logo

మీ పాలనలో రోజూ అమావాస్యే

జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి.

Updated : 09 May 2024 03:58 IST

వీధి దీపాల సమస్యను పట్టించుకోని జగన్‌ సర్కారు

జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి. వీధి దీపాల నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా... దీపాలు మాత్రం వెలగడం లేదు. జిల్లా కేంద్రాలైన ఏలూరు, భీమవరంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో సైతం వెలుగుల జిలుగులు కానరావడం లేదు. పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ సమస్య జటిలంగానే ఉంటోంది. ఇక శివారు ప్రాంతాలు పొద్దుపోతే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరమ్మతులకు గురైన దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అలంకారప్రాయంగా..

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక పరిధిలో 31 వార్డుల్లో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి వార్డులోనూ దీపాలు వెలగకపోవడంతో పురప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బËంగారువారిచెరువుగట్టు, బ్రాడీపేట, లజపతిరాయ్‌పేట, హౌసింగ్‌బోర్డుకాలనీ, సూర్యతేజనగర్‌, సుబ్బారాయుడుగుడికూడలి, అన్నంవారివీధి, మఠంవీధి వంటి పలు ప్రాంతాల్లో సగానికి పైగా వీధిదీపాలు వెలగడం లేదు. ఎనర్జీస్‌ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) వీధి దీపాల నిర్వహణ చేస్తున్నా పలు వార్డులు అంధకారంలోనే ఉన్నాయి. వైకాపా అధికారంలో వచ్చిన నాటి నుండి రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో రాత్రి సమయాల్లో రహదారులపై గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.

పై చిత్రం 6వ వార్డు బొండాడవారివీధిలోనిది. ఆ వీధి పొడవునా 6 విద్యుత్తు దీపాలు ఉండగా 3 మాత్రమే వెలుగుతున్నాయి. స్థానిక మఠంవీధిలో సుమారు 8 వీధి దీపాలు వెలగాల్సి ఉండగా 4 పాడయ్యాయి. స్థానిక బ్యాంక్‌ కాలనీ దేవునితోట వరకు 10 దీపాలకు 4 వెలగడం లేదు.


ఆవిరైన నిధులు..కానరాని కాంతులు

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: చీకటి పడితే చాలు తాడేపల్లిగూడెం పట్టణం అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. ఏటా వీధి దీపాల నిర్వహణకు రూ.2 కోట్లకు పైగా వెచ్చిస్తున్నా..  ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. వార్డుల్లోనే కాదు ప్రధాన కూడళ్లు, రహదారులపై వీధి దీపాలు వెలగని పరిస్థితి. దీనికి తోడు గుంతల రోడ్లు వాహనచోదకుల ప్రాణాలను తీస్తున్నాయి. నాసిరకం ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు చేయడంతో అవి  తరచూ మరమ్మతుకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలే మొన్నటి వరకు వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టు తీసుకున్నారు.


నడిరోడ్లపై అంధకారం

నరసాపురం పురపాలక సంఘంలోని వివిధ ప్రాంతాల్లో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రాత్రివేళ ప్రధాన కూడళ్లు, ముఖ్య వీధుల్లోనూ చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. పట్టణ నడిబొడ్డునున్న  స్టీమర్‌రోడ్డులోనే దీపాలు వెలగకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. క్రిస్టియన్‌పేట, పంటురేవు తదితర ప్రాంతాల్లోనూ అంధకారం రాజ్యమేలుతోంది. వీధి దీపాలను వెలగకపోవడాన్ని ఆసరాగా చేసుకొని... ఆయా ప్రాంతాల్లో దొంగలు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారైన సంఘటనలు కోకొల్లలు.

న్యూస్‌టుడే, నరసాపురం


నామమాత్రంగా దీపాలు

జిల్లా కేంద్రం భీమవరంలోనూ వీధిదీపాల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రధాన వీధులు, కూడళ్లలోనూ దీపాలు వెలగడం లేదు. ప్రాంతీయాసుపత్రికి వెళ్లే దారిలో పన్నెండు స్తంభాలుండగా... అందులో ఎనిమిదింటికి దీపాలు ఏర్పాటు చేయలేదు. మిగతా నాలుగు స్తంభాలకు దీపాలు బిగించగా మూడు వెలగకపోవడంతో పరిస్థితికి అద్దంపడుతోంది. భీమవరం- ఉండి మార్గంలోనూ వీధి దీపాలు వెలుగక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, భీమవరం పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని