logo

సీసాలో భూతం

నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.

Updated : 09 May 2024 05:28 IST

ఉసురు తీస్తోన్న నకిలీ మద్యం
పెరుగుతున్న కాలేయ, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులు
ఎన్నికల మద్యం దిగుతున్న వేళ మరింత అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు
ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే- ముదినేపల్లి, పోలవరం, చింతలపూడి

నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పెద్ద దిక్కును పోగొట్టుకుని పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపకాలు జోరుగా సాగుతున్నాయి. గోవా తదితర ప్రాంతాల నుంచి నకిలీ మద్యం దిగుమతవుతోంది. ఊరికే వస్తుంది కదా అని మందుబాబులు తాగితే అవస్థలు పడక తప్పదు. ఈ మద్యం తాగటంతో కాలేయం, మూత్ర పిండాల వ్యాధులతోపాటు భయం, గుండె దడ, నిద్ర రాకపోవటం, ఆకలి లేమి, కామెర్లు, వాంతులు, విరేచనాలు, నరాల తిమ్మిర్లు వంటి ఇబ్బందులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నియంత్రణ లేకుండా తాగితే ప్రాణానికే ముప్పని హెచ్చరిస్తున్నారు.

తణుకుకు చెందిన మట్టా నాగయ్యకు 12 ఏళ్లుగా మద్యం తాగే అలవాటుంది. రెండేళ్ల క్రితం కడుపులో మంట రావటంతో వైద్యుడిని సంప్రదిస్తే మద్యం తాగటం వల్లే లివర్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చిందని చెప్పారు. పట్టించుకోకుండా కొనసాగించడంతో మృతి చెందారు. ఏడాది క్రితమే కొడుకు కూడా చనిపోవటంతో నాగయ్య భార్య దిక్కులేనిదై..కూలి పనులతో జీవనం సాగిస్తోంది.

పెరుగుతున్న రోగులు..

ఉమ్మడి జిల్లాలో దాదాపు ఆరు ప్రైవేటు జీర్ణకోశ వ్యాధుల ఆసుపత్రులున్నాయి. ఇక్కడికి రోజుకు 800 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. వీరిలో మద్యంతో అనారోగ్యం పాలైన వారు 300 మంది వరకు ఉంటారు. అయిదేళ్ల క్రితం ఓపీ 350 ఉంటే 70 మంది మాత్రమే మద్యం అలవాటుతో అనారోగ్యం పాలైనవారు వచ్చేవారు. ప్రస్తుతం ఏలూరు వైద్య కళాశాల జీర్ణకోశ వ్యాధుల విభాగంలో 40 మంది చికిత్స పొందుతున్నారు వారిలో 21 మంది వరకు మద్యం తాగటంతో అనారోగ్యం పాలైన వారే ఉన్నారు. ప్రాణాలు కోల్పోతున్నవారిలో 90 శాతం మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే కావడంతో వారి కుటుంబాలు ఛిన్నాభిన్నవుతున్నాయి.  


భర్త, అల్లుడు తాగుడుతో చనిపోయారు

మా అల్లుడికి, భర్తకు చాలా ఏళ్ల నుంచి మద్యం తాగే అలవాటుంది. మూడేళ్ల క్రితం అల్లుడు విపరీతంగా మద్యం తాగుతూ లివర్‌ సమస్యతో చనిపోయారు. నా కూతురు దిక్కులేనిదైంది. నా భర్త మద్యం అలవాటు మానుకోలేదు. దీంతో కాలేయ ఇన్‌ఫెక్షన్‌తో ఆరు నెలల క్రితం చనిపోయారు. ఇద్దరి మరణాలతో మా కుటుంబం రోడ్డున పడింది.  

దోర నాగమణి, ఎల్‌ఎన్టీపేట, పోలవరం మండలం


కొడుకు, కూతురు కూలిపనులు చేస్తున్నారు

ముఠా పనికి వెళ్లే నా భర్తకు 15 ఏళ్ల నుంచి మద్యం అలవాటుంది.  రెండేళ్లుగా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. స్థోమత లేకున్నా చాలా ఆసుపత్రులకు తిప్పా. మద్యం తాగటంతో లివర్‌ బాగా చెడిపోయిందని చెప్పారు. డబ్బుల్లేక ఆరు నెలల క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడే చనిపోయారు. దీంతో దిక్కులేక నా కొడుకు, కూతురు చదువు మానేసి కూలి పనులకు వెళుతున్నారు.

మురారి నాగమణి, ముదినేపల్లి


దిక్కు లేకుండా పోయింది

నా భర్త థామస్‌ గత నాలుగేళ్ల నుంచి సారా, మద్యం విపరీతంగా తాగడంతో ఆరోగ్యం పాడైంది. దాదాపు ఏడాది పాటు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. లివర్‌పూర్తిగా పాడైందని వైద్యం చేసినా ఫలితం లేదని వైద్యులు చెప్పారు. గతేడాది చనిపోయారు. కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే దిక్కు లేకపోవటంతో అప్పటి నుంచి నేనే కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నా.

కుంపటి నాగమణి, ఫాతిమాపురం, చింతలపూడి మండలం


తాగుడుతో టీబీ వచ్చింది

మద్యం తాగటంతో మా నాన్నకు టీబీ వచ్చిందని వైద్యులు చెప్పారు. మద్యం మానేయమన్నా వినకపోవటంతో వారం క్రితం ఆయాసం, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో గత 5 రోజులుగా ఏలూరు ఆసుపత్రిలో ఉంటున్నాం. ఇంకా ఆయాసం తగ్గలేదు. భయంగా ఉంది.

శిరోమణి, కొమ్మర, ద్వారకాతిరుమల మండలం


మద్యంతో అన్నీ అనర్థాలే

మద్యపానంతో కాలేయం దెబ్బతిని  ..నరాలు బలహీన పడి ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. కామెర్లు వచ్చే అవకాశం ఉంది. మూత్ర పిండాలు పని చేయవు. అధికంగా మద్యం తాగితే  పేగులకు పూత, పుండ్లు సమస్యల తో క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కడుపులో మంటతో ఇబ్బంది పడటం, వాంతులు చేసుకోవటం వంటి ఇబ్బంది ఉంటుంది. ఈ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య గత కొంత కాలంగా బాగా పెరిగింది.

రవికుమార్‌, ఏలూరు వైద్య కళాశాల వైద్య నిపుణుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని