logo

వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు

వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ ఆరోపించారు. మంగళవారం   కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌ నామినేషన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 24 Apr 2024 03:58 IST

కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్‌

ర్యాలీలో మురుగన్‌, కామినేని, కమ్మిలి తదితరులు

మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ ఆరోపించారు. మంగళవారం   కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌ నామినేషన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పులపాలు చేసిన ఘనత వైకాపాకు దక్కుతుందన్నారు. కేంద్రం అన్ని విధాలా సాయమందిస్తున్నా.. రాజధాని, పోలవరాన్ని నిర్మించుకోలేకపోయారన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల సమన్వయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కామినేని శ్రీనివాస్‌ తన దృష్టికి తీసుకు వచ్చారని, సమస్యలు పరిష్కరించి ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం పరిధిలో ఉన్న కొల్లేరు సమస్యను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కామినేని మాట్లాడుతూ.. మట్టి నుంచి మద్యం వరకు అన్నింట్లో అవినీతికి పాల్పడుతూ వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. కైకలూరులో రౌడీలతో ఎమ్మెల్యే కుమారుడు, పోలీసులతో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలోని 3 మండలాల జడ్పీటీసీ సభ్యులు వైకాపాను వీడి కూటమిలోకి వచ్చారంటే పరిస్థితి అర్థమవుతోందన్నారు. కైకలూరు ఆయా గ్రామాల్లో రైల్వే అండర్‌ టన్నెల్స్‌, ప్రతి ఇంటికీ జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా నీటిని అందించడం, కొల్లేరు కాంటూరు కుదింపు, ఆక్వా రంగాన్ని ఇబ్బందుల నుంచి తప్పించడమే తన ముందున్న లక్ష్యాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, సీఎల్‌ వెంకట్రావ్‌, పెన్మత్స వెంకటేశ్వరరాజు, కొడాలి వినోద్‌, బలే ఏసురాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని