logo

కొల్లేరు రాజ్యంలో అరాచకాసురుడు

అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం.

Published : 09 May 2024 03:45 IST

ప్రశ్నిస్తే కిరాయి మూకలతో దాడులు
ఎదగాలనుకున్న వారిని అణగదొక్కే నైజం
నేత దాష్టీకాలకు  చివురుటాకులా ప్రజలు
ఈనాడు, ఏలూరు

అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం. పోలీసులను బానిసలుగా చూస్తారు.. ఇదేమిటని ప్రశ్నిస్తే బదిలీ బహుమతితో సత్కరిస్తారు. పదవి తండ్రిదైనా పెత్తనం కొడుకులదే.

సాధారణంగా నాయకులు ఎదుటి పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు. ఈ నేత మాత్రం తన గెలుపునకు సహకరించిన సొంత పార్టీ నేతలు ఎక్కడ ఎదుగుతారో అన్న అభద్రతా భావంతో కక్షసాధింపులకు పాల్పడతారు. ‘వైకాపా ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడ్డాం నామినేటెడ్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి’ అని అడిగినందుకు ఓ మహిళా నేతను ఇంటికి పిలిపించి దుర్భాషలాడి అవమానించారు. అది చాలక  స్టేషన్‌కు రప్పించి ఓ ఎస్సైతో బెదిరింపులకు గురి చేశారు. దీనికి తలొగ్గని ఆ మహిళా నేత  భారీఎత్తున అవినీతి చేస్తున్నారని ప్రచారం చేశారు. దీంతో ఒక కార్యక్రమానికి హాజరై వెళ్తున్న మహిళా నేత, అతని భర్తపై రౌడీ మూకలతో దాడి చేయించారు. స్టేషన్‌కు రప్పించి పోలీసుల ఎదుటే ఆమె భర్తపై దాడికి దిగారు. వీరి కోసం వచ్చిన మరో బీసీ నేతపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయించారు.

’డీ’ గ్యాంగ్‌ అరాచకాలు..  గ్రామాల్లో అధికార పార్టీపైగానీ నాయకులపై గాని విమర్శలు చేసినా..ప్రశ్నించినా వెంటనే ఈ ‘డీ’ గ్యాంగ్‌ రంగంలోకి దిగుతోంది. పోలీస్‌స్టేషన్‌లోనే వీరి రౌడీ పంచాయితీలన్నీ జరుగుతాయి. పోలీసుల ఎదుటే వీరు ఎంతో మందిని చితకబాదటంతో ప్రజలకు పోలీసులపైనే నమ్మకం పోయింది. నియోజకవర్గ కేంద్రంలోని ఓ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను సమస్యలపై ప్రశ్నించారనే కారణంతో ఓ యువకుడి చరవాణి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు రప్పించి ముప్పుతిప్పలు పెట్టారు.

పెడితే మా ఫ్లెక్సీలే పెట్టాలి.. గ్రామాల్లో తమను కాదని వేరే నాయకుల ఫ్లెక్సీలు పెట్టినా ఎమ్మెల్యే అహం దెబ్బ తింటుంది. ఓ గ్రామంలో ఓ యువకుడు పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా రాజకీయ విభేదాలు సృష్టించారు. దీంతో గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడగా జనసేనకు చెందిన యువకులపై అక్రమంగా కేసులు బనాయించారు. ప్రభుత్వానికి సంబంధం లేని ఓ కార్యక్రమానికి అడ్డుపడుతున్నాడని జనసేనకు చెందిన ఓ యువనేతపై ప్రతాపం చూపారు. ఎమ్మెల్యే సభకు కట్టిన ఫ్లెక్సీలు ఎవరో చింపితే గ్రామంలో చదువుకుంటున్న ముగ్గురు యువకులను కేసుల్లో ఇరికించారు.

వ్యతిరేకిస్తే అంతే సంగతులు.. 2019లో వైకాపాకు ఓటేయలేదని కొల్లేరులో మంచినీటి కోసం ఏర్పాటు చేసుకున్న చెరువును అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే కొట్టించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కొల్లేరు లంక గ్రామానికి చెందిన యువత ప్రశ్నించడంతో   దుర్భాషలాడి అంతు తేలుస్తానని వీరంగమాడారు. నియోజకవర్గంలో మండల గ్రామ స్థాయి నాయకులు నిమిత్త మాత్రులే. చిన్న పని చేయాలన్నా అధికారులకు సదరు నేత కొడుకు ఫోన్‌ చేయాల్సిందే. లేదంటే ఎన్ని రోజులైనా దస్త్రాలు ముందుకు కదలవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని