జనాలకు డొక్కు.. జగన్‌కు హై‘టెక్కు’

రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్‌. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి.

Updated : 06 May 2024 06:56 IST

రూ.20 కోట్ల ఆర్టీసీ సొమ్ముతో జగన్‌కు రెండు కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు
పాతవి ఉన్నా... పక్కకు నెట్టి!
ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలును పట్టించుకోని ప్రభుత్వం
మూడుసార్లు ఛార్జీలు పెంచి ఏటా రూ.2 వేల కోట్ల భారం
నిత్యం ప్రయాణించే 40 లక్షల మందికి తుక్కు బస్సులే

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..
నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు..
అన్నట్టుగా ఉంది సీఎం జగన్‌ తీరు!
స్టీరింగ్‌ ఊడిపోయే.. చక్రం జారిపోయే..
డొక్కు ఆర్టీసీ బస్సుల్లోనే సామాన్యులంతా ప్రయాణిస్తుంటే..
వారి కోసం కొత్త బస్సులు కొనకుండా..
కేవలం తన ఎన్నికల ప్రచారం కోసం అదే ఆర్టీసీతో రూ.20 కోట్లు పెట్టించి కొత్తగా రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సుల్ని ‘సిద్ధం’ చేయించుకున్నారీ హై‘టెక్కు’ సీఎం! ఇప్పటికే ఉన్న రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సుల్ని పక్కనబెట్టడం ఇక్కడ కొసమెరుపు!


  • ఐదేళ్ల తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం జగన్‌ జనంలోకి వచ్చారు. అయితే సీఎం కోసం ఆర్టీసీ వద్ద రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని వినియోగించుకోకుండా.. రూ.20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయించారు. ఆ బస్సులోనే ‘మేమంతా సిద్ధం’ అంటూ యాత్ర చేస్తూ మండు వేసవిలోనూ ఎన్నికల ప్రచారాన్ని చల్లగా సాగిస్తున్నారు.
  •  మరి నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 40 లక్షల మంది ప్రజల భద్రత గురించి జగన్‌ తన  ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కసారైనా పట్టించుకున్నారా? డొక్కు బస్సులతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. గమ్యస్థానానికి భద్రంగా చేరుకుంటామనే భరోసా లేకుండా...   బిక్కుబిక్కుమంటూ రోజూ ప్రయాణిస్తున్నారు.   ప్రజలవద్దకు చుట్టపుచూపుగా వెళ్లే జగన్‌కు హైటెక్‌ బస్సులు కావాలి గానీ.. సామాన్యులు రోజూ ప్రయాణించడానికి కొత్త బస్సులు వద్దా?

 

రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్‌. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. అలాగైతేనే ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు పాటించినట్లు అవుతుంది’ అని సీఎం జగన్‌.. 2019, నవంబరులో ఓ సమీక్షలో పేర్కొన్నారు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. ప్రస్తుతం ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన బస్సులు 4,815 ఉన్నాయి. తన హయాంలో మూడు సార్లు ఛార్జీలు పెంచి, ప్రయాణికులపై ఏటా రూ.2 వేల కోట్లు భారం వేసిన జగన్‌.. కొత్త బస్సులు కొనకుండా ‘మీ చావు మీరు చావండి’ అనేలా జనాల్ని వదిలేశారు.


ప్రాణాలతో చెలగాటం..

ర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే నమ్మకం.. జగన్‌ పాలనలో సన్నగిల్లింది. స్టీరింగ్‌ పట్టేయడం, ఏకంగా స్టీరింగ్‌ ఊడిపోయి డ్రైవర్‌ చేతికి వచ్చేయడం, బ్రేకులు పడకపోవడం, గేర్‌ బాక్స్‌ పట్టేయడం, యాక్సిల్‌తో సహా చక్రాలు ఊడిపోయి బస్సు నుంచి వేరవ్వడం, బస్సంతా డబడబమంటూ శబ్దాలు రావడం.. తదితరాలతో అత్యధిక బస్సులు డొల్లగా మారిపోయాయి. వీటికి మరమ్మతులు చేయలేమని మెకానిక్‌లు గోల పెడుతున్నా... అధికారులు ఒత్తిడిచేసి ఏదో ఒకలా సరిచేయించి వాటినే పంపుతున్నారు. ఇవి నిత్యం ఎక్కడో ఓచోట పంటకాల్వలు, పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడుతున్నాయి. అయినాసీఎం జగన్‌లో ఎటువంటి చలనంలేదు.


15 లక్షల కి.మీ. దాటినా తిప్పాల్సిందే

ర్టీసీకి సొంత బస్సులు 8,369 ఉన్నాయి. ఇందులో 10 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన బస్సులు 5,942 ఉన్నాయి. ఆర్టీసీ నిబంధనల ప్రకారం దూర ప్రాంత సర్వీసుల్లో 10 లక్షల కి.మీ. దాటితే వాటి స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. అలాగే 10 లక్షల కి.మీ. తిరిగిన బస్సులను పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ సర్వీసులుగా మార్పు చేసి 12 లక్షల కి.మీ. వరకు నడపాలి. ఆ తర్వాత వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది. కానీ ఐదేళ్లుగా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు లేకపోవడంతో 15 లక్షల కి.మీ.పైగా తిరిగిన బస్సులను నడుపుతున్నారు.


పల్లె బస్సులు మరీ ఘోరం

గ్రామీణుల కోసం పల్లెవెలుగు, అల్ట్రా  పల్లెవెలుగు సర్వీసులను నడుపుతారు. అయితే ఇవన్నీ ఘోరంగా ఉంటున్నాయి.

  • 15 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన బస్సులు 2,119 ఉంటే.. అందులో 1,809 పల్లెవెలుగు సర్వీసులే!
  • విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తిరుగుతున్న సిటీ సర్వీసుల్లో సైతం 134 బస్సులు 15 లక్షల కి.మీ.పైనే తిరిగాయి.
  • దూర ప్రాంతాలకు తిరిగే సూపర్‌ లగ్జరీ బస్సుల్లో 15 లక్షల కి.మీ. దాటినవి   105 ఉన్నాయి.

ఛార్జీలు పిండేస్తున్నా.. కొత్త బస్సుల్లేవ్‌!

గన్‌ సీఎం అయ్యాక తొలుత 2019 డిసెంబరులో.. డీజిల్‌, విడిభాగాలు, టైర్ల ధరలు పెరిగాయని, ఉద్యోగుల జీతాల రూపంలో భారం పడుతోందని చెప్పి.. ఛార్జీలు పెంచి ప్రయాణికులపై ఏటా రూ.700 కోట్ల చొప్పున భారం వేశారు. తర్వాత 2022 ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచేసి, ఏటా రూ.750 కోట్ల చొప్పున బాదేశారు. మళ్లీ మూడు నెలలకే మరోసారి డీజిల్‌ సెస్‌ అంటూ ఛార్జీలు పెంచి ఏడాదికి రూ.550 కోట్ల మేర భారం వేశారు. మొత్తంగా మూడుసార్లు కలిపి ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున ప్రయాణికుల నుంచి పిండేస్తున్నారు.


ఘాట్‌లో ప్రమాదకర ప్రయాణం

తిరుపతి-తిరుమల ఘాట్‌లో నిత్యం వేల మంది శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. ఈ బస్సులు పూర్తిగా కండిషన్‌లో ఉండాలి. కానీ ఇక్కడా కాలం చెల్లిన బస్సులను నడుపుతూ భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

  • నిబంధనల ప్రకారం 7 లక్షల కి.మీ. తిరిగిన బస్సులను ఘాట్‌ సర్వీసుల నుంచి పక్కనపెట్టాలి. కానీ ప్రస్తుతం నడుపుతున్న వాటిలో మూడింట రెండొంతులు కాలం చెల్లినవే ఉన్నాయి.
  • తిరుపతి జిల్లాలోని వివిధ డిపోల పరిధిలో 320, చిత్తూరు జిల్లాలోని 26, అన్నమయ్య జిల్లాలోని ఒకటి కలిపి మొత్తం 347 ఘాట్‌ సర్వీస్‌ బస్సులు ఉన్నాయి. ఇందులో 7 లక్షల కి.మీ.కుపైగా తిరిగేసిన బస్సులు 237 ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది.

రాబడి తీసేసుకుంటూనే

ర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని.. వారికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోందంటూ జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఆర్టీసీకి నెలకు సగటున రూ.600 కోట్ల వరకు రాబడి వస్తుండగా, అందులో రూ.125 కోట్లను (25%) ప్రభుత్వం తన ఖజానాలో జమ చేయించుకుంటోంది. దీంతో ఆర్టీసీ వద్ద కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధులు ఉండటంలేదు.


పొరుగు ఆర్టీసీల్లో అధునాతన బస్సులు

తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీలూ అధునాతన బస్సులను అందుబాటులోకి తెచ్చి, ప్రజలకు మంచి రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు వాటి ముందు తేలిపోతున్నాయి. కొవిడ్‌ మొదటి దశకు ముందు 300 బస్సులను కొనుగోలు చేశారు. కొత్తగా 1,500 డీజిల్‌, 1,000 విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేయడంతోపాటు 200 పాత డీజిల్‌ బస్సులను విద్యుత్‌ బస్సులుగా మార్చి... వినియోగించనున్నట్లు ప్రభుత్వం ఏడాదిగా చెబుతోంది. 1,500 బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టినా.. వీటిలో 200 మాత్రమే ఇప్పటివరకు వచ్చాయి.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని