logo

Andhra News : చేనేత... కన్నీళ్ల కలబోత!

చేనేత సప్తవర్ణాల కలబోత... భారతీయ సంప్రదాయానికి ప్రతీక... నాగరికతను మలుపు తిప్పిన కీలక రంగం... వన్నె తరగని హస్త కళా నైపుణ్యానికి నిదర్శనం.. వారసత్వ కళకు పెట్టింది పేరు... అద్భుత ఆకృతులు సృష్టించడంలో దిట్ట... స్వాతంత్య్ర పోరాటంలో స్వాభిమానం నేర్పింది... జాతి ఔన్నత్యాన్ని చాటింది... ఆరు గజాల నేత చీరెను అగ్గిపెట్టెలో

Updated : 07 Aug 2022 10:03 IST

అమాంతం పెరిగిన ముడి సరకు ధరలు

ఇంటిల్లిపాది కష్టపడినా దక్కని గిట్టుబాటు

నేడు జాతీయ చేనేత దినోత్సవం

- న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం, కడప

ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో ముదిమి వయసులోనూ రెక్కల కష్టంతో

మగ్గం పనిచేస్తున్న చేనేత కార్మికుడు రామస్వామి

చేనేత సప్తవర్ణాల కలబోత... భారతీయ సంప్రదాయానికి ప్రతీక... నాగరికతను మలుపు తిప్పిన కీలక రంగం... వన్నె తరగని హస్త కళా నైపుణ్యానికి నిదర్శనం.. వారసత్వ కళకు పెట్టింది పేరు... అద్భుత ఆకృతులు సృష్టించడంలో దిట్ట... స్వాతంత్య్ర పోరాటంలో స్వాభిమానం నేర్పింది... జాతి ఔన్నత్యాన్ని చాటింది... ఆరు గజాల నేత చీరెను అగ్గిపెట్టెలో ఒదిగిపోయేలా అందంగా మడత పెట్టి అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసిన రంగం... ఆ వస్త్రాలు ధరిస్తే రాజసం ఉట్టిపడుతుంది... మగువల మనసు దోచే కళాత్మకం చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే... కళ్లతో, కాళ్లతో, మునివేళ్లతో నేర్చుకున్న మగ్గం... అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరని అందంగా మడతపెట్టి ఒదిగిపోయేలా ఎంతో చిక్కదనంతో నేసిన చీరతో అంతర్జాతీయ కీర్తి సొంతం చేసుకున్నారు మన కళాకారులు. ఆధునిక యుగంలో అమాంతం పెరిగిన ముడి సరకుల ధరలు, ఇంటిల్లిపాది శ్రమించి నేసిన వస్త్రాలకు విపణిలో గిట్టుబాటు దక్కడం లేదు. ఎన్నో మగ్గాల చప్పుళ్లు నిలిచిపోతున్నాయి. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

వైయస్‌ఆర్‌ జిల్లాలో 15 వేల చేనేత కుటుంబాలున్నాయి. అందులో 11 వేల కుటుంబాలు నేత పనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత సహకార సంఘాలు 205 ఉండగా, వాటిల్లో 179 పనిచేస్తున్నాయి. మాధవరంలో తయారు చేసే వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైలవరం, ఖాజీపేట, సింహాద్రిపురం, బద్వేలు, ఒంటిమిట్ట, సిద్దవటం, కమలాపురం మండలాల్లో నేతన్నలు ఉన్నారు. ఈ రంగంపై ఆధారపడిన 9,819 మందికి వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పథకంలో పింఛను అందుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ముద్ర రుణాలు 740 మందికి ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇప్పటికే 213 మంది నుంచి దరఖాస్తులు రాగా, 61 మందికి రూ.36 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2019, డిసెంబరు 21న వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 8 వేల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. ఇదొక్కటే ఊరటనిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

నేతన్నల వెతలు తీరేనా?

అన్నమయ్య జిల్లాలో సుమారు 9 వేల కుటుంబాలు చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ముద్ర యోజన రుణాలను 1,060 మందికి రూ.5.30 కోట్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటికే 220 మంది పరపతి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ 85 మందికి రూ.45 లక్షలు ఇచ్చారు. పింఛను 3,617 మంది లబ్ధి పొందుతున్నారు. చేనేత సహకార సంఘాలు 57 ఉండగా 39 క్రీయాశీలకంగా పనిచేస్తున్నాయి. తూర్పు ప్రాంతంలో వీరబల్లి, పుల్లంపేట, రాజంపేట, చిన్నమండెం, పశ్చిమాన మదనపల్లి పట్టణం, గ్రామీణ, కురబలకుంట, బి.కొత్తకోట, తంబళ్లపల్లి, ములకలచెరువు, నిమ్మనపల్లి, కలకడ, పీలేరు మండలంలో అధిక సంఖ్యలో కార్మికులు ఉన్నారు. సహకార రంగంలో 2,650 మంది, సహకారయేతర విభాగంలో 5,550 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పవర్‌లూమ్‌లు 1,450 ఉన్నాయి.

ప్రోత్సాహం అందాలి : పోటీ ప్రపంచంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులను తట్టుకొని నిలబడాలంటే సృజనాత్మక సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. నూతన ఆకృతులపై అవగాహన కల్పించాలి. ముడి సామగ్రి రాయితీపై ఇవ్వాలి. రుణాలతోపాటు రాయితీలను విరివిగా మంజూరు చేయాలి. వస్త్రాలకు విపణిలో గిట్టుబాటు కల్పించాలి. మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. విద్యుత్తు వాడకంపై 200 యూనిట్ల వరకు రాయితీ ఇవ్వాలి. చేనేత అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి.

ముడి పట్టుకు అందని రాయితీ

పట్టు వస్త్రాలు తయారు చేస్తున్న కార్మికులకు ఆర్థికంగా ఊరటనివ్వాలని అప్పటి ప్రభుత్వం ముందుకొచ్చింది. 2012, సెప్టెంబరు నుంచి అర్హత ఉన్న కార్మికుడికి నెలకు 4 కిలోల ముడి సామగ్రి కొనుగోలుకు రూ.600 ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం 2016, అక్టోబరు 13న కిలోకి రూ.250 ఇస్తూ నెలకు రూ.వెయ్యి ఇచ్చేవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. విపణిలో ముడి పట్టు ధరలు బాగా పెరిగాయి. కార్మికుల కన్నీళ్ల కలబోతను ఆలకించిన పాలకులు 2019, ఫిబ్రవరి 5న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో వరాలు జల్లు కురిపించారు. నెలకు రూ.2 వేలు ఇస్తామని వాగ్దానం చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 22న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం వైకాపా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రాయితీ సొమ్ములను విడుదల చేయలేదు.

నిధులు కరిగినా నిరుపయోగం

మైలవరంలో టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటుకు 2005, మే 24న శంకుస్థాపన చేశారు. సర్వేసంఖ్య 49/1లో 62.78 ఎకరాలు సేకరించారు. రూ.7.38 కోట్లతో చేపట్టాలని శ్రీకారం చుట్టారు. రక్షణ గోడ, భవనాలు, తాగునీరు, ఇతర వసతులకు రూ.2.80 కోట్లకు పైగా వెచ్చించారు.

* ప్రొద్దుటూరులో అపెరల్‌ పార్కు స్థాపించాలని 2005, ఆగస్టు 3న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శిలాఫలకం వేశారు. రూ.5 కోట్ల అంచనా వ్యయం కాగా,  సుమారు 76.17 ఎకరాలు సేకరించారు. భూసేకరణ, రహదారి నిర్మాణం కోసం రూ.5.51 కోట్లు ధారపోశారు. ప్రస్తుతం మూలకు చేరింది. సిద్దవటంలోని  ఎస్‌కేఆర్‌నగర్‌లో గతంలో ఏర్పాటు చేసిన చేనేత క్లస్టరు మూతపడింది.


ఆరోగ్య బీమాను పునరుద్ధరించాలి

ఇరవై ఏళ్లుగా మగ్గం పనిచేసుకుంటూ జీవిస్తున్నాం. ఆరోగ్య బీమా పథకం పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ముడి పట్టుపై రాయితీ సొమ్ము ఇస్తే ఆర్థికంగా ఊతమిచ్చినట్లవుతుంది. ఇంటిల్లిపాది కష్టపడి పనిచేస్తే నెలకు రూ.10 వేలు వస్తోంది.

- చొప్పా వెంకటసుబ్బమ్మ, మాధవరం, సిద్దవటం మండలం


కార్మికుల చెంతకే సంక్షేమ ఫలాలు

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, రాయితీ ఫలాలను నిజమైన కార్మికుల చెంతకే తీసుకెళుతున్నాం. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తంలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. బ్యాంకుల్లో ముద్ర రుణాలు మంజూరు చేయిస్తున్నాం. సహకార సంఘాల్లోని సభ్యులను ప్రోత్సహిస్తున్నాం.  

- భీమయ్య, ఏడీ, చేనేత, జౌళి శాఖ, వైయస్‌ఆర్‌ జిల్లా


ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

గత 15 ఏళ్లుగా మగ్గం పనిచేస్తున్నా. నెలంతా కష్టపడితే రూ.8 వేలు వస్తోంది. ఏడాది కిందట ఇంటి స్థలమిచ్చారు. అది గుట్టపైన ఇవ్వడంతో పక్కా గృహం నిర్మాణానికి  ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని అడుగుతున్నా స్పందన లేదు. రుణాలివ్వాలని అడిగినా ఇవ్వడం లేదు.  

-  శ్రీరామదాసు సత్యనారాయణ, మాధవరం, సిద్దవటం మండలం


పారదర్శకంగా పథకాలు

చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. వస్త్రాలు తయారు చేస్తున్న నేతన్నలకు రాయితీ ఫలాలు, ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నాం. కార్మికులకు భరోసా కల్పిస్తున్నాం.

- శ్రీనివాసరెడ్డి, ఏడీ, చేనేత, జౌళి శాఖ, అన్నమయ్య జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని