logo

ఇదేనా ‘భవిత’వ్యం

ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు.

Published : 29 Mar 2024 04:24 IST

మొక్కుబడిగా కేంద్రాల నిర్వహణ

ఆకివీడు, ఉంగుటూరు, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు ఇంటి వద్దే విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు. భవిత కేంద్రాలకు, పాఠశాలలకు ఆ పిల్లలను తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం రవాణా, సహాయక(ఎస్కార్‌్)్ట, బాలికల స్టైపండ్‌, గృహ ఆధారిత ఛార్జీల రూపంలో నెలనెలా భత్యం చెల్లిస్తోంది. ఇవి సక్రమంగా రాకపోవడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. పలుచోట్ల భవిత కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొని చోట్ల ఇరుకు గదుల్లో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

మండలానికి ఒకటి చొప్పున.. మండలానికి ఒకటి చొప్పున భవిత కేంద్రాలున్నాయి. ప్రత్యేక అవసరాలున్న 370 మంది బాలలు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టు చొప్పున సేవలందిస్తున్నారు. దీనిపై ఏలూరు జిల్లా విలీనవిద్య సహాయ సమన్వయకర్త రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇచ్చే భత్యాలు సరాసరి వారి తల్లుల ఖాతాలో జమ అవుతాయన్నారు.

ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఉన్న భవిత కేంద్రానికి సొంత భవనం లేక ఇరుకు గదిలో సాగుతోంది. స్థానిక సంతమార్కెట్‌ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒక తరగతి గదిలో నిర్వహిస్తున్నారు. ఈ గది శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిస్తే శ్లాబ్‌ కారుతోంది. పల్లంగా ఉండటంతో గదిలోకి వర్షపు నీరు చేరుతోంది. పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేవు. ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఇరుకు గదిలోనే పాఠాలు నేర్పిస్తున్నారు. వారానికి ఒక రోజు ఫిజియోథెరపీ వైద్యురాలు అదే గదిలో వ్యాయామ చికిత్స చేయిస్తున్నారు. భోజనాలూ అదే గదిలోనే. ప్రస్తుతం ఈ కేంద్రానికి 19 మంది బాలలు వస్తున్నారు.

బుట్టాయగూడెంలోని భవితకేంద్రం నిర్వహణ నామమాత్రంగా మారింది. ప్రత్యేక అవసరాలు కలిగిన 12 మంది బాలికలు, అయిదుగురు బాలురు ఉన్నారు. స్వగ్రామాల నుంచి వచ్చే వీరికి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఏడాదిగా రవాణా భత్యం అందడం లేదు. దీంతో కేంద్రానికి తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. రామాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ఒక భవనంలో  కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇద్దరు బోధకులు పనిచేస్తున్నారు.

ఉంగుటూరు భవిత కేంద్రంలో 20 మంది ప్రత్యేక అవసరాల పిల్లల ఉన్నారు. ఈ ఏడాది వీరికి రవాణా ఛార్జీలు విడుదల కాలేదు. ఈ నెలాఖరున విడుదల అవుతాయని విలీన ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని