logo

ఉప్పు రైతు బతుకు చేదు

 ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి

Updated : 02 May 2024 05:43 IST

సాగుకు దూరమవుతోన్న వైనం

నెరవేరని జగన్‌ హామీలు

తీరంలో ఉప్పుసాగు

 ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి. నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు మండలం మోళ్లపర్రు వరకు 19 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దీని వెంబడి ఉన్న తొమ్మిది గ్రామాల ప్రజలకు అనాదిగా ఆ సాగే జీవనాధారమైంది.

 నరసాపురం(తూర్పుతాళ్లు), న్యూస్‌టుడే: ‘సముద్ర తీరంలో ఉప్పు సాగు చేసే రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఈ సాగును పంటగా గుర్తిస్తాం.. విద్యుత్తు, రహదారుల సౌకర్యం కల్పిస్తాం. గోదాములు, ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేస్తాం’ అని  గతంలో నరసాపురం పర్యటన సమయంలో పీఎంలంకలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ హామీ ఇచ్చారు. అయిదేళ్లు సీఎంగా ఉన్న జగన్‌ ఏనాడూ ఉప్పు సాగుపై ఒక్క ప్రకటన కూడా చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయిదేళ్ల వైకాపా పాలనలో ఉప్పు సాగు రైతులకు ఒరిగింది ఏమీలేదు. వర్షాలు, విపత్తులకు ఉప్పు పంట నీటమునిగి రైతులు నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆ సమయంలో ఆ ప్రాంతాలను పరిశీలించడంతోనే సరి. కనీసం ఒక్కసారి కూడా నష్టపరిహారం ఇప్పించలేదు. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో ఉప్పు సాగుకు రైతులు దూరమై పోయారు. కాలక్రమేణా ఇతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. కూలి రేట్లు పెరిగాయి. గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి పెరిగిపోవడంతో సాగు తగ్గిపోతోంది.  గతంలో 2 వేల ఎకరాలున్న సాగు ప్రస్తుతం వందల ఎకరాలకు పరిమితమైంది.

ఇవీ కష్టాలు..

వైకాపా ప్రభుత్వం ఉప్పు సాగును పంటగా గుర్తించ లేదు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సాయం అందడం లేదు. రుణాలు అందక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఇందుకు రూ.5 నుంచి 6 వడ్డీ కడుతున్నారు. అంతే కాకుండా ఆయా వ్యాపారులు పంటను తమకే అమ్మాలని డిమాండ్‌ చేస్తున్నారు. తీరా విక్రయిస్తే మార్కెట్‌ ధర ఇవ్వరు. అదేమని అడిగితే అప్పు కట్టమని ఒత్తిడి తెస్తున్నారు. తూకాల్లో వ్యత్యాసంతో రైతులు నష్టపోతున్నారు. తీరంలో ఉప్పుమడులకు వెళ్లేందుకు సరైన రవాణా మార్గాలు లేవు. దీనికి తోడు మడులకు నీరు తోడుకోవడానికి విద్యుత్తు సౌకర్యం, ఉప్పును భద్రపరుచుకోవడానికి ఫ్లాట్‌ఫాం, గోదాము సౌకర్యాలు లేవు. దీంతో రైతులు ఈ పంట సాగుకు సాహసించడం లేదు.

ఏటా నష్టాలే..

‘ప్రకృతి విపత్తులు, వర్షాలకు గోదాము, రవాణా సౌకర్యం లేకపోవడం భద్రపరుచుకోవడం కష్టంగా మారుతోంది. ఆర్థికంగా ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏటా నష్టాలు తప్పడం లేదు. సాగును వదిలేశా’  అని తూర్పు తాళ్లుకు చెందిన పులపర్తి శ్రీనివాస్‌ వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు