కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!

రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్‌ కెనాల్‌(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్‌ సర్కారు.

Published : 06 May 2024 06:22 IST

జగన్‌ సర్కారు నిర్లక్ష్యంతో దెబ్బతిన్న తుంగభద్ర హెచ్చెల్సీ


చిత్రాన్ని చూస్తే చాలు తుంగభద్ర హెచ్చెల్సీ కర్ణాటక పరిధిలో ఎలా ఉంది?.. ఏపీలో ఏ స్థితిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. కాలువకు చక్కటి లైనింగ్‌, గేట్లతో ఉన్నది కర్ణాటక పరిధి కాగా.. లైనింగ్‌ మొత్తం దెబ్బతిని అధ్వాన స్థితిలో కనిపిస్తున్నది మన రాష్ట్ర పరిధిలోనిది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌ మండల కేంద్రం సమీపంలో కనిపిస్తోన్న దృశ్యమిది.


రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్‌ కెనాల్‌(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్‌ సర్కారు. కర్ణాటక పరిధిలోని కాలువను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరణ పనులతో ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోగా.. మన రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా దారుణ స్థితిలో దర్శనమిస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి ఈ హెచ్చెల్సీ ప్రారంభం అవుతుంది. కాలువ మొత్తం పొడవు 189 కి.మీ. కాగా అందులో 105 కిలోమీటర్లు కర్ణాటక పరిధిలో మిగిలిన 84 కి.మీ. ఏపీలో ఉంటుంది.

దీని కింద ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పరిధిలో మొత్తం 2.85 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కాలువకు సంబంధించి 2018 వరకు 67 శాతంపైగా పనులు జరిగాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చాక అస్సలు పట్టించుకోలేదు. ఐదేళ్ల పాలనలో కాలువల అభివృద్ధికి, అధునికీకరణకు ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదు. దీంతో లైనింగ్‌ దెబ్బతిని, కట్టపై భారీగా కంపచెట్లు పెరిగిపోయి, వంతెనలు కూలే స్థితికి చేరి ఇలా కాలువ పరిసరాలన్నీ దయనీయ స్థితికి చేరాయి. మరోవైపు కర్ణాటకలో మూడేళ్లలో ఆధునికీకరణ పనులకు రూ.1000 కోట్లు ఖర్చు చేశారు. అక్కడ పటిష్ఠ లైనింగ్‌ ఉంది. చక్కగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, బొమ్మనహళ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని