logo

ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!

‘జాబ్‌ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్‌ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

Updated : 24 Apr 2024 04:37 IST

హేతుబద్ధీకరణ పేరిట 800 ఉపాధ్యాయ పోస్టులకు మంగళం
డీఎస్సీలో తక్కువ ఖాళీలు చూపి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
న్యూస్‌టుడే, కడప విద్య

‘జాబ్‌ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్‌ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో యువత ఉద్యోగాల్లేక ఆవేదన చెందుతున్నారు. వైకాపా ప్రభుత్వ చర్యలతో డీఎస్సీలోనూ జిల్లా నుంచి తక్కువ ఖాళీలు చూపాల్సిన పరిస్థితి నెలకొంది. నమ్మకద్రోహంతో వందల పోస్టులు రద్దు చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల పోస్టుల క్రమబద్ధీకరణ తదితర చర్యలతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అధిక సంఖ్యలో మిగులు పోస్టులు చూపింది. ఉన్నత పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేసి మూడో తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ ప్రచారం చేసింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో 1,800 ఎస్జీటీ పోస్టులను సర్‌ప్లస్‌ పోస్టులుగా గుర్తించారు. వాటిల్లో 1,000 పోస్టులు ఖాళీవి కాగా, 800 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం వివిధ రూపాల్లో వినియోగించుకోవాల్సిన జాబితాలో ఉంచారు. అదే సమయంలో అటు ఉపాధ్యాయులను, ఇటు నిరుద్యోగులను ఆందోళన కలిగించేవిధంగా ప్రభుత్వం నూతన జీవోలను తీసుకొచ్చింది. వీటివల్ల ఆయా జిల్లాల్లో కొత్త పోస్టుల భర్తీ పక్కనబెట్టి, ఏ జిల్లాలో ఎన్ని రద్దయ్యాయి అని రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జీవో 155తో ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా 113 సర్‌ప్లస్‌ ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత  ఉద్యోగోన్నతులలో భాగంగా సర్‌ప్లస్‌ ఎస్జీటీ విభాగంలోని 800 మందిలో స్కూల్‌అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్న పోస్టులనూ ఇదే విధంగా రద్దుచేసింది. రాష్ట్రం ఒక యూనిట్‌గా తీసుకుని కర్నూలు జిల్లాలో స్కూల్‌అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థికశాఖ ఆమోదం పొందేందుకు ఇలా చేశారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా సుమారు 800 పోస్టులు రద్దయ్యాయి.

ఇక్కడ బదలాయించకుండా పక్క జిల్లాకు..

రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా విద్యార్థుల సంఖ్య లేదనే కారణంతో ఎస్జీటీ పోస్టులు భారీగా రదు ్దచేశారు. ఉమ్మడి కడప జిల్లాలో రద్దు చేసిన సుమారు 800 పోస్టులను, ఇక్కడే విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు బదలాయించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కర్నూలు జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా మంజూరు చేయాల్సిన పోస్టులకు బదలాయింపు చేశారు. దీంతో అక్కడ వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఇక్కడ మాత్రం తగ్గిపోయింది. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో అంతకుముందు 400 వరకు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు 700కు చేరాయి. ఈ నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు నాన్చి డీఎస్సీ ప్రకటించింది. పెద్ద ఎత్తున పోస్టులుంటాయని నిరుద్యోగులు ఆశిస్తే తక్కువ ఖాళీలు చూపడంతో విస్మయానికి గురయ్యారు. జగనన్న ప్రభుత్వం తమను వంచిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని