logo

కరవు సీమగా మార్చేసిన పాపం జగన్‌దే

‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్‌దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు.

Updated : 28 Mar 2024 06:38 IST

మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే బాధ్యత నాది
ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం, గ్రామీణ, రాయచోటి

మదనపల్లెలో జరిగిన రోడ్‌షోలో అశేష జనానికి  అభివాదం చేస్తున్న  చంద్రబాబు

‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్‌దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. మదనపల్లె పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. రాయల సీమకు గోదావరి నీళ్లు తీసుకురావాలనేదే తన సంకల్పమని పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలపై మోపిన భారాన్ని, జగన్‌ ప్రభుత్వం చేసిన దోపిడీని మే 13న ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు. రానున్న 47 రోజులు చాలా కీలకమని, గత అయిదేళ్లు రాష్ట్ర ప్రజలను బానిసలుగా చూశారని, వారి అంతు చూసే సమయం ఆసన్నమైందన్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నానని, తాను, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా పనిచేశామని, జగన్‌ లాంటి సీఎంను ఎన్నడూ చూడలేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ నాయకులే ఇంటికొచ్చి ఓట్లు అడిగేవారని, ఈ సారి ప్రజలే రాక్షస పాలనను సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారన్నారు.

నాయకులతో మాట్లాడుతున్న చంద్రబాబు

అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

‘ఎంతో చరిత్ర గల మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేసే బాధ్యత నాది. అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తా. పెండింగ్‌లో ఉన్న సమ్మర్‌స్టోరేజి ట్యాంకుల పనులు పూర్తి చేయించి తాగునీటి ఎద్దడి లేకుండా 24 గంటలు నీరివ్వడానికి శ్రీకారం చుడతాం’  అని చంద్రబాబు పేర్కొన్నారు. . ‘మదనపల్లెలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. వారి కోసం తెదేపా ఏం చేసిందో? వైకాపా ఏం  చేసిందో చర్చించేందుకు సిద్ధమా? అని సవాలు విసిరారు. ‘మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలి, భాజపా, జనసేన, తెదేపా మిత్రపక్షాలుగా వస్తాం, మీకెవరికీ అన్యాయం జరగదు, మీ హక్కులను కాపాడే బాధ్యత నాది’ అని భరోసా కల్పించారు. ‘ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి... మీకు అండగా నేనుంటా... షాజహాన్‌బాషాను గెలిపించుకోండి. గతంలో ఏం చెప్పానో దానికి రెట్టింపు సహకారం అందిస్తా’ అని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

బెంగళూరు రోడ్డులో చంద్రబాబును చూడడానికి రహదారిపైకి వచ్చి చేతులు ఊపుతున్న మహిళలు

తెదేపాతోనే మైనార్టీల సంక్షేమం

మైనార్టీల సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా నాయకులు చెప్పే మాటలు నమ్మి మైనార్టీలు మోసపోకూడదన్నారు.  తెదేపా అధికారంలోకి రాగానే రైతులకు రాయితీలిస్తామని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బహిరంగ సభలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు, నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు షాజహాన్‌బాషా, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, చల్లాబాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, నాయకులు విద్యాసాగర్‌, బోడిపాటి శ్రీనివాస్‌, శివప్రసాద్‌, మస్తాన్‌, పఠాన్‌ఖాదర్‌ఖాన్‌, రఫీ, రామకృష్ణాచారి, మధుబాబు పాల్గొన్నారు.

నారా హమారా’ అంటూ ప్లకార్డులతో యువత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని