logo

గురువులపై గుదిబండ!

ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 177 పనిదినాలు గడిచిపోయాయి. ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా పాఠశాలల నిర్వహణకు ఇప్పటివరకు కేవలం ఇరవై శాతం నిధులే విడుదల కావడం గమనార్హం.

Published : 21 Mar 2023 04:07 IST

విద్యాసంవత్సరం ముగుస్తున్నా పాఠశాలలకు అరకొర నిధులే
ప్రధానోపాధ్యాయుల మెడకు నిర్వహణ భారం
న్యూస్‌టుడే, కడప విద్య

పాతకడప జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 177 పనిదినాలు గడిచిపోయాయి. ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా పాఠశాలల నిర్వహణకు ఇప్పటివరకు కేవలం ఇరవై శాతం నిధులే విడుదల కావడం గమనార్హం. సుద్దముక్కల నుంచి విద్యుత్తు బిల్లుల వరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సొంత నిధులు ఖర్చు చేస్తుండడంతో ప్రభుత్వం నిధులెప్పుడు విడుదల చేస్తుందా అని ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా మరో ఇరవై శాతం నిధులు విడుదలయ్యాయని జిల్లా అధికార యంత్రాంగం చెబుతున్నా పాఠశాలలకు చేరలేదు.

ఈ విద్యాసంవత్సరంలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 3,238 విద్యాలయాలకు పాఠశాలల నిర్వహణ నిధుల కింద సుమారు రూ.8.47 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రెండు నెలల కిందట 20 శాతం నిధులు సుమారు రూ.1.69 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా మరో 20 శాతం నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని, ఒకట్రెండు రోజుల్లో పాఠశాలల ఖాతాలకు జమవుతాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మొత్తం 220 పనిదినాల్లో 177 పనిరోజులు ముగిసిపోయాయి. మిగిలిన 43 రోజుల్లో పూర్తిస్థాయిలో నిధులు విడుదలవుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సొంత నిధులు వెచ్చించి కొందరు, అప్పులు చేసి మరికొందరు ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను నిర్వహిస్తుండడం వారికి ఆర్థికంగా భారమవుతోంది. పూర్తిస్థాయిలో నిధుల విడుదలకు నెలలతరబడి ఎదురుచూడాల్సివస్తోంది. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఏఏ పాఠశాలలకు ఎంతెంత?

విద్యార్థుల సంఖ్య ఆధారంగా 20 మంది కన్నా ఎక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు రూ.10 వేలు, 100 మంది విద్యార్థులు దాటిన ప్రాథమిక పాఠశాలలకు రూ.50 వేలు, వంద మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలకు రూ.25 వేలు, వందమంది విద్యార్థుల సంఖ్య దాటితే రూ.50 వేలు, 500 మంది విద్యార్థుల సంఖ్య దాటితే రూ.75 వేలు, 1,000 మంది విద్యార్థుల సంఖ్య దాటితే రూ.లక్ష పాఠశాల నిర్వహణ నిధుల కింద సంవత్సర కాలానికి విడుదల చేస్తోంది.


చర్యలు తీసుకుంటున్నాం - డాక్టర్‌ అంబరం ప్రభాకర్‌రెడ్డి, ఏపీసీ, జిల్లా సమగ్రశిక్ష

పాఠశాలల నిర్వహణ నిధుల విడుదలకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో 20 శాతం విడుదల కాగా, తాజాగా మరో 20 శాతం నిధులొచ్చాయి. వాటిని ఆయా పాఠశాలల ఖాతాలకు జమ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని