logo

ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్‌... కార్మికుల బతుకులు కూల్చేశావ్‌..!

జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి.

Updated : 04 May 2024 06:14 IST

సీఎం జగన్‌ విధానాలతో మారని శ్రామికుల తలరాత
ఇసుక కొరతతో భవన నిర్మాణాలపై తీవ్ర ప్రభావం
సంక్షేమ పథకాలనూ నిలిపేసిన వైకాపా ప్రభుత్వం

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు కన్నీళ్లే మిగిలాయి. కార్మిక సంక్షేమాన్ని సీఎం జగన్‌ పూర్తిగా విస్మరించి నిర్వీర్యం చేశారు. జగన్‌ జమానాలో కార్మికులకు ఉపాధి కరవై బతుకు భారమైంది. అర్ధాకలి బతుకులతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. వైకాపా సర్కారు నూతన ఇసుక విధానం అమల్లోకి తీసుకురావడంతో ధరలు అమాంతం పెరిగాయి. రేవుల్లో అదనపు దోపిడీ పర్వం కొనసాగుతోంది. మరోవైపు సిమెంటు, ఇనుము ధరలు కొండెక్కాయి. ప్రభుత్వ రంగంలో అనుమతిచ్చిన భవనాల పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. ప్రైవేటు రంగంలోనూ ప్రోత్సాహం లేదు. స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అమలు చేయని సంక్షేమ పథకాలతో స్వేదం చిందించే కార్మిక లోకం కకావికలమైంది. గత  తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, రాయితీలకు వైకాపా సర్కారు గండి కొట్టి నిలిపేసింది. మరోవైపు పన్ను రూపంలో వసూలు చేసిన సొమ్ములను ఇతర అవసరాల నిమిత్తం ప్రభుత్వం దారి మళ్లించి నిలువునా దగా చేసింది.

న్యూస్‌టుడే, కడప

రాజంపేట మార్కెట్‌ వద్ద పనుల కోసం భవన నిర్మాణ కార్మికుల పడిగాపులు

జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచాయి. ఊర్లోనే చేతినిండా పనులు లభించేవి. కాలక్రమేణా ప్రతికూల వాతావరణంతో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. పనుల్లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఎంతోమంది సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర బడుగు వర్గాలు సొంతూరు నుంచి పట్టణం వైపు వలస వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ పనులు చేయడానికి వెళ్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజా మద్దతుతో వైకాపా అధికారంలోకి వచ్చింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ, రాయితీ పథకాలను వర్తింపజేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ప్రమాదకర పనులు చేస్తున్న కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ద్వారా సాయం అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. వాస్తవంగా గత ప్రభుత్వ పాలనలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను వైకాపా సర్కారు పక్కన పెట్టేసింది. పాలకుల పాపం.. కార్మికుల కుటుంబాలకు శాపంగా మారింది.

సంక్షేమం పథకాలకు ఎగనామం

  • భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. గతంలో ఇంట్లో భార్య, కుమార్తె, కోడలు కాన్పు కోసం ఆసుపత్రిలో చేరితే రూ.20 వేలు ఆర్థిక సాయం అందేది. రెండు ప్రసవాలకు ఇలా తోడ్పాటునందిస్తూ వచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేశారు.
  • ఇంట్లో పెళ్లి జరిగితే ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించేవారు. సీఎం జగన్‌ పాలనా పగ్గాలు చేతపట్టిన తర్వాత తొలి మూడేళ్లు అమలు చేయలేదు. ఆ తర్వాత కల్యాణమస్తు పేరిట పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే కనీస విద్యార్హత తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలతో చాలా మందికి లబ్ధి అందని దైన్యం నెలకొంది.
  • గతంలో సహజ మరణం చెందితే రూ.3 లక్షలు, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.5 లక్షలు, గాయపడితే రూ.50 వేలు బీమా సాయం అందేది. కుటుంబంలో ఎవరైనా ప్రమాదం బారిన పడి శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నా ప్రభుత్వం నుంచి పైసా సాయం అందటం లేదు. జగన్‌ ఏలుబడిలో కార్మికశాఖ ద్వారా ఎలాంటి సంక్షేమ, రాయితీలు వర్తింపజేయకుండా ఎగనామం పెట్టారు.

ఏం తినాలి... ఎలా బతకాలి?

  • గతంలో గ్రామాలు, పట్టణాల సమీపంలోనే ఇసుక రేవులు ఉండేవి. వీటిని వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు అస్మదీయుల ఆదాయం పెంపు కోసం ఏకంగా నదులను పంచేశారు. తవ్వుకోండి.. జేబులు నింపుకోండి అన్న ధోరణితో ప్రభుత్వం అనుమతిచ్చింది. సైకతం ధరలకు రెక్కలొక్కాయి.
  • నాలుగేళ్ల కిందట 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాలకు ట్రాక్టరు ధర రూ.2,500 లోపే ఉండేది. సీఎం జగన్‌ పాలనలో రూ.6 వేలకు పైగా పలుకుతోంది. అది కూడా సవ్యంగా దొరకడం లేదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టిప్పర్లు, లారీల్లో తరలిస్తున్నారు.  
  • పేదల సొంతిల్లు కల సాకారం చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్నమయ్య జిల్లాలో 75,680 గృహాలకు అనుమతి ఇవ్వగా 32,008 పూర్తయ్యాయి. ఇక్కడ 553 లే అవుట్లు ఏర్పాటు చేసినా లబ్ధిదారులు నిర్మాణాల కోసం పెద్దగా ముందుకు రాలేదు.
  • బీమా పథకాన్ని తీసుకొచ్చినా కుటుంబ పెద్దకే లబ్ధి కలిగేలా మార్గదర్శకాలు తీసుకొచ్చారు. ఇలా చేయడంతో పెద్దగా మేలు జరగడంలేదు. పిల్లల చదువులకు భరోసా లేకుండాపోయింది. వ్యాధుల నివారణకు ఆరోగ్యశ్రీలో ప్రయోజనం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. బిల్లుల గోలతో కార్పొరేట్‌ వైద్యాలయాలు వైద్యం అందించడానికి మునుపటిలా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  
  • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రాలు, పాల శీతలీకరణ కేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణం కోసం పచ్చాజెండా ఊపారు. క్షేత్రస్థాయిలో చూస్తే నత్తనడకన సాగాయి. నిర్దేశిత గడువు ముగిసి రెండేళ్లు దాటినా పూర్తవ్వలేదు. కాసుల కటకటతో ప్రగతి పడకేసింది. ఈ ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై చూపింది. చేతినిండా పని దొరకలేదు. ఏం తినాలి. ఎలా బతకాలంటూ కార్మికులు ఆక్రోశిస్తున్నారు.

దర్జిపల్లి శివారులో పెన్నానదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు (పాత చిత్రం)

కరోనా వేళ... జీవనం కష్టం

  • రెండేళ్ల కిందట కరోనా పంజా విసిరింది. కొవిడ్‌-2019 విజృంభించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భవన నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఆ సమయంలో పనుల్లేకుండాపోయాయి. చాలా మంది కుటుంబ జీవనం కోసం నానా తంటాలు పడ్డారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కార్మికుల బతుకు బండి భారమైంది. ఎంతోమందికి కడుపు నిండా తిండి లేకుండాపోయింది. సంసార నావను ముందుకు నడిపించలేక ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయినా సీఎం జగన్‌ తోడ్పాటునందించలేదు.
  • ప్రధానమంత్రి కల్యాణ్‌ యోజన కింద భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధుల నుంచి ప్రతి కార్మికుడికి రూ.5 వేలు సాయం అందించాలని కేంద్రం ప్రకటించింది. కార్మిక శాఖ అధికారులు కూడా దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర వివక్ష చూపింది. ఎవరికీ ప్రయోజనం కల్పించలేదు. మాటలతో మభ్యపెట్టి చేతులెత్తేసింది. వైకాపా పాలనలో చివరికి కన్నీళ్లే మిగిలాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ హయాంలో మా తలరాత ఏమాత్రం మారలేదని కార్మికులు వాపోతున్నారు.

చతికిలపడిన నిర్మాణ రంగం

ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణరంగం చతికిల పడింది. గత ఐదేళ్లుగా  ఇసుక సమస్యతో కార్మికులకు పనిలేకుండాపోయింది. ఇసుక ధరలతో భవన నిర్మాణాలు తగ్గుముఖం పట్టాయి. కార్మికులకు వారంలో రెండు లేదా మూడు రోజులే పని దొరుకుతోంది.

సి.ప్రసాద్‌, మదనపల్లె


కర్ణాటకు వలసబాట - సుధాకర్‌, మదనపల్లె

వైకాపా పాలనలో కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశారు. ఇసుక ధరలు పెరగడంతోపాటు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. వేల మంది కార్మికుల్లో వందల మందికి మాత్రమే పనులు దొరుకుతున్నాయి. మిగిలిన వారు ఇతర పనులకు కర్ణాటకు వలస పోతున్నారు.

ఇసుక బంగారమైంది -రాజేంద్ర, బోడుమల్లువారిపల్లె

తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా లభించేది. ట్రాక్టరు అద్దెలు చెల్లించి మొత్తం లోడు రూ.1,500లోపే దొరకడంతో కూలి పనులు పుష్కలంగా దొరికేవి. వైకాపా ప్రభుత్వంలో ఇసుక బంగారమైంది. ట్రాక్టరు ఇసుక రూ.ఐదు వేలకుపైమాటే. దీంతో భవన నిర్మాణాలు మందగించడంతో పనులు దొరకడంలేదు.

పనులు దొరకడంలేదు - ఎస్‌.హనుమంత్‌నాయక్‌, గుత్తి

మాకు గతంలో నెలంతా పని దొరికేది. ఇప్పుడు కనీసం పదిరోజులు కూడా దొరకడం గగనమైంది. స్థానికంగా పనులు దొరుకుతాయని భార్యాబిడ్డలతో గుత్తి నుంచి వలస వచ్చాం. ఎక్కడా ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇసుక ధర పెరిగిపోవడం కూలీలపై ప్రభావం పడింది. వైకాపా ప్రభుత్వ తీరుతో పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.

అప్పులపాలవుతున్నాం  - ఆర్‌. ఓబులేశు, రైల్వేకోడూరు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనుల్లేక రోడ్డున పడ్డాం. కుటుంబపోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఒకరోజు పని దొరికితే వారం రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఇసుక, దొరకకపోవడం, ఇతర సామగ్రి ధరలు పెరగడంతో పనులు మందగించాయి. ఈ రోజు ఎలా గడుస్తుందోనని దిగులు చెందాల్సి వస్తోంది.

నరకం అనుభవిస్తున్నాం -చంద్ర, రాజంపేట

అయిదేళ్ల వైకాపా పాలనలో నరకం అనుభవిస్తున్నాం. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు సైతం పనుల్లేక ఇతర పనులకు వెళ్లిపోతున్నాం. ట్రాక్టరు ఇసుక రూ.800 నుంచి రూ.4,500కు పెంచేయడంతో పనులు జరగడంలేదు. ఇంటి నిర్మాణ అనుమతులకు భారీగా నగదు పెంచడడం పనులు జరగకపోవడానికి మరో కారణం. మమ్మల్ని సీఎం జగన్‌ నిండా ముంచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని