logo

స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు

పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు.

Published : 23 Apr 2024 05:27 IST

నామినేషన్ల సందర్భంగా పక్షపాత ధోరణి

కమలాపురం నామినేషన్‌ కేంద్రం సమీపంలో పోలీసులను తోసుకువస్తున్న వైకాపా కార్యకర్తలు

ఈనాడు, కడప: పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వచ్చే పక్షంలో చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. తెదేపా వారు వచ్చే పక్షంలో నిబంధనలకు కచ్చితంగా పాటిస్తున్నారు. వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి వైఎస్‌ అవినాష్‌రెడ్డి కలెక్టరేట్‌కు రాగా, ఆయన వెంట పలువురిని అనుమతించారు. నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వాహనాలను నిలిపేసి అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే హాజరుకావాల్సి ఉంది. ఈ నిబంధన అవినాష్‌రెడ్డి విషయంలో పోలీసులు పాటించలేదు. కాంగ్రెస్‌, తెదేపా అభ్యర్థులుగా షర్మిల, భూపేష్‌రెడ్డి నామినేషన్‌ వేసే సమయంలో నిబంధనల మేరకు అనుమతించారు. ఇదే తంతు రాయచోటిలో తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ వేసే సమయంలో పట్టుగా వ్యవహరించగా, అదే వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి విషయంలో సడలింపులిచ్చారు. ప్రొద్దుటూరులో వైకాపా అభ్యర్థికి అనుకూలంగా ప్రవర్తించడంపై పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. కమలాపురంలో పోలీసులు నియంత్రిస్తున్నా వైకాపా కార్యకర్తలు నామినేషన్‌ కేంద్రం వైపునకు దూసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులే అన్ని కేంద్రాల్లోనూ చోటుచేసుకున్నాయి. తంబళ్లపల్లె నామినేషన్‌ కేంద్రానికి అధిక సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో సహించని పోలీసులు లాఠీఛార్జికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై పెద్ద దుమారం చెలరేగింది. తెదేపా వారిపై కేసులు సైతం నమోదు చేశారు. ఇదే విధానం వైకాపా వారి పట్ల అమలు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని