logo

ఇదేనా మహిళా సాధికారత.. జగన్‌

మహిళల్లో మార్కెటింగ్‌ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్‌పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం

Published : 09 May 2024 03:55 IST

లేస్‌పార్కుపై వైకాపా మార్కు నిర్లక్ష్యం
హామీ ఇచ్చి వదిలేసిన వైనం

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడమే మా లక్ష్యం. నరసాపురంలో చేతి అల్లికల అక్కచెల్లెమ్మలను ఆదుకుంటాం. చేనేత, కలంకారి వృత్తిలో ఉన్నవారికి ఇచ్చినట్లే వీరికి ప్రతినెలా రూ.2 వేలు పెట్టుబడి రాయితీ ఇస్తాం.

ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మాటలివి. అధికారంలోకి వచ్చాక కనీసం దానివైపు చూసిన పాపాన పోలేదు.

ఈనాడు డిజిటల్‌, భీమవరం, నరసాపురం, న్యూస్‌టుడే

నరసాపురంలోని లేస్‌పార్కు

మహిళల్లో మార్కెటింగ్‌ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్‌పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఎంతోమంది మహిళలు స్వయం ఉపాధికి దూరమయ్యారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే చేతి అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. దాదాపు 2వేల కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవించేవి. ఇందులో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్‌దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది వరకు ఉండేవారు.

మరి నేడు..

పరిశ్రమను, దానిమీద ఆధారపడి జీవిస్తున్న వారిని వైకాపా ప్రభుత్వం నిలువునా ముంచిందని, ఇదేనా మహిళా సాధికారతని   వనితలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ప్రారంభించారు. అనుసంధానంగా 50 సొసైటీలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత తెదేపా హయాంలోనూ ఓ వెలుగు వెలిగింది. మహిళలకు అల్లికల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, శ్రమకు తగిన ఫలితం దక్కేందుకు వీలుగా డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు అలంకృతి మినీ లేసుపార్కుల పేరిట భవనాలు నిర్మించారు. ఆధునిక లేసు కుట్టు యంత్రాలను సైతం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ అలంకారప్రాయంగా మారాయి. అల్లికలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్న శిక్షణ తప్ప ఇక్కడ ఏ విధమైన ఉపాధి కార్యక్రమాలు లేవు.

ఆదరించడంలో విఫలం

వైకాపా పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మహిళలకు శిక్షణ మాట అటుంచితే ... లేసులకు మార్కెటింగ్‌, గిట్టుబాటు కూలీ లభించేలా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నరసాపురం డివిజన్‌లో అధిక శాతం మహిళలకు లేసుË అల్లికలే ప్రధాన ఆదాయ వనరు. ఈ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఇంటి పట్టునే ఉంటూ లేసులు అల్లడం ద్వారా కొద్దిపాటి ఆదాయం పొందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు.

పన్నుల మోత

లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో సుంకాలు ఉండేవి కావు. లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్‌టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. గతంలో ఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడంతో పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతిదారులు కోరుతున్నారు.

ఇంటి పట్టునే ఉండి..

‘దారంతో లేసుఅల్లికలు పూర్వం నుంచీ ఉన్నాయి. నేను నా కుటుంబ సభ్యులద్వారా లేసు అల్లికలు నేర్చుకున్నా. గతంలో ఇంటి పట్టున ఉండే మాలాంటి వారికి లేసు అల్లికలు ఆదాయమార్గంగా ఉండేవి. నూతన విధానాలతో మాకు ఉపాధి కరవైంది. వాటిపై శిక్షణ ఇస్తే మాకు ఉపాధి దొరకడంతోపాటు భవిష్యత్తు తరాలకు ఈ కళను అందించేందుకు అవకాశం ఉంటుంది’ అని మొగల్తూరుకు చెందిన ఎ.సత్యవతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని