logo

కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుకు కొత్త ప్రతిపాదనను ఆమోదించండి

కడప నుంచి బెంగళూరుకు నిర్మించతలపెట్టిన రైల్వే ప్రాజెక్టులో కొత్తగా ప్రతిపాదించిన ఆకృతులకు ఆమోదముద్ర వేయాలంటూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.

Published : 03 Feb 2023 01:08 IST

కేంద్ర మంత్రికి ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, ఏడు రోడ్లు, పులివెందుల గ్రామీణ : కడప నుంచి బెంగళూరుకు నిర్మించతలపెట్టిన రైల్వే ప్రాజెక్టులో కొత్తగా ప్రతిపాదించిన ఆకృతులకు ఆమోదముద్ర వేయాలంటూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు దిల్లీలో గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టులో భాగంగా ముందుగా నిర్ణయించిన మేరకు కడప, పెండ్లిమర్రి, ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, వాల్మీకిపురం, మదనపల్లె మీదుగా కర్ణాటకలోని మదగట్ట, ముళబాగల్‌ మీదుగా కోలారు- బంగారుపేట రైల్వేలైనులో కలిసేవిధంగా ప్రాజెక్టును కేంద్రం రూపొందించి పనులు చేపట్టింది. పెండ్లిమర్రి వరకు పనులు చేపట్టగా కొంత కాలానికి నిలిచిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కడప నుంచి ముద్దనూరు, ముదిగుబ్బ మీదుగా ధర్మవరం- పుట్టపర్తి లైనులో కలిసేలా ప్రాజెక్టు ఆకృతులు మార్చాలంటూ సీఎం జగన్‌ రైల్వేబోర్డుకు గతంలో లేఖ రాశారు. ఇప్పటివరకు రైల్వేబోర్డు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ ప్రస్తావనను రైల్వేశాఖ మంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళుతూ వినతిపత్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రతులను అందజేశారు. గత ప్రతిపాదన మేరకు... ఎక్కువ దూరం.. రెండు రాష్ట్రాల మధ్య భూసేకరణ సమస్యల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతుందని.. కొత్త ప్రతిపాదనతో తక్కువ దూరంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని ఎంపీ కలిశారు. గండికోట చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కేంద్రం గుర్తించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ‘స్వదేశీ దర్శన్‌’ పథకం ద్వారా రూ.80 కోట్ల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. వీటితో పాటు దాల్మియా సిమెంటు కంపెనీ యాజమాన్యంతో చర్చించి సీఎస్‌ఆర్‌ నిధుల కేటాయింపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దవటం కోట చారిత్రక ప్రాముఖ్యతను తన లేఖలో ఎంపీ ప్రస్తావించారు. ఇటీవల భారీ వర్షాలతో కోటలోని పురాతన స్మారక చిహ్నాలు.. ప్రహరీ చాలా వరకు దెబ్బతిన్నాయని.. వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. చారిత్రక కోటను భవిష్యత్తు తరాలకు అందించేలా సహకరించాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని