logo

ఖాకీలపై కాఠిన్యం

నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు.

Published : 09 May 2024 03:38 IST

జగన్‌ జమానాలో ముందస్తు ఆరోగ్య పరీక్షల రద్దు
అటకెక్కిన వారాంతపు సెలవులు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు. బందోబస్తు విధుల్లో సతమతమవుతూ.. వీవీఐపీలకు, వీఐపీలకూ భద్రత కల్పిస్తూ.. తమ ఆరోగ్యాన్ని గాలికి వదిలేసే పోలీసులను సైతం సీఎం జగన్‌ వాడుకొని వదిలేశారు. అధికారంలోకి రాగానే అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ బూటకపు హామీలిచ్చి.. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సొంత ప్రయోజనాలకు మాత్రమే వారిని వాడుకున్నారు. ప్రభుత్వపరంగా అందాల్సిన రాయితీలు సైతం సకాలంలో అందించకుండా మోసం చేశారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడున్నర వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ విధులు, బందోబస్త్‌లు, వీవీఐపీ పర్యటనలు, ముఖ్యమంత్రి, మంత్రుల సభలు, సమావేశాలకు బందోబస్త్‌ నిర్వహిస్తున్నారు. అయిదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో పోలీసులకు అందాల్సిన రాయితీలు, జీపీఎఫ్‌, సరండర్‌ సెలవులు, అరియర్స్‌ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తున్నందున... పోలీసులను తమ వైపునకు తిప్పుకొనేందుకు జగన్‌ గట్టి ప్రయత్నమే చేశారు. ఇప్పటివరకు ఇవ్వని సరండర్‌ సెలవుల సొమ్ములను గత వారం రోజులుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తద్వారా పోలీసుల్లో తమపైనున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పాచిక వేశారు.

పెళ్లికి అప్పు చేసి...

ఏలూరులో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ గతేడాది తన కుమార్తె వివాహానికి నగదు అవసరమైంది. జీపీఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా.. సకాలంలో డబ్బు చేతికందలేదు. దాంతో ఆమె అప్పుచేసి కుమార్తె పెళ్లి చేశారు. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు.

ఉల్లాసం... ఉత్సాహం కరవు..

ప్రస్తుతం పోలీసులకు ఉల్లాసం, ఉత్సాహం కరవైంది. గతంలో యోగా, మానసిక ప్రశాంతతకు శిక్షణ తరగతులను నిర్వహించేవారు. ప్రస్తుతం వాటి జాడే కనుమరుగైంది. ముఖ్యంగా పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తామంటూ గత ఎన్నికల వేళ హామీనిచ్చిన సీఎం జగన్‌... అధికారంలోకి ఆ మాటను విస్మరించింది. ప్రస్తుతం సెలవులు లేకపోవడంతో నిత్యం పోలీసులు విధులు నిర్వహిస్తూ    మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బందోబస్తు, పికెటింగ్‌, వాహనాల తనిఖీలు, కార్యాలయాల ముట్టడిని విఫలం చేయడం తదితర విధులతో పోలీసులు సతమతమవ్వాల్సి వస్తోంది. అయిదేళ్ల జగన్‌ సర్కారుతో విసిగిపోయామని... తమకు రావాల్సిన, ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోగా అదనంగా విధులు నిర్వహించాల్సి వచ్చిందని  పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యం... గాల్లో దీపం

గత తెదేపా ప్రభుత్వం పోలీసుల ఆరోగ్య భద్రతపై ప్రధాన దృష్టిపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసుల పక్షపాతిగా వ్యవహరించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ సంక్షేమానికి రూ.15 కోట్లు కేటాయించారు. అలాగే ఏడాదికి 2 దఫాలుగా ముందస్తు మెగా ఆరోగ్య పరీక్షలు చేయించారు. నిపుణులైన వైద్యులతో జిల్లా పోలీసు కార్యాలయం వద్దే భారీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ముందస్తుగానే వ్యాధి తీవ్రతను గుర్తించి... తదనుగుణంగా తగిన వైద్యం అందించేవారు. పోలీసులతోపాటు వారి కుటుంబాలకూ పరీక్షలు నిర్వహించేవారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అయిదేళ్లుగా ఆరోగ్య పరీక్షలు నిలిపివేయడంతో... పలువురు పోలీసులు అనారోగ్యాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు.

గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి...

టి.నరసాపురం పరిధిలో పని చేస్తున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ పది నెలల కిందట గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. పోలీసు శాఖాపరంగా ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉంటే... ప్రమాదాన్ని గుర్తించేవారు. తగిన చికిత్స చేయించుకొని మృత్యువు నుంచి బయటపడేవారని పలువురు సహచర సిబ్బంది చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని