జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పద్మశ్రీ
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పెదపాడు జడ్పీటీసీ సభ్యురాలు గంటా పద్మశ్రీ ఎన్నికయ్యారు.
వేడుకగా ప్రమాణస్వీకారం
పద్మశ్రీని అభినందిస్తున్న ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, ఆళ్ల నాని, చిత్రంలో అబ్బయ్యచౌదరి, వాసుబాబు, శ్రీధర్, కవురు, కారుమూరి తదితరులు
ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పెదపాడు జడ్పీటీసీ సభ్యురాలు గంటా పద్మశ్రీ ఎన్నికయ్యారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రసన్నవెంకటేశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. జిల్లాలో మొత్తం 47 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఛైర్మన్ ఎన్నికకు కోరం ప్రకారం 24 మంది హాజరు కావాల్సి ఉండగా.. మొత్తం 35 మంది పాల్గొన్నారు. ఛైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ పేరును ద్వారకాతిరుమల జడ్పీటీసీ సభ్యుడు చిగురుపల్లి శామ్యూల్ ప్రతిపాదించగా దెందులూరు జడ్పీటీసీ సభ్యురాలు నిట్టా లీలానవకాంతం బలపరిచారు. మిగిలిన సభ్యులందరూ ఆమోదం తెలపడంతో ఛైర్‌పర్సన్‌గా పద్మశ్రీ ఎన్నికైనట్లుగా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత పెదపాడు మండలంలోని ఇంటి నుంచి పద్మశ్రీ భారీ ఊరేగింపుగా జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్యచౌదరి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, డీసీసీబీ ఛైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ సీఈవో రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీసీలకు పెద్దపీట.. జడ్పీ ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకరణ అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ బీసీల సర్వతోముఖాభివృద్ధికి వైకాపా పెద్ద పీట వేస్తోందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మహిళకు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వడం సీఎం జగన్‌కు వారి పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా అంతటా పర్యటించి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఏలూరు బస్టాండు రోడ్డులో నిలిచిన ట్రాఫిక్
అడుగడుగునా ఆంక్షలే..
జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఆ కార్యాలయ పరిధిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తుతోపాటు ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పత్రిక విలేకరులు, ఫొటోగ్రాఫర్లను సమావేశ హాలు లోపలికి అనుమతించలేదు. జడ్పీ సీఈవో చెబితేనే అనుమతిస్తామని తేల్చి చెప్పడంతో పోలీసులు, విలేకరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఎన్నిక ముగిసిన తర్వాత మాత్రమే అనుమతించారు.
ప్రధాన ద్వారాన్ని మూసివేసిన పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.