logo

ఉద్యోగాలు కావాలంటే తెదేపా రావాలి

‘జాబ్‌ క్యాలెండర్‌ పేరుచెప్పి జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ ఇచ్చి యువతను జగన్‌ నిండా ముంచారు. వైకాపా పాలనకు యువతే చరమగీతం పాడాలి’ అంటూ తెదేపా నేత నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.  ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో  విద్యార్థులు, యువతతో ముఖాముఖీ నిర్వహించారు.

Updated : 06 May 2024 06:43 IST

యువతే వైకాపాకు చరమగీతం పాడాలి
కూటమి ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
ఆక్వా రంగానికి పూర్వవైభవం తెస్తాం
యువగళంలో తెదేపా నేత లోకేశ్‌

ఈనాడు, ఏలూరు,  ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ‘జాబ్‌ క్యాలెండర్‌ పేరుచెప్పి జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ ఇచ్చి యువతను జగన్‌ నిండా ముంచారు. వైకాపా పాలనకు యువతే చరమగీతం పాడాలి’ అంటూ తెదేపా నేత నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.  ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో  విద్యార్థులు, యువతతో ముఖాముఖీ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘వైకాపా చేతకానితనంతో వదిలేసిన ప్రతి సాగునీటి ప్రాజెక్టునూకూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది.  రాయితీలు, పరికరాలు ఇచ్చి మళ్లీ ఆక్వా సాగుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ అని లోకేశ్‌ తెలిపారు.

ఓ యువతి: స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలురైన వారికి మాత్రమే ఉద్యోగోన్నతులు కల్పిస్తున్నారు. ఒక కార్పొరేటర్‌  30-40 ఇళ్లు కబ్జా చేశారు. వేధింపులు ఎక్కువయ్యాయి. మా అమ్మ 19 ఏళ్లుగా అంగన్‌వాడీ సహాయకురాలిగానే ఉన్నారు. ఎలాంటి పదోన్నతి లేదు.. ఈ సమస్యలను పరిష్కరించగలరా?
లోకేశ్‌:
అలాంటి వారి కోసమే రెడ్‌బుక్‌ తీసుకొచ్చా. చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలకు ఇబ్బంది పెట్టిన వారిపై న్యాయ విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకుంటా. తెదేపా పాలనలో రెండు సార్లు జీతాలు పెంచి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాం. జగన్‌ వాళ్లను ఆనేక ఇబ్బందులు పెట్టారు. కేసులు పెట్టారు. లాఠీ ఛార్జీ  చేసి జైలుకు పంపారు. వచ్చేది ప్రజాప్రభుత్వమే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తాం.

చాందిని: విద్యారంగంలో ఏ విధమైన మార్పులు తెస్తారు? ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారా?
కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో సంస్కరణలు చేపడతాం. వైకాపా ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో అనేక ఉపాధ్యాయ కొలువులను రద్దు చేసింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 117 జీవో రద్దుచేసి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ప్రభుత్వ విద్యాలయాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించిన బోధనను అందిస్తాం. బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల పథకాన్ని పునరుద్ధరిస్తాం. పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తాం. సింగిల్‌ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ కొలువులన్నీ భర్తీ చేస్తాం. యువతకు అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు తెప్పించే బాధ్యత తీసుకుంటాం.

వైకాపా అరాచకాలను అరికట్టాలని కోరుతున్న అరుణ

దుర్గాప్రసాద్‌: ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు లేవు. వాటిని నిర్మిస్తారా?
నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థ రూపు రేఖలు మారుస్తానని జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు లేకపోవడం చాలా దారుణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంచనాలు రూపొందించి అవసరమైన అన్ని భవనాలు మూడేళ్లలోగా నిర్మించే బాధ్యత నేను తీసుకుంటున్నా.

నవ్యనీలవేణి: రాష్ట్రంలో ‘దిశ’ చట్టం ఉందా? లేదా? ఉంటే ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ప్రభుత్వం వస్తే ఎలా అరికడతారు?
రాష్ట్రంలో ‘దిశ’ చట్టం అనేది లేదు. పోలీసులు మాత్రమే ఉన్నారు. రౌడీలు, బ్లేడ్‌ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. గంజాయితో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని అరికడతాం. కఠినమైన శిక్షలు అమలు చేసి మహిళలపై అత్యాచారాలను అరికడతాం. నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం.

అక్షయశ్రీ: ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతారు?
వ్యవసాయ రంగంతోపాటు ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. గతంతో ఇచ్చిన వివిధ రాయితీలను పునరుద్ధరిస్తాం. ఆక్వా ఎగుమతుల్లో జిల్లాలను ప్రథమ స్థానంలో నిలబెడతాం ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తులు పెంచడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాం. వివిధ రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించే కార్యక్రమాలను అమలు చేస్తాం.

ఏలూరు యువగళం కార్యక్రమానికి హాజరైన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని