logo

ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి

అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు.

Published : 24 Apr 2024 04:14 IST

జిల్లాలో  3 వేల మంది వాలంటీర్లు రాజీనామా
ఇన్నాళ్ల  కష్టం నేతలపాలైందని ఆవేదన

పాలకొల్లు, న్యూస్‌టుడే: అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. కొత్త ప్రభుత్వం వస్తే జీతం రూ.10 వేలకు పెరుగుతుందని ఉద్యోగ భద్రత వస్తుందని ఆశ పడ్డాం. ఒకరిని చూసి ఒకరుగా రాజీనామా చేయకతప్పలేదు.

ఇదీ యలమంచిలి మండల కేంద్రంలో రాజీనామా అనంతరం ఒక వాలంటీరు ఆవేదన.

2019 ఆగస్టు 15న ప్రారంభించిన గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 20 వేల మందిని రూ.5 వేల గౌరవవేతనం ఇచ్చేలా వైకాపా ప్రభుత్వం  తీసుకుంది. ప్రస్తుతానికి తమ అవసరం తీరిందంటూ ఎన్నికల ముందు రాజీనామాలు చేయాలంటూ అధికార పార్టీ నాయకులు వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉద్యోగాల నుంచి దూరం చేస్తున్నారు. విద్యార్హతను బట్టి ప్రభుత్వ అధికారులు నిర్వహించిన ముఖాముఖిలో అర్హత సాధించిన తమను రాజీనామా చేయమనడానికి మీరెవరని కొందరు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ఎదురు తిరుగుతున్నారు కూడా. ఇవేమి పట్టని నాయకులు మాత్రం వెంబడించి వెంటాడి రాజీనామాలు చేయిస్తున్నారు. రాజీనామా చేసిన ఏ ఒక్కరి మొహంలోనూ స్వచ్ఛందంగా చేశామన్న భావన ఎక్కడా కనిపించడం లేదు.

జీతాలిస్తారట..

రాజీనామా చేస్తే నెలకొచ్చే రూ.5 వేలు పోతుందని వాపోతున్న వాలంటీర్లకు అవసరమైతే ప్రభుత్వం వచ్చే వరకు జీతాలు మేమే ఇస్తామంటూ కొన్ని నియోజకవర్గాల నేతలు వాగ్దానాలు చేసి వారిని కూడా మోసం చేసే దుస్థితికి చేరారు. ఈ నెల 25న ఆయా మండలాల నుంచి జీతాల బిల్లులు పెడితే వచ్చే నెల 1న రూ.5 వేల జీతాలు అందేవి. కాని 22వ తేదీ వచ్చాక వారం రోజుల్లో వచ్చే జీతాలు చెడగొట్టి మరీ కొన్నిచోట్ల రాజీనామాలు చేయించడం చాలామందికి మింగుడు పడటం లేదు. రాజీనామా చేసిన వెంటనే గ్రామ సచివాలయాల లాగిన్‌ల నుంచి అధికారులు వాలంటీర్లను తొలగించడంతో జీతం అందే పరిస్థితి కనిపించడం లేదు.

ఆచంటలో అత్యధికం

ఆచంట నియోజకవర్గంలో మొత్తం 749 మంది మంగళవారం నాటికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 531, భీమవరంలో 397 మంది రాజీనామాలు చేయగా ఇవి వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కూటమి ప్రభుత్వం వస్తే ఖాళీ అయిన పోస్టులు తమకు ఇప్పించాలంటూ ఆయా ప్రాంతాల్లోని స్థానికులు కొందరు వాలంటీరు పోస్టులపై ఇప్పట్నుంచే కర్చీఫ్‌లు వేసుకోవడం కొసమెరుపు.

రూ.1.50 కోట్ల నష్టం

ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకుంటే మొత్తం 9,100 మంది వాలంటీర్లున్నారు. వీరిలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ఈ నెల 22 వరకు 3 వేల మంది రాజీనామాలు చేశారు. అంటే వీరంతా జీతం రూపేణ రూ.1.50 కోట్లు నష్టపోయినట్టే. మళ్లీ మన ప్రభుత్వం వస్తే మీ ఉద్యోగాలు మీకే అంటున్న నేతలు వయోపరిమితి దాటి పోయినవారికి ఇప్పించగలరా అనేదానికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే వాలంటీర్‌ పోస్టుకు నిర్దేశించిన వయసు గరిష్ఠంగా 35. రాజీనామా చేసినవారిలో 35ఏళ్లు దాటిపోతున్నవారు అనేక మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని