logo

విద్యుత్తు వినియోగదారులపై... మరో బాదుడు!

‘ఏ జన్మలో చేసుకున్న పాపమో అనుభవిస్తున్నాం.’ అనే మాటలు తరచూ వింటుంటాం. ప్రస్తుతం విద్యుత్తు బిల్లులు చూసి వినియోగదారులు ‘ ఎవరో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు మేము కష్టాలు అనుభవిస్తున్నాం’ అంటూ ఏకరవు పెడుతున్నారు.

Published : 04 May 2023 03:06 IST

ట్రూఅప్‌తోపాటు ఎఫ్‌పీపీసీఏ కింద అదనపు భారం
ఈనాడు డిజిటల్‌, కడప

అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఓ వినియోగదారుడికి బుధవారం జారీ అయిన బిల్లులో ట్రూ అప్‌ ఛార్జీల కింద రూ.25.82 పైసలు పేర్కొనగా, ఎఫ్‌పీపీసీఏ కింద రూ.28.04 పైసలు అదనంగా భారం మోపారు.


వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో కిరాణా దుకాణం నడుపుతున్న ఓ వ్యాపారికి ఏకంగా ఎఫ్‌పీపీసీఏ కింద రూ.870 విధించారు. ట్రూ అప్‌ ఛార్జీల కింద రూ.1,200 భారం పడింది. దుకాణం నడవడం అంతంతమాత్రంగా ఉండగా, విద్యుత్తు ఛార్జీల భారం భారీగా పెరిగిందంటూ వ్యాపారి లబోదిబోమంటున్నారు.


‘ఏ జన్మలో చేసుకున్న పాపమో అనుభవిస్తున్నాం.’ అనే మాటలు తరచూ వింటుంటాం. ప్రస్తుతం విద్యుత్తు బిల్లులు చూసి వినియోగదారులు ‘ ఎవరో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు మేము కష్టాలు అనుభవిస్తున్నాం’ అంటూ ఏకరవు పెడుతున్నారు. సాధారణంగా నెల ప్రారంభం నుంచి విద్యుత్తు వినియోగదారులకు బిల్లుల జారీ జరుగుతుంది. ఈ మేరకు ఏప్రిల్‌కు సంబంధించిన విద్యుత్తు వినియోగ బిల్లులను ఎస్పీడీసీఎల్‌ మంగళవారం నుంచి జారీ చేస్తోంది. బిల్లును చూసి ప్రతి వినియోగదారుడు షాక్‌కు గురవుతున్నారు. గతంలో ట్రూఅప్‌ ఛార్జీలే భారంగా అనిపిస్తుండగా తాజాగా ఎఫ్‌పీపీసీఏ పేరిట మరో భారం బిల్లులో కనిపిస్తోంది. అన్ని రకాల సర్వీసులపై ఈ భారం స్పష్టంగా కనిపిస్తోంది. బిల్లు చేతిలోకి తీసుకున్న వినియోగదారులు లబోదిబోమంటూ ఇతరులకు చూపిస్తూ ఈ భారమేంటో తెలపాలంటూ ఆరా తీయడం సర్వత్రా కనిపిస్తోంది.

విద్యుత్తు బిల్లులో ఎఫ్‌పీపీసీఏ పేరిట అదనపు ఛార్జీ

ఎఫ్‌పీపీఎస్‌ఏ అంటే?

ఇంధనం, విద్యుత్తు కొనుగోలు ఖర్చు సర్దుబాటు(ఎఫ్‌పీపీసీఏ)గా ఎస్పీడీసీఎల్‌ బిల్లులో ప్రత్యేక కాలంగా పేర్కొని ఛార్జీ విధిస్తోంది. గత నెల వరకు జారీ అయిన బిల్లులో వినియోగించుకున్న యూనిట్లకు ఛార్జీతో పాటు స్థిర ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ట్రూ అప్‌ ఛార్జీలు విధిస్తుండగా తాజాగా ఎఫ్‌పీపీసీఏ ఛార్జీల పేరిట అదనంగా ఈ నెల నుంచి మరో 12 నెలల పాటు వినియోగదారులపై బాదనున్నారు. రానున్న రోజుల్లో ఈ భారం మరింత పెరగనుంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట ఉమ్మడి కడప జిల్లాలో రూ.210 కోట్లను విద్యుత్తు వినియోగదారుల నుంచి ఎస్పీడీసీఎల్‌ వసూలు చేయనుంది. 2014 నుంచి 2019 మధ్య అయిదేళ్లపాటు వినియోగించిన విద్యుత్తుకు సర్దుబాటు ఛార్జీలు ట్రూ అప్‌ పేరిట వసూలు చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వినియోగదారులపై భారం పడుతుండగా, తాజాగా మరో 12 నెలల పాటు అదనపు భారం మోపనుంది. విద్యుత్తు కొనుగోలు అంచనాలు, వాస్తవ విద్యుత్తు కొనుగోలు భారం పెరిగిన కారణంగా అదనపు భారం పడిందని.. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు వినియోగదారుల నుంచి వసూలుకు అనుమతించాలని ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. దీనిపై విచారించిన ఈఆర్‌సీ 2021-22లో అప్పటి వినియోగం ఆధారంగా 2024, మార్చి వరకు బిల్లులో కలిపి డిస్కంలు వసూలుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఎఫ్‌పీపీసీఏ పేరిట అదనపు భారం వినియోగదారులపై పడింది. ఓ వైపు ట్రూఅప్‌, మరో వైపు ఎఫ్‌పీపీసీఏ పేరిట వినియోగదారులపై బాదేస్తున్నారు. అద్దె భవనాల్లో ఉన్న వారైతే ఎవరో వాడుకున్న కరెంటుకు మేమెందుకు బిల్లు చెల్లించాలంటూ యజమానులతో వాదనకు దిగుతున్నారు. కొందరు సర్దుబాటు చేసుకుంటుండగా, మరికొన్నిచోట్ల వాగ్వాదాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారం ఇటు అన్నమయ్య, అటు వైయస్‌ఆర్‌ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వినియోగదారులపై దొంగ దెబ్బ కొడుతోందని వినియోగదారులు నిష్ఠూరపోతున్నారు.

గృహ సర్వీసులు - 9,05,066
వాణిజ్య - 93,482
పరిశ్రమలు - 686
కుటీర పరిశ్రమలు - 6,400
వీధి దీపాలు, తాగునీటి పథకాలు - 8,996
ఇతరాలు - 7,222
వ్యవసాయ సంబంధిత - 1,82,718


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు