logo

పేదలకేదీ ఉపాధి హామీ?

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేదలకు బాసటగా నిలవడంలేదు. ప్రతి కుటుంబానికి ఏటా నూరు రోజుల పని కల్పించాలనే లక్ష్యం నెరవేరడంలేదు.

Updated : 05 Feb 2023 03:29 IST

నూరు రోజుల పని కొంత మందికేనా?
వైయస్‌ఆర్‌లో 2,771 కుటుంబాలకే లబ్ధి
అన్నమయ్యలో 3,609 మందికే భాగ్యం

ఉపాధిహామీ పనుల్లో మహిళా కూలీలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేదలకు బాసటగా నిలవడంలేదు. ప్రతి కుటుంబానికి ఏటా నూరు రోజుల పని కల్పించాలనే లక్ష్యం నెరవేరడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి చేతినిండా పనులు చూపాలనే స్ఫూర్తి నెరవేరడంలేదు.

న్యూస్‌టుడే, కడప

* వైయస్‌ఆర్‌ జిల్లాలో 557 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో 3,27,397 కుటుంబాలకు పని పత్రాలివ్వగా, 6,44,806 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో క్రీయాశీలకంగా ఉన్న జాబ్‌కార్డుదారులు 2,03,692 ఉండగా, సభ్యులు 3,51,450 మంది ఉన్నారు. ఏడాదికి ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇప్పటికీ 2,771 కుటుంబాలకు మాత్రమే భాగ్యం దక్కింది. 2022-23లో చూస్తే ఇప్పటివరకు కూలీల వేతనాలకు రూ.138.36 కోట్లు, సామగ్రికి రూ.84.45 కోట్లు, పరిపాలన పనులకు రూ.26.35 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 నెలలు కరిగిపోగా, నూరు రోజులపాటు పనులను అతి తక్కువ మంది పొందారు. * ఒంటిమిట్ట మండలంలో క్రీయాశీలక పని పత్రాలు పొందిన కుటుంబాలు 4,316 ఉండగా, 6,373 మంది సభ్యులుగా నమోదయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6.32 కోట్లు ఖర్చు చేయగా కేవలం 71 కుటుంబాలు మాత్రమే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాయి. * పోరుమామిళ్ల మండలంలో పనిపత్రాలు 10,742 మంది పొందితే, 17,790 మంది సభ్యులుగా ఉన్నారు. వేతనాలు, సామగ్రి, పరిపాలన పనులకు రూ.8.39 కోట్లు వెచ్చించారు. నూరు రోజుల పాటు 61 కుటుంబాలు ఉపాధి పొందాయి. * పులివెందుల మండలంలో 16, జమ్మలమడుగులో 21, బద్వేలులో 44, అట్లూరులో 67, మైదుకూరులో 92 కుటుంబాలు పూర్తిస్థాయిలో ప్రయోజనం పొందాయి. * అన్నమయ్య జిల్లాలో 501 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డులు 2.82 లక్షలు ఇవ్వగా, అందులో 4.95 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వేతనాలకు రూ.164.67 కోట్లు, సామగ్రికి రూ.94.26 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ మాత్రం 100 రోజుల పాటు పని ద్వారా కేవలం 3,609 కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. * రాజంపేట మండలంలో పనిపత్రాలు 9,202 ఉంటే 15,035 మంది సభ్యులుగా ఉన్నారు. నూరు రోజుల పాటు 112 మంది పని పొందారు. * రాయచోటి మండలంలో క్రీయాశీలక పనిపత్రాలు 6,529 ఉండగా 10,092 మంది శ్రామికులు నమోదయ్యారు. ఇక్కడ ‘వంద’ రోజుల పని భాగ్యం 102 మందికి మాత్రమే దక్కింది. * మదనపల్లె గ్రామీణ మండలంలో 7,495 పని పత్రాలు ఉండగా 11,034 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ నూరు రోజులపాటు ఇద్దరే పని పొందారు.

కొరవడిన పర్యవేక్షణ...

ఉపాధిహామీ పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అధికారుల కొరవడింది. స్వేదం చిందించి పనులు చేసినా సకాలంలో వేతనాలు రావడం లేదు. ఈ కారణంగా చాలామంది ఆసక్తి చూపడం లేదు. నరేగా ఆశయం మేరకు ప్రతి కుటుంబానికి 100 రోజులు పూర్తి స్థాయిలో కల్పించడం లేదు. మరో రెండు నెలల్లోపు గడువు మిగిలి ఉంది.

మార్చిలోపు నూరు రోజులు పని కల్పిస్తాం

ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెంచుతాం. ఈ ఏడాది మార్చిలోపు మరికొన్ని కుటుంబాలకు నూరు రోజుల పాటు పని కల్పిస్తాం. మునుపటి కంటే కుటుంబంలో ఉన్న సభ్యుల్లో ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. సగటు వేతనం కూడా పెరిగింది.

మద్దిలేటి, పీడీ, డ్వామా, అన్నమయ్య జిల్లా
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని