logo

పీలేరు ఆక్రమించేశారు!

పీలేరులో రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగింది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి హస్తం ఉంది.

Updated : 30 Mar 2023 06:57 IST

601 ఎకరాల కబ్జాపై వెలుగులోకి కలెక్టర్‌ నివేదిక
సీబీఐ విచారణకు తెదేపా నేత లోకేశ్‌ డిమాండు
దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే చింతల విన్నపం
అంతర్మథనంలో అధికార పార్టీ నాయక గణం

బోడుమల్లువారిపల్లె వద్ద ఆక్రమిత భూమి

పీలేరులో రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగింది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి హస్తం ఉంది. గత 20 ఏళ్లుగా తమ కుటుంబంతో పాటు తెదేపా హయాంలో ప్రభుత్వ భూముల వద్ద బోర్డులు ఏర్పాటు చేసి కాపాడగా ప్రస్తుతం వైకాపా నేతలు కబ్జా చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే న్యాయ విచారణ జరిపించాలి.

2021, జులై 3న సాక్ష్యాధారాలతో బయటపెట్టిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి


భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలి. లేనట్లయితే తప్పుడు సంకేతాలు వెళతాయి. నేను ఎన్టీఆర్‌ హయాం నుంచి నాలుగోసారి శాసనసభ్యుడిగా ఉన్నాను. మా తండ్రి కాలం నుంచి ఎక్కడా మా కుటుంబం భూములు కబ్జా చేయలేదు. పీలేరులో నారా లోకేశ్‌ చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చడానికి విచారణకు ప్రభుత్వాన్ని ఆదేశించాలి.  

ఇటీవల శాసనసభలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండు


‘యువగళం’ పాదయాత్రలో తాను చేసిన ఆరోపణలన్నింటికీ కట్టుబడి ఉన్నాను.  పీలేరు నియోజకవర్గంలో ల్యాండ్‌ మాఫియాకు సంబంధించిన వివరాలు బయటపెడుతున్నాం. మా పార్టీ చేసిన పోరాటాల ఫలితంగా వందలాది ఎకరాల భూకబ్జాలు వెలుగులోకి వచ్చాయి. ఆక్రమణల విషయంలో దమ్ముంటే సీఐడీ లేదా సీబీఐ విచారణ జరిపించాలి.

 సీఎం జగన్‌కు రాసిన లేఖలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌


పీలేరు వద్ద ఆక్రమిత భూములను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు (పాత చిత్రం)

పీలేరుతో పాటు పరిసర ప్రాంతాల్లో భూ ఆక్రమణలు ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయంగానూ సవాళ్లు... ప్రతి సవాళ్లకు దారితీసింది. ఈ వ్యవహారం తాజాగా తెరపైకి రావడంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్‌, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ నివేదికలు వెలుగుచూశాయి. నివేదికల ప్రకారం ప్రభుత్వ భూములు 601.37 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు ఆధికారికంగా బయటపడింది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ ప్రభుత్వ భూములు నేతల కంబంధ హస్తాల్లోనే ఉన్నాయి. నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు జారీ అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఈనాడు డిజిటల్‌, కడప


ఆ నివేదికలో ఏముందంటే?

అప్పటి కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పీలేరు ప్రాంతంలో జరిగిన ఆక్రమణలపై విచారణకు తహసీల్దార్ల నేతృత్వంలో ఆరు బృందాలను నియమించారు. పీలేరు, బోడుమల్లువారిపల్లె, దొడ్డిపల్లె, గూడరేవుపల్లె, ముడుపులవేముల, ఎర్రగుంట్లపల్లె ప్రాంతాల వారీగా రెవెన్యూ బృందాలను పంపి సమగ్ర విచారణ జరిపించారు. ఆక్రమిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు,  పక్కా గృహాల నిర్మాణం, సిమెంటు ఇటుకల తయారీ, తాగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూముల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.


రెవెన్యూ సిబ్బంది వైఫల్యం

ఆరు బృందాల విచారణ కమిటీ చేపట్టిన విచారణలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది వైఫల్యాన్ని నివేదికలో వివరించారు. ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తహసీల్దారు వి.పుల్లారెడ్డి, పూర్వ తహసీల్దారు కె.వెంకటరమణ, ఏఆర్‌ఐ అబ్దుల్‌ఖాదర్‌, ఎంఆర్‌ఐ భార్గవి, వీఆర్వోలు కె.శ్రీనివాసులు, ఎం.ప్రసాద్‌ బాబు, పి.రవిప్రసాద్‌, ఎల్‌.నవీన్‌కుమార్‌, కె.మురళీకృష్ణ, ఎన్‌.సురేష్‌ కుమార్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, ఎ.శాంతకుమార్‌ బాధ్యులుగా పేర్కొన్నారు.


కింకర్తవ్యం?

ఆక్రమణలపై తెదేపా కీలక నేతల ఆరోపణలు, స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యే సమగ్ర విచారణకు శాసనసభ సాక్షిగా డిమాండు చేయడం, కలెక్టర్‌ నివేదికను నారా లోకేశ్‌ బయటపెడుతూ సీఎం జగన్‌కు లేఖ రాయడంతో వైకాపాలో అంతర్మథనం మొదలైంది. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పుకోలేక తర్జభర్జనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ సాగుతున్నట్లు సమాచారం. వందలాది ఎకరాల్లో భూముల ఆక్రమణలు వెలుగులోకి రావడంతో ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసైన్‌మెంట్‌ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు విచారణ నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 6 గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు క్రయవిక్రయాల లావాదేవీలతో రెచ్చిపోయారని వివరించారు. చివరకు పెట్టుబడి పెట్టిన సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. భూ బదలాయింపులు లేకుండా స్వప్రయోజనాల కోసం భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని వివరించారు. వైకాపా అధికారంలో ఉండగా జరిగిన ఈ అక్రమానికి ఏ విధంగా పరిష్కారం చూపుతారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

పీలేరులో ఆక్రమిత భూమిలో  ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని