logo

మట్టి అక్రమ తవ్వకాలపై దాడులు

హంద్రీ-నీవా కాలువ పూడ్చేసి గుట్టలో అక్రమంగా మట్టి తవ్వేసి తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

Published : 01 Apr 2023 02:39 IST

వాహనాలు స్వాధీనం... పోలీసులకు ఫిర్యాదు

టిప్పర్‌ డ్రైవరును విచారిస్తున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు

మదనపల్లె గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే : హంద్రీ-నీవా కాలువ పూడ్చేసి గుట్టలో అక్రమంగా మట్టి తవ్వేసి తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పొక్లైన్‌, మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మట్టి అక్రమ తవ్వకాలు, హంద్రీనీవా కాలువ పూడ్చివేతలపై ‘హంద్రీనీవా పూడ్చేసి... మట్టినంతా దోచేసి’ శీర్షికన మార్చి 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి తహసీల్దార్‌ శ్రీనివాసులు స్పందించారు. ఆర్‌ఐ రెడ్డెప్ప, వీఆర్వోలు సాంబశివ, భరత్‌తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గ్రామీణ మండలం వలసపల్లె పంచాయతీ 150వ మైలురాయి సమీపంలో హంద్రీనీవా కాలువను పూడ్చేసి దారి ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమీపంలో గుట్టలో చేపట్టిన మట్టి తవ్వకాలని పరిశీలించారు. పొక్లైన్‌తో పాటు, అక్కడే ఉన్న మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాలకు కారకులైన వారు అక్కడి నుంచి పరారయ్యారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ పుంగనూరు మండలానికి చెందిన శ్యామ్‌కుమార్‌, మదనపల్లె పట్టణానికి చెందిన మధుసూదన్‌ అనుమతి లేకుండా గుట్టలో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి, వాహన యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తున్నట్లు తహసీల్దార్‌ పేర్కొన్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి డీఈఈ ఖాజాహుసేన్‌ దారి ఏర్పాటు చేసిన హంద్రీనీవా కాలువను, అటవీశాఖ డీఆర్‌వో ప్రకాశ్‌ గుట్ట సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని