logo

పర్యాటకశాఖ నిధులు వృథా!

సిద్దవటంలోని మట్లిరాజుల కోట జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం. జిల్లా వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చి తిలకిస్తుంటారు.

Published : 23 Mar 2023 04:49 IST

మట్లిరాజుల కోటలో విద్యుత్తు దీపాల తొలగింపు
- న్యూస్‌టుడే, సిద్దవటం

కోటలో తొలగించిన విద్యుత్తు స్తంభాలు, దీపాలు, ఇతర సామగ్రి

సిద్దవటంలోని మట్లిరాజుల కోట జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం. జిల్లా వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చి తిలకిస్తుంటారు. కోటలో విద్యుదీకరణ పనులు చేపట్టడంలో పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఉన్న దీపాలు వెలగడంలేదని తొలగించి పక్కన పడేశారు. పర్యాటకశాఖ లక్ష్యం నెరవేరకపోగా, ప్రభుత్వ నిధులు వృథా అయ్యాయి. మట్లిరాజుల కోటకు రాత్రివేళ విద్యుత్తు దీపాలతో వెలుగులు నింపి సందర్శకులకు కనువిందు చేయాలనే ఉద్దేశంతో పర్యాటకశాఖ అధికారులు 2004లో రూ.6 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో విద్యుదీకరణ పనులు చేపట్టారు. కోట లోపల, వెలుపల 45కు పైగా పోకస్‌ దీపాలు అమర్చారు. విద్యుదీకరణ పనులను ప్రారంభించిన రోజు మాత్రమే విద్యుత్తు కాంతులతో మట్లిరాజుల కోట మెరిసింది. ఒక రోజుకే కరెంటు ఎక్కువ ఖర్చు కావడంతో వీటికి ప్రత్యేకంగా నియంత్రిక, మీటరు ఏర్పాటు చేసుకోవాలంటూ ట్రాన్స్‌కో అధికారులు పర్యాటకశాఖ అధికారులకు తెలిపి కనెక్షన్‌ తొలగించారు. విద్యుత్తు బిల్లులు చెల్లించడానికి తమ వద్ద నిధులు లేవంటూ పురావస్తుశాఖ అధికారులు తిరస్కరించారు. అప్పటి కలెక్టరు చొరవ తీసుకుని విద్యుదీకరణ నిర్వహణ బాధ్యతను స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి అప్పజెప్పుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయ అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్తు వెలుగులు కరవయ్యాయి. అనంతరం కొన్ని దీపాలు చోరీ అయ్యాయి. మరికొన్ని ఆకతాయిల చేష్టలతో పగిలిపోయాయి. మిగతావి ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని ఇనుప స్తంభాలు తుప్పు పట్టి గాలి, వానకు నేలకూలాయి. మొదటి మండపం, రెండో మండపం మధ్యలో ఉన్న దీపాలు సందర్శకులకు అడ్డంగా ఉన్నాయంటూ కొన్నేళ్ల కిందట పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. కోట లోపల మిగిలిన మరికొన్ని దీపాలనూ తొలగించారు. కోట వెలుపల మాత్రమే కొన్నింటిని ఉంచారు. అధికారుల మధ్య సమన్వయం కొరవడడం, చొరవ చూపకపోవడంతో పర్యాటక శాఖ లక్ష్యం నెరవేరకపోగా, రూ.6 లక్షల నిధులు వృథా అయ్యాయి. ఈ విషయమై జిల్లా పురావస్తుశాఖ కార్యాలయ ఎంటీఎస్‌ స్వరూప్‌రామ్‌ను వివరణ కోరగా, కొన్నేళ్ల కిందట ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలు, దీపాలు దెబ్బతిన్నాయన్నారు. తుప్పు పట్టిన, ఉపయోగంలో లేని వాటిని తొలగించామని చెప్పారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని