logo

జనసేనానికి నీరాజనం

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది.

Published : 09 May 2024 03:42 IST

దెందులూరు, నూజివీడు అభ్యర్థులు ప్రభాకర్‌, కొలుసు పార్థ్ధసారథిలను పరిచయం చేస్తున్న పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి - హనుమాన్‌ జంక్షన్‌, న్యూస్‌టుడే : కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. జంక్షన్‌లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు.. గన్నవరం, పెనమలూరు, నూజివీడు, దెందులూరు నుంచి జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. మిట్టమధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎండ తీవ్రంగా ఉన్నా.. లెక్కచేయకుండా జనసేనాని కోసం శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూశారు. జంక్షన్‌లో దారులన్నీ.. కూటమి శ్రేణులతో కిక్కిరిశాయి. సభావేదిక వద్ద ఇసుక వేస్తే రాలనంత మంది జనం తరలివచ్చారు. ఎండ మండిపోతున్నా.. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు సభ ప్రారంభమైనప్పటి నుంచి పవన్‌ ప్రసంగం ముగిసే వరకూ.. అలాగే జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా జాతీయ రహదారిపై సభా వేదిక వద్ద నిలబడి.. ప్రతి మాటకూ చప్పట్లు, ఈలలతో మోతమోగించారు. ఎన్డీయే కూటమి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం, పెనమలూరు, దెందులూరు, నూజివీడు అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్‌, చింతమనేని ప్రభాకర్‌, కొలుసు పార్థసారథి తదితరులు హాజరయ్యారు.

చింతమనేనిపై ఆసక్తికర వ్యాఖ్యలు.. దెందులూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు జనసేన శ్రేణులంతా ఓట్లు వేసి గెలిపించాలని పవన్‌ సూచించారు. ఈ సందర్భంగా చింతమనేని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా ఇద్దరి మైత్రి గొడవతో ఆరంభమైంది. చింతమనేని అంటే నాకు చాలా ఇష్టం. నేను దెందులూరు నుంచి పోటీ చేస్తానంటే గెలిపించే బాధ్యత తనదని అన్నందుకు ఆయనకు ధన్యవాదాలు.’ అని పవన్‌ అనడంతో సభలోని వారంతా ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌, నూజివీడులో పార్థసారథిని మంచి మెజార్టీతో గెలిపించాలనీ, జనసేన మద్దతుదారులంతా అండగా ఉండాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని