logo

మైనార్టీ విద్యకు గ్రహణం!

కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి

Published : 29 Mar 2024 05:15 IST

శాఖల మధ్య కొరవడిన సమన్వయం

ఆగిపోయిన రూ.కోట్ల విలువైన పనులు

అమృతానగర్‌లో పిల్లర్లకే పరిమితమైన మైనార్టీ ఉర్ధూ జూనియరు కళాశాల భవనం

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ: కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా 2018-19లో మైనార్టీ సెక్టోరియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎంఎస్‌డీపీ) కింద మైనార్టీ బాలబాలికలకు వేర్వేరుగా గురుకుల పాఠశాలలకు రూ.36 కోట్లు, సద్భావన కల్యాణ మండపానికి రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. నిధులు అందుబాటులో ఉన్నా స్థలాల వివాదంతో ఇంతవరకు భవన నిర్మాణాలు చేపట్టలేని దుస్థితి నెలకొంది. మెరుగైన విద్యను అందించడంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో చిత్తశుద్ధి కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఎస్‌డీపీ పథకానికి ప్రధాని జనవికాస్‌ యోజన (పీజేవీఎస్‌)గా మార్పు చేశారు. 2020లో మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. 2021లో పెన్నానది సమీపంలోని చౌడూరు తోపు భూములు సర్వేనంబరు 700/ 1, 2లో 4.80 ఎకరాలు రెవెన్యూ అధికారులు కేటాయించారు. పనుల మొదలు పెట్టేందుకు ఏపీఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) డీఈ, అధికారులు వెళ్లగా సాగు భూములను ఖాళీ చేసేది లేదని రైతులు ఖరాఖండిగా చెప్పారు. మైనార్టీ, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ అధికారుల మధ్య సమన్వయం లేక మైనారిటీ విద్యకు గ్రహణం పట్టింది. మరోవైపు రూ.18 కోట్లతో చేపట్టనున్న బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు జారీ చేసినా షెడ్యూళ్లు దాఖలు కాలేదు.

 అసంపూర్తిగా కళాశాల

 అమృతానగర్‌లో పీజేవీఎస్‌ కింద రూ.3.60 కోట్లతో చేపట్టిన మైనార్టీ జూనియరు కళాశాల నిర్మాణానికి నిధుల కొరతతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. సుమారు 25 సెంట్ల స్థలం ఖరారు, టెండరు ప్రక్రియలో జాప్యంతో మూడేళ్ల కిందట జీ+1 పద్ధతిలో నిర్మాణాలు ప్రారంభించారు. పనులు ఏపీఈడబ్ల్యూఐడీపీకి అప్పగించారు. ప్రస్తుతం పునాదితోపాటు, కాంక్రీటు దిమ్మెల ఏర్పాటు పనులు మాత్రమే చేపట్టారు. ఇప్పటికే పూర్తయిన బిల్లులకు డబ్బులు ఇవ్వకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు. రూ.80 లక్షలతో పూర్తయిన పనులకు పంపిన బిల్లులకు ఇంతవరకు నిధులు చెల్లించ లేదు. దీంతో రెండేళ్లుగా గుత్తేదారు పనుతు చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలు, కంప చెట్లు పెరిగిపోతున్నాయి. మున్సిపల్‌ గదుల్లోని ఉర్ధూ జూనియర్‌ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణ పనులు నిలిచి పోవడంతో తల్లిదండ్రులు నిరాశ చెందారు. రూ.కోటితో మైనార్టీ వర్గాలకు సద్భావన కల్యాణ మండపం ఏర్పాటుకు స్థలం ఖరారు కాలేదు. టెండర్లు జారీ చేసినా పలుసార్లు షెడ్యూళ్లు దాఖలు కాలేదు.

సమస్యలు వాస్తవమే

మైనార్టీ గురుకుల పాఠశాలలకు స్థల వివాదంతో నిర్మాణాలు చేపట్టలేదు. బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల నుంచి గుత్తేదారు తప్పుకొన్నారు. బాలికల భవనానికి టెండరుకు షెడ్యూలు దాఖలు కాలేదు. సద్భావన కల్యాణ మండపానికి స్థలం ఖరారు కాలేదు. మరోవైపు పలుదఫాలుగా టెండరు జారీ చేసినా గుత్తేదారులు ముందుకు రాలేదు. మైనార్టీ ఉర్దూ జూనియరు కళాశాలకు నిధుల కొరత ఉంది.
-గురివిరెడ్డి, డీఈ, ఏపీఈడబ్ల్యూఐడీపీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని