logo

ఆస్తి పన్ను మోత

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని పురపాలక సంఘాలు, కడప నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ఆస్తి పన్ను మరింత పెరగనుంది. ఏటా 15 శాతం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, స్థానిక సంస్థలు ఆమోదముద్ర వేయడంతో భారం పడనుంది.

Published : 27 Mar 2023 06:11 IST

ప్రజలపై 15 శాతం అదనపు భారం
వచ్చే నెల నుంచి అమలు
డిమాండ్‌ నోటీసులకు కార్యాచరణ
ఈనాడు డిజిటల్‌, కడప

ప్రొద్దుటూరు పురపాలక సంఘం

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని పురపాలక సంఘాలు, కడప నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ఆస్తి పన్ను మరింత పెరగనుంది. ఏటా 15 శాతం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, స్థానిక సంస్థలు ఆమోదముద్ర వేయడంతో భారం పడనుంది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని తెచ్చిన సర్కారు, దాన్ని అమలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి పెంపునకు ఇప్పటికే అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. మొదటి ఆరు నెలలకు సంబంధించిన డిమాండ్‌ నోటీసుల (పన్ను తాఖీదులను) జారీకి సన్నాహాలు జరుగుతున్నాయి.

* కడప నగర ప్రజలపై పన్ను భారం రూ.33.98 కోట్ల నుంచి రూ.43.74 కోట్లకు పెరగనుంది. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలపై రూ.24 కోట్ల నుంచి రూ.29 కోట్ల భారం హెచ్చుకానుంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, రాజంపేట, రాయచోటి, మదనపల్లె, బి.కొత్తకోట పట్టణాల్లో ఇప్పుడున్న పన్ను కంటే 15 శాతం మేర అదనంగా పెరగబోతోంది. ఆస్తి పన్నును గతంలో అద్దె ప్రాతిపదికను ప్రామాణికంగా తీసుకుంటుండగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారంగా విధింపునకు శ్రీకారం చుట్టింది. ఈ విధానం 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. ప్రతి ఆరు నెలలకోసారి వసూలుకు నిర్ణయించింది. ఈ మేరకు డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తోంది. పాత పద్ధతిలో ఐదేళ్లకు ఒకసారి ఆస్తి పన్ను సవరించాలన్న నిబంధన ఉన్నా అది అమలయ్యేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు సవరించారు. నూతన విధానం కింద ఏటా పన్ను పెరుగుతూ వస్తోంది. దీంతో భవన యజమానులు గగ్గోలు పెడుతున్నారు. దీని ప్రభావంతో అద్దెలు పెంచాల్సి వస్తోందని వారంటున్నారు. పరోక్షంగా అద్దెకు ఉంటున్న వారికీ భారం తప్పడంలేదు. రానురాను పన్నులు మోయలేని భారంగా మారుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని చోట్లా కసరత్తు...

కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు కోసం ఏప్రిల్‌ 5వ తేదీ నాటి నుంచి అసెస్‌మెంట్దారులకు డిమాండ్‌ నోటీసులు అందజేయాలన్న లక్ష్యంతో పురపాలక రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను ఎవరికి ఎంత మేరకు పెరుగుతుందనే దానిపై ప్రస్తుతం లెక్కలు వేస్తున్నారు. యజమానులు సైతం పన్ను ఎంత మేరకు ఉంటుందోననే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డిమాండు నోటీసులను పరిశీలించుకున్న అనంతరం నివాసాలకు, వాణిజ్య సముదాయాలకు అద్దెలు పెంచాలని భావిస్తున్నారు. ఆదాయం పెంపులో భాగంగా రిజిస్ట్రేషన్‌ రుసుం ప్రభుత్వం పెంచుతూ వస్తోంది. ఈ మేరకు ఆస్తి పన్ను సైతం పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని