logo

పథకాల బాకానే.. ప్రగతి ఊసేది

సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు.

Published : 02 May 2024 04:25 IST

పోలవరం, కొల్లేరు, చింతలపూడి మాటే ఎత్తని సీఎం

ఈనాడు, ఏలూరు: సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు. ఏలూరు జిల్లాలో పర్యటిస్తూ పోలవరం..ఊసే లేకుండా..కొల్లేరు ప్రస్తావనే లేకుండా..చింతలపూడి ఎత్తిపోతల, ట్రిపుల్‌ ఐటీ గురించి మాట్లాడకుండా ప్రసంగం సాగిందంటేనే సభ ఎంత పేలవంగా సాగిందో ఊహించుకోవచ్చు.  జగన్‌ ప్రసంగం మొత్తం బటన్‌ నొక్కుడు గురించి జబ్బలు చరుచుకుంటూనే సాగింది. పోలవరం నిర్వాసితుల గురించి జగన్‌కు గుర్తురాలేదు. వైకాపా అసమర్థతతోఅర్ధంతరంగా నిలిచిన చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి నోరు విప్పలేదు. నిధుల్లేక ఏలూరులో నిలిచిన భూగర్భ డ్రెయినేజీ, పత్తాలేకుండా పోయిన రూర్బన్‌ పనుల గురించి, అధ్వానంగా ఉన్న జిల్లా రహదారుల గురించి మాట్లాడలేదు. పథకాలు రావాలంటే జగనే రావాలన్నట్లు ప్రజలను సున్నితంగా బెదిరించడంతోనే సమయమంతా సరిపోయింది.

 అభ్యర్థులకు నోరెత్తే అవకాశం ఇవ్వలే..

 సాధారణంగా నియోజకవర్గానికి ఏ పార్టీ అధినేతలు వచ్చినా స్థానిక అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులకు ముందుగా మాట్లాడే అవకాశం ఇస్తారు. సీఎం సభ మాత్రం భిన్నంగా సాగింది. ఆద్యంతం పథకాల గురించి ఊకదంపుడు ఉపన్యాసం తప్ప వారికి అవకాశం ఇవ్వలేదు. ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నానిల గురించి మాట్లాడుతూ..వీరు ఎంతో మంచివారని, సౌమ్యులని, ప్రజలకు సేవ చేయాలనే గుణం కలిగిన వారని ఉద్ఘాటించారు.

నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లు

ఓ పక్క ఎన్నికల నియమావళి నిబంధనలు ఉన్నా వైకాపా నాయకులు దాన్ని తుంగలో తొక్కారు. నగరంలో ఎక్కడ చూసినా జగన్‌, ఎమ్మెల్యే ఆళ్ల నానికి సంబంధించిన భారీ హోర్డింగ్‌లు హెలిప్యాడ్‌ సభా ప్రాగణం మధ్యలో ఏర్పాటు చేశారు.

డబ్బులిచ్చి తరలించినా తుర్రుమన్నారు

సభకు జనాన్ని తరలించేందుకు వైకాపా నాయకులు భారీగా డబ్బులు పంపిణీ చేశారు. నగరంలోని 50 డివిజన్లకు రూ.50 లక్షలు కేటాయించారు. ఒక్కొక్క డివిజన్‌ నుంచి 500 మంది వరకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.200, మద్యం సీసా, బిర్యాని పొట్లాం ఇచ్చి ఆటోల్లో తరలించారు.  కొన్ని చోట్ల పథకాల పేరుతో డ్వాక్రా లీడర్లు బెదిరించి బలవంతంగా తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకే వీరిని తీసుకురావటంతో ఎండల్లో ఉక్కిరిబిక్కిరై జగన్‌ రాకముందే చాలా మంది వెళ్లిపోయారు. ఉన్నవారు సైతం ఎండ తీవ్రత తట్టుకోలేక జగన్‌ ప్రసంగిస్తుండగానే వందల సంఖ్యలో తరలివెళ్లిపోయారు. డబ్బులిస్తామని తీసుకొచ్చి..ఎండలో మాడ్చారు. సభ అయ్యాక ఇస్తారో లేదో’ అని కొందరు మహిళలు ఆవేదన చెందుతూ వెనుదిరిగిన దృశ్యాలు కనిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు