logo

ఊడుతున్న ఫ్యాను రెక్కలు

అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక  రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

Published : 24 Apr 2024 04:16 IST

అధికార పార్టీకి కీలక నాయకుల రాజీనామాల సెగ

అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక  రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఈనాడు, భీమవరం: నా..ఎస్సీలు.. నా ఎస్టీలు.. నా బీసీలు నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడం తప్ప జగన్‌ వారికి చేసిందేమి లేదన్న విషయం..ఆయా వర్గాల నాయకుల్లో కనిపిస్తున్న అసంతృప్తితో స్పష్టమవుతోంది. ఇటీవల కైకలూరు జడ్పీటీసీ సభ్యురాలు కురెళ్ల బేబి రాజీనామా నేపథ్యంలో మాట్లాడుతూ..‘దళిత మహిళగా నేను జడ్పీటీసీ సభ్యురాలిని కావడంతో నా ప్రాంతానికి..వెనకబడిన నా సామాజిక వర్గానికి మంచి చేయొచ్చు అనుకున్నా. వైకాపాలో దళితులకు ప్రాధాన్యం లేదు. కొల్లేరు ప్రాంతానికి సీఎం చేసిందేమీ లేదు. అందుకే మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కైకలూరు సర్పంచి నవరత్నకుమారి మాట్లాడుతూ..‘దళితులంటే ఎమ్మెల్యే వివక్షతో చూస్తున్నారు.. పేరుకే సర్పంచిని. గత అయిదేళ్లలో నా గ్రామానికి ఏం చేయలేక పోయా. తెదేపా పాలనలో సర్పంచులకు గౌరవం..గ్రామానికి అభివృద్ధి ఉండేది. అందుకే  తెదేపాలో చేరుతున్నాం’ అని అన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైకాపా నుంచి చాలా మంది నాయకులు కూటమిలో చేరడంతో అధికార పార్టీకి కంటిమీద కునుకుండటం లేదు. వైకాపాలో కీలకంగా పని చేసిన నేతలందరూ తెదేపా వైపు అడుగులు వేస్తుండటంతో అధికారపార్టీ అభ్యర్థులకు ఏం చేయాలో అంతుచిక్కడం లేదు. ఏలూరు మాజీ మంత్రి మరడాని రంగారావు, వైకాపా పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకుడు ఎంఆర్డీ బలరామ్‌, ఈశ్వరి దంపతులు పార్టీని వీడి తెదేపాలో చేరండంతో వైకాపా అయువు పట్టుమీద దెబ్బపడింది. ఏలూరు కార్పొరేషన్‌లో ముగ్గురు కార్పొరేటర్లు, 15 మంది మాజీ కార్పొరేటర్లు అధికార పార్టీని వీడారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వలేదని, జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని బాహాటంగానే చెబుతున్నారు. మరోసారి వైకాపాకు అధికారం ఇస్తే మన వేలితో మన కళ్లు పొడుచుకున్నట్టే అనే భావన నాయకుల్లో బలంగా ఉంది. గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటు పడటం, స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా చేయటంతో పార్టీ మారుతున్నామని చెబుతున్నారు.

కూటమి వైపే అడుగులు.. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ప్రముఖ నాయకులు బహిరంగంగా కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. తణుకు ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సునంద, తూర్పుకాపు సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీతారామ్‌ కూటమికి సహకరిస్తానంటూ హామీ ఇచ్చారు. తణుకులో వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. తాడేపల్లిగూడెం మాజీ కౌన్సిలర్‌, ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు తదితరులు వైకాపా నుంచి బయటికి రావటంతో నాయకుల గుండెల్లో రాయిపడినట్లయింది. భీమవరం పురపాలక మాజీ ఫ్లోర్‌ లీడర్‌ గాదిరాజు తాతరాజు జనసేనలో చేరారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తమ్ముడు కుమారులైన కామవరపుకోట మండలానికి చెందిన కోటగిరి కిశోర్‌, వేణు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. ఏలూరు ఎంపీ శ్రీధర్‌ చింతలపూడి వైకాపా అభ్యర్థి విజయరాజు కోసం ప్రచారం చేస్తుంటే ఆయన బాబాయ్‌ కొడుకులే పార్టీ వీడారు. ఓ వైపు కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు వైకాపాను వీడుతుంటే మరో వైపు భారీగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రముఖ నాయకులు కూటమికి మద్దతిస్తున్నారు. ఈ పరిణామాలతో కూటమి మరింత బలమైన శక్తిగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని