పనికెళ్లలేక.. పడుకోలేక..

వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది.

Published : 06 May 2024 06:26 IST

తీవ్రమైన వేడితో జనజీవనం అతలాకుతలం
ఎండలతో ఇళ్లకే పరిమితమవుతున్న కార్మికులు
తగ్గుతున్న ఉత్పాదకత.. పెరుగుతున్న ధరలు
వేడితో రాత్రుళ్లూ నిద్ర కరవు

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. ఫ్యాను వేస్తే భరించలేని వేడి గాలితో.. బంద్‌ చేస్తే ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతుండటంతో కూలర్లతోనూ ప్రయోజనం ఉండటం లేదు. వారం రోజులుగా తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు సామాన్య జనం ఎదుర్కొంటున్న దయనీయ స్థితి ఇది. ముఖ్యంగా పసిపిల్లలు, బాలింతలు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. రాత్రుళ్లు నిద్రలేక.. పగలు పనులకు వెళ్లలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ ప్రభావం వ్యాపారాలు, నిత్యావసర ధరలపై పడుతోంది.

11 దాటితే వ్యాపారాలు బంద్‌

ఎండల ధాటికి జనం బయటకు రావడం లేదు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్‌ నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్నమైందంటే.. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో చిరువ్యాపారులు, ఆటోవాలాలు కనిపించడం లేదు. దీంతో సంపాదన తగ్గి కుటుంబ అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ సైతం మధ్యాహ్నం సర్వీసులను తగ్గించింది.

తల్లడిల్లుతున్న చిన్నారులు.. వృద్ధులు

అర్ధరాత్రుళ్లూ వడగాలి వీస్తుండటంతో పిల్లలు నిద్రపోవడం లేదు. పసిపిల్లలు ఉక్కపోతతో గుక్కపట్టి ఏడుస్తున్నారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. రాత్రిపూట సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సమశీతోష్ణ మండలమైన హైదరాబాద్‌ పరిధిలో 22 డిగ్రీల్లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా, వారం రోజులుగా 28.4 డిగ్రీలపైనే ఉంటోంది.

10.30 గంటల వరకే కూలి పనులు

ప్రస్తుతం పంటలు లేక కూలి పనులే దిక్కైన తరుణంలో ఎండలు తీరని వ్యథ మిగుల్చుతున్నాయని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డాలపైకి వచ్చే కూలీలు కూడా నీడపట్టున ఉన్న పనులకే మొగ్గుచూపుతున్నారని మేస్త్రీలు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ఉదయం 10.30 గంటలకే బంద్‌ అవుతున్నాయి. తీవ్రమైన వేడితో పలుగు, పార, ఇనుప బొచ్చెలు కాలిపోతుండటంతో పనులు చేయలేకపోతున్నారని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు.

ఆకుకూరల ధరలు ఆకాశానికి

ప్రాజెక్టులు ఎండిపోవడం, బోర్లు వట్టిపోవడంతో కూరగాయల సాగు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఎండలకు పండిన అరకొరా ఇట్టే వాడిపోతున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల నుంచి నగరంలోని ఎల్బీనగర్‌, బోయినపల్లి, కొత్తపేట ప్రాంతాలకు కూరగాయలు, ఆకుకూరల రాక తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆకుకూరలు తెచ్చేలోపే వడలిపోతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదంటూ ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన మమత అనే కూరగాయల విక్రయదారు తెలిపారు.  

కూలర్లు గిరగిరా...

వేడి నుంచి ఉపశమనానికి ప్రజలు పెద్దఎత్తున కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఏటా ప్రతి వేసవిలో దాదాపు 120 కూలర్లు విక్రయిస్తుండగా.. ఈ ఏడాది ఇప్పటికే 150 అమ్ముడుపోయాయని, మళ్లీ కర్ణాటకకు ఆర్డర్‌ పెట్టానని రామంతాపూర్‌కు చెందిన కరుణాకర్‌ అనే విక్రయదారుడు తెలిపారు. ఇళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు కూలర్లు నడుస్తూనే ఉంటున్నాయి. దీంతో కరెంటు బిల్లు తడిసి మోపెడవడంతోపాటు నీరు సైతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసినా కూలర్లతో కాసింత ఉపశమనమే ఉంటోందని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని