఫాయిడ్‌ కిట్లు అందుబాటులో లేవు. దీంతో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో రక్త పరీక్షలు చేయించుకోవల్సిన పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. గర్భిణులు, క్యాన్సర్‌ రోగులకు ఇక్కడ వైద్యం చేసేందుకు సదుపాయాలు లేక రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆసుపత్రికి పంపిస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో..

ప్రతిపాదనలకే  పరిమితం

తణుకు ఈఎస్‌ఐ పరిధిలో కార్మికులకు మెరుగైన వైద్యం కోసం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తెదేపా హయాంలో ప్రతిపాదనలు పెట్టారు. ఆసుపత్రి నిర్మాణానికి వేల్పూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో స్థలం కూడా కేటాయించారు. అప్పటి నుంచి  ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు.
‘ఒప్పంద ప్రాతిపదికన వైద్యుల నియామకానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. అత్యవసర కేసులను రాజమహేంద్రవరం పంపుతున్నాం. ఔషధాల కోసం ఇండెంట్‌ పెట్టాం. వైద్యుల కొరతతో తణుకులో మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటున్నాం.’అని తణుకు డిస్పెన్సరీ సూపరింటెండెంట్‌ చెల్లుబోయిన సత్యం అన్నారు.

అగమ్యగోచరంగా వైద్యం..

తాడేపల్లిగూడెం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కనీస వసతులు లేవు. వైద్యులు సైతం అందుబాటులో ఉండటం లేదు. వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు చేయడం కూడా గగనమవుతోందని కార్మికులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఇరుకు గదుల్లోనే ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోగులు ఆరుబయటే ఉండాల్సిన పరిస్థితి. నియోజకవర్గ పరిధిలో సుమారు రెండు వేలకు పైగా కార్మికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉండటంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అధ్వానంగా నిర్వహణ

తాడేపల్లిగూడెం పట్టణం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందడం లేదు. వైద్యుడితో పాటు ఔషధాలు  అందుబాటులో ఉండటం లేదు. ఎప్పుడు వెళ్లినా ఔషధాలు లేవని, ఇంకా రాలేదని సిబ్బంది చెబుతున్నారు. గత్యంతరం లేక బయట దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఆసుపత్రి నిర్వహణ రోజురోజుకు అధ్వానంగా మారుతోంది.

సీహెచ్‌.రాము, కార్మికుడు


20 పడకల  ఆసుపత్రి అవసరం

తాడేపల్లిగూడెం పట్టణంలో రెండు వేలకు పైగా కార్మికులు ఉన్నారు. అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. ప్రధానంగా గర్భిణులను అంత దూరం తీసుకెళ్లడం కష్టమవుతోంది. అందరికీ అందుబాటులో ఉండేలా పట్టణంలో 20 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి  ఏర్పాటు చేయాలి.

టి.గణ్ణేశ్వరరావు, కార్మికుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని