logo

మట్టి... కొల్లగొట్టి!

అధికా పార్టీకి చెందిన కొంతమంది నేతల అడ్డగోలు తవ్వకాలతో కొండలు, గుట్టలు బద్దలవుతుండగా, చెరువులు చిక్కిపోతున్నాయి.

Published : 05 Feb 2023 02:22 IST

అధికార పార్టీ నేతల బరితెగింపు

చెరువులు, కొండల ధ్వంసం
ఛిద్రమవుతున్న రహదారులు

అధికా పార్టీకి చెందిన కొంతమంది నేతల అడ్డగోలు తవ్వకాలతో కొండలు, గుట్టలు బద్దలవుతుండగా, చెరువులు చిక్కిపోతున్నాయి. పచ్చని పంట పొలాలు పాడవుతుండగా, గ్రామీణ రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఫలితంగా ఊళ్లకు ఊళ్లే విలవిలలాడుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారం అండతో వైయస్‌ఆర్‌ జిల్లా కడప, చాపాడు, అన్నమయ్య జిల్లా మదనపల్లె, రాజంపేట, గుర్రంకొండలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలకు పాతరేస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. రెండు జిల్లాల్లో మట్టి మాఫియా ఆగడాలపై పరిశీలనాత్మక కథనం.

ఈనాడు డిజిటల్‌, కడప


చాపాడులో దారుణం

చాపాడు మండలంలో కుందూనది ఒడ్డున మట్టి తవ్వకాలతో ఏర్పడిన గొయ్యి

చాపాడు మండలం పెద్ద గురువలూరు సమీపంలోని కుందూ నది వంతెన వద్ద పెద్దఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థానిక ఎస్సీలు ఏటి పోరంబోకు భూముల్లో ఎన్నో ఏళ్లుగా పంటల సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. పేదల నోట్లో మట్టి కొడుతూ భూముల్లోని మట్టిని యంత్రాలతో తవ్వేస్తూ ప్రొద్దుటూరు, మైదుకూరుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అల్లాడుపల్లెకు చెందిన ఓ నేత ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తూ రూ.లక్షల్లో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నియోజకవర్గ నేత అండదండలతో అక్రమాలకు పాల్పడుతూ రహదారులను సైతం ధ్వంసం చేస్తున్నారు. ఒక్కో టిప్పరు మట్టిని రూ.7 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. రామచంద్రాపురం మీదుగా పీఎంజీఎస్‌వై కింద రూ.3 కోట్లతో నిర్మించిన నూతన తారు రహదారి సైతం భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమైపోతోంది.  ప్రభుత్వం వెలిగోడు నుంచి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వరకు రూ.1,700 కోట్లతో కుందూ విస్తరణ పనులు చేపట్టగా కేసీ కాలువకు సాగు నీరొస్తున్నందున ఆ పనులు తాత్కాలికంగా నిలిపేశారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మట్టిని తవ్వి నిల్వ చేయగా దీన్ని కూడా తరలించుకుపోతున్నారు.


కడప నేత చేతిలో చెరువు విలవిల

కడప నగర శివారులో పుట్లంపల్లె చెరువులో మట్టి తవ్వకాలు భారీ వాహనాల
రాకపోకలతో ధ్వంసమైన చాపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని రహదారి

వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప నగర శివారులోని పుట్లంపల్లె చెరువుపై అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత నేత కన్నుపడింది. నగర పాలకసంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈయన చెరువు మట్టిని నిత్యం తరలించుకుంటూ అక్రమార్జనతోపాటు కొంత భూమిని సైతం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నగరం అవసరాలకు మట్టికి అధిక డిమాండుతో పాటు మంచి ధర పలుకుతుండడంతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ కీలక నేత కావడంతో అక్రమాలను అడ్డుకోలేక జలవనరులు, రెవెన్యూశాఖల అధికారులు చేతులెత్తేశారు.


మదనపల్లెలో దోపిడీ

మదనపల్లె మండలం బసినికొండ, పోతబోలు, అంకిశెట్టిపల్లె, రామిరెడ్డిగారిపల్లె వేంపల్లె, చిప్పిలి, పొన్నూటిపాళెంలలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల కనుసన్నల్లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మదనపల్లె చుట్టుపక్కల గుట్టలను మట్టి మాఫియా గుల్ల చేస్తోంది. పట్టణంలోని ఇళ్లతోపాటు బహుళంతస్తుల భవనాల నిర్మాణాలకు మట్టి తరలించేందుకు ట్రాక్టరుకు రూ.700, టిప్పరుకు రూ.4 వేలు వరకు వసూలు చేస్తున్నారు.

గుర్రంకొండలో...

గుర్రంకొండ మండలంలోనూ విచ్చల విడిగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఇక్కడ చెరువులు, గుట్టల్లో మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నారు. ఇటుక బట్టీలు ఎక్కువగా ఉండడంతో మట్టికి భారీగా డిమాండు నెలకొంది.

రాజంపేట నియోజకవర్గంలో...

రాజంపేట నియోజకవర్గంలో గుట్టలను కొల్లగొట్టి మట్టిని తరలించుకుంటూ సొమ్ము చేసుకోవడంతో పాటు మట్టి తవ్వకాలు జరిపిన స్థలాలను చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. ఉభయ తారకంగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారు. వీరికి బడా నేతల అండదండలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని