logo

జాబితా తొలగింపు సరే... ఆన్‌లైన్‌ నమోదెట్టా!

చుక్కల భూముల నుంచి విముక్తి కలిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కింది స్థాయిలో ఆశించిన ఫలితాలు పొందలేదు.

Published : 06 Jun 2023 02:41 IST

ఆందోళనలో చుక్కల భూముల రైతులు
శాశ్వత పరిష్కారం అంతా మిథ్య
న్యూస్‌టుడే, చాపాడు

చుక్కల భూమి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం రైతులకు అందజేసిన పత్రం

చుక్కల భూముల నుంచి విముక్తి కలిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కింది స్థాయిలో ఆశించిన ఫలితాలు పొందలేదు. ఎన్నో ఏళ్లుగా నిషేధిత జాబితాలో ఉన్న వీటికి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేశామని ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు గొప్పలు చెప్పారని, వాటిలో ఇంకా లొసుగులున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకు జిల్లాలో తొలిసారిగా చాపాడు మండలంలో సంబంధిత భూములకు విముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. మండలంలో మొత్తం 3,623 ఎకరాల చుక్కల భూములుండగా, 3,755 మంది రైతులకు విముక్తి పత్రాలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలగింపు పత్రాలు అందుకున్న కొందరు రైతులు మైదుకూరు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయంలో సంప్రదిస్తే వీటిపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని తిరిగి వెనక్కు పంపడంతో వారు అయోమయంలో పడ్డారు.

* వెబ్‌ల్యాండ్‌ (ఆన్‌లైన్‌లో) నమోదైన భూములకు మాత్రమే రైతులకు తొలగింపు పత్రాలిచ్చారు. వారికి మాత్రమే క్రయ విక్రయాలకు, వారసత్వ రీత్యా మార్పులు చేర్పులకు అవకాశం వచ్చినట్లయింది. నమోదుకాని భూములకు సంబంధించి రైతులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఈ విషయమై సంబంధిత రైతులు రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే మీవద్ద ఉన్న డాక్యుమెంట్స్‌ తీసుకురావాలని చెపుతారు. వారసత్వరీత్యా వస్తున్న భూములకు డాక్యుమెంట్స్‌ ఎలా వస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరికొందరికి డాక్యుమెంట్స్‌ అన్నీ ఉన్నా పెద్ద మొత్తంలో చేయి తడిపితేనే చక్కబెడుతున్నారు. ఈ విషయాలు ఎక్కడ బహిర్గతమైనా తమ భూములకు ఏదొక మెలికపెట్టి ఇబ్బందులకు గురి చేస్తారని మౌనంగా ఉంటున్నారు. దీంతో వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్‌ చట్ట ప్రకారం భూమి వెబ్‌ల్యాండ్‌లో ఉండి, 1బి నమూనా వస్తేనే, సబ్‌రిజిస్ట్రారు అంగీకరిస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించినా, 1బి రాకపోయినా రిజిస్ట్రేషన్‌ చేయలేమని తేల్చి చెపుతున్నారు. ప్రస్తుతం మైదుకూరు-ప్రొద్దుటూరు రహదారి వెంట భూముల ధరలకు రెక్కలు పెరిగాయి. మరోపక్క విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం పనులు ఊపందుకోవడంతో స్థానికంగా భూములు మార్కెట్‌లో రూ.కోట్లలో విలువ చేస్తున్నాయి. చుక్కల భూముల సమస్య తీరిపోతే క్రయ విక్రయాలు జోరుగా పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్‌ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం సమకూరనుంది.

సవరణలుంటే తహసీల్దారును సంప్రదించండి: ప్రధానంగా 22ఏ నుంచి తొలగించడం, రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశం. తొలగింపు పత్రం తీసుకుని రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే అక్కడ ఏదొక డాక్యుమెంటు లేని వారిని వెనక్కు పంపుతారు. వారసత్వంగా వచ్చిన భూములకు ఏదొక డాక్యుమెంట్లుంటాయి. మ్యాన్యువల్‌ 1బి ఉంటుంది. వివాదంలో ఉన్నవాటిని ఎంటర్‌ చేయం. చిన్న చిన్న సవరణలకు తహసీల్దారును సంప్రదిస్తే చాలు.

గణేష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌, వైయస్‌ఆర్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని